MLC KAVITHA: ఈడీ ఎదుట కవిత హాజరవుతారా..? కవిత అరెస్టు తప్పదా..?
కవితకు ఈడీ నోటీసులు పంపిన ప్రతిసారీ.. ఆమె విచారణ వాయిదా వేస్తూ.. తను కోరుకున్న సమయానికే హాజరయ్యారు. ఈసారి కూడా కవిత అదే పని చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈడీ నోటీసులు అందుకున్న కవిత ఈడీ సూచనల ప్రకారం శుక్రవారం విచారణకు హాజరయ్యే అవకాశం లేదు.

MLC KAVITHA: కొంతకాలంగా ఎలాంటి కదలికా లేని ఢిల్లీ లిక్కర్ స్కాం కీలక దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. ఈ స్కాంలో శుక్రవారం విచారణకు రావాల్సిందిగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు పంపింది. ఇదే సమయంలో కవితను ఈడీ అరెస్టు చేసే అవకాశం కూడా ఉందన్న ప్రచారం జరుగుతోంది. అయితే, కవిత హాజరవుతారా..? లేదా..? అనే దానిపై స్పష్టత రావాలి.
విచారణకు హాజరు కావాల్సిందిగా కవితకు ఈడీ నోటీసులు పంపిన ప్రతిసారీ.. ఆమె విచారణ వాయిదా వేస్తూ.. తను కోరుకున్న సమయానికే హాజరయ్యారు. ఈసారి కూడా కవిత అదే పని చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈడీ నోటీసులు అందుకున్న కవిత ఈడీ సూచనల ప్రకారం శుక్రవారం విచారణకు హాజరయ్యే అవకాశం లేదు. తనకు ముందుగా నిర్ణయించిన వేరే కార్యక్రమాలు ఉన్నందున శుక్రవారం విచారణకు హాజరుకాలేనని కవిత ఈడీకి సమాచారం పంపనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 19న లేదా మరో తేదీన విచారణకు హాజరవుతాని కవిత చెప్పే అవకాశం ఉంది. తన తండ్రి, సీఎం కేసీఆర్‌తో చర్చించిన తర్వాత ఈడీ విచారణకు హాజరయ్యే అంశంపై కవిత నిర్ణయం తీసుకుంటారని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. కవిత విచారణకు హాజరయ్యేందుకు గడువు కోరితే.. దీనికి ఈడీ అంగీకరిస్తుందా లేదా అన్నది చూడాలి. లిక్కర్ స్కాంలో నిందితులుగా ఉన్న దినేష్ అరోరా, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవ, అరుణ్ రామచంద్ర పిళ్లై, ఆడిటర్ బుచ్చిబాబు, శరత్ చంద్రా రెడ్డి అప్రూవర్లుగా మారారు. వీరిచ్చిన సమాచారం ఆధారంగానే కవితను మరోసారి ఈడీ అధికారులు విచారించబోతున్నారు. కవితను చివరగా గత మార్చిలో ఈడీ విచారించింది. ఆరు నెలల తర్వాత మళ్లీ ఈ కేసులో కవితను విచారించాలనుకోవడం సంచలనం కలిగిస్తోంది.
రాజకీయంగా ప్రాధాన్యం
మరోవైపు కవిత విచారణపై బీజేపీ స్పందించింది. ఈ అంశంలో బీజేపీ పాత్ర ఎంతమాత్రం లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే, కవిత విచారణ అంశం తెలంగాణలో రాజకీయంగా కచ్చితంగా ప్రాధాన్యం సంతరించుకుంటుంది. దీనిపై బీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటలయుద్ధం మరోసారి మొదలవుతుంది. కవితను అరెస్టు చేస్తే ఈ అంశంపై ఇరుపార్టీలూ విమర్శలకు దిగుతాయి. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో చూడాలి.