Chennamaneni Vikas Rao: వేములవాడలో బీజేపీకి లైన్ క్లియర్ చేశారా..? అసలేం జరిగింది..?
ఏం జరిగిందో ఏమో.. ఎమ్మెల్యే టిక్కెట్ కోల్పోయిన ఎమ్మెల్యే రమేష్ బాబుకు క్యాబినెట్ హోదా కలిగిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవి వచ్చింది. అక్కడి నుంచి కొత్త అభ్యర్థి బరిలోకి దిగాడు. ఈ పరిణామం బీజేపీకి అడ్వాంటేజ్‌గా మారే అవకాశాలు ఉన్నాయి.
Chennamaneni Vikas Rao: ‘‘వేములవాడలో ఏదో జరిగింది..?’ అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఆ అసెంబ్లీ సెగ్మెంట్‌పై మంచి పట్టు కలిగిన సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుకు కాకుండా మరో కొత్త అభ్యర్థికి కేసీఆర్ పార్టీ టికెట్ ఇచ్చింది. కట్ చేస్తే.. అదే చెన్నమనేని ఫ్యామిలీకి చెందిన వికాస్ రావును వేములవాడ బరిలోకి దింపేందుకు బీజేపీ రంగం సిద్ధం చేసింది. ఇవాళే (ఆగస్టు 30) వికాస్.. బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్‌రెడ్డి సమక్షంలో కమలదళం తీర్థం పుచ్చుకున్నారు. వికాస్ రావు.. బీజేపీ సీనియర్ నేత చెన్నమనేని విద్యా సాగర్ రావు తనయుడు. ఇక బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రమేష్ బాబు.. విద్యాసాగర్‌రావుకు స్వయానా అన్న అయిన చెన్నమనేని రాజేశ్వర్‌రావు కొడుకు. రాజకీయ దిగ్గజం చెన్నమనేని విద్యాసాగర్ రావుకు కేసీఆర్, కిషన్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అంటారు. ఏం జరిగిందో ఏమో.. సిట్టింగ్ టికెట్ కోల్పోయిన ఎమ్మెల్యే రమేష్ బాబుకు క్యాబినెట్ హోదా కలిగిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవి వచ్చింది. అక్కడి నుంచి కొత్త అభ్యర్థి బరిలోకి దిగాడు. ఈ పరిణామం బీజేపీకి అడ్వాంటేజ్‌గా మారే అవకాశాలు ఉన్నాయి.
వేములవాడ బరిలోకి వికాస్ రావు ప్రవేశంతో ఈటలకు షాక్ తగిలింది. ఎందుకంటే అక్కడి నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ తుల ఉమ పేరును ప్రతిపాదిద్దామని ఈటల భావించారట. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎర్రం మహేశ్ కూడా వేములవాడ టికెట్ కోసం ప్రయత్నించి భంగపాటుకు గురయ్యారు. చెన్నమనేని వికాస్ రావు రాకతో వేములవాడ బీజేపీలో రాజకీయ రగడ మొదలైంది. వాస్తవానికి వికాస్‌రావు గత ఏడాది కాలంగా ప్రతిమ ఫౌండేషన్ ద్వారా వేములవాడలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బీజేపీ క్యాడర్‌తోనూ ఆయన టచ్‌లో ఉంటున్నారు. ఇవన్నీ వికాస్‌కు ప్లస్ పాయింట్స్‌గా మారనున్నాయి. బీఆర్ఎస్ పార్టీ కొత్త అభ్యర్థిని బరిలోకి దింపడం అనేది.. తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న వికాస్‌కు అతిపెద్ద ప్లస్ పాయింట్‌గా మారనుంది. కొంచెం శ్రమించి ప్రచారం చేసుకుంటే.. గెలుపు ఆయన ముంగిట వాలడం ఖాయమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
దాదాపు నాలుగు దశాబ్దాలుగా వేములవాడ ప్రాంతంలో చెన్నమనేని కుటుంబ ఆధిపత్యమే నడుస్తోంది. చెన్నమనేని రాజేశ్వర్ రావు సీపీఐ తరఫున రాజకీయ జీవితాన్ని ప్రారంభించి.. దాదాపు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆయన సోదరుడు విద్యాసాగర్ రావు బీజేపీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. మెట్‌పల్లి నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు కరీంనగర్ ఎంపీగా ఆయన గెలుపొందారు. కేంద్రమంత్రిగా, గవర్నర్‌గా సేవలందించారు. చెన్నమనేని రాజేశ్వర్ రావు మరో సోదరుడు హనుమంత రావు.. నెహ్రూ సిద్ధాంతాలను ఫాలో అయ్యేవారు. రాజీవ్‌గాంధీ హయాంలో నేషనల్ ప్లానింగ్ కమిషన్‌లో సభ్యుడిగానూ పనిచేశారు. రాజేశ్వర్ రావు కుమారుడు రమేశ్ బాబు ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి వేములవాడ ఎమ్మెల్యేగా ఉన్నారు.