BRS MLA’s: బీఆర్ఎస్‌కు సిట్టింగ్ ఎమ్మెల్యేల టెన్షన్.. తిరగబడుతున్న కార్యకర్తలు.. టిక్కెట్లివ్వొద్దంటూ డిమాండ్..!

మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మానుకోట ఎమ్మెల్యే శంకర్ నాయక్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌తో పాటు మరికొందరు ఎమ్మెల్యేలపై స్థానిక నేతల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 19, 2023 | 01:45 PMLast Updated on: Jul 19, 2023 | 1:45 PM

Brs Sitting Mlas Face Backlash From Ticket Cadre Demands Wont Give Tickets To Them

BRS MLA’s: రాజకీయాల్లో ఏ నాయకుడికైనా కార్యకర్తలే బలం. ఏ పార్టీలో ఉన్నా.. గెలుపు, ఓటములను ప్రభావితం చేయగలిగేది కార్యకర్తలు, అనుచరులే. అయితే, వారినే సరిగ్గా చూసుకోకుంటే పతనం తప్పదు. తమ అనుకున్న అనుచరుల నుంచే తిరుగుబాటు మొదలవుతుంది. ప్రస్తుతం తెలంగాణలో అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొందరు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. సొంత పార్టీ కార్యకర్తలే తిరగబడుతున్నారు. తమ నేతకు టిక్కెట్లు ఇవ్వొద్దని, ఇస్తే ఓడిస్తామని బహిరంగంగానే చెబుతున్నారు. గత ఎన్నికల్లో కార్యకర్తలు ఎవరి గెలుపు కోసం కృషి చేశారో.. ఇప్పుడు వారి ఓటమి కోసమే ప్రయత్నిస్తున్నారు.
సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కొందరి వ్యవహారం బీఆర్ఎస్ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. నియోజకవర్గంలోని సొంత కార్యకర్తల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కొందరిపై వ్యతిరేకత ఉందని తన సర్వేలో తేలిందని, ఇకపై వారు తమ వైఖరి మార్చుకోకుంటే కష్టమేనని గతంలోనే పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ కొందరు నేతలను హెచ్చరించారు. మార్పు రాకపోతే టిక్కెట్లు ఇవ్వలేనని కూడా తేల్చి చెప్పారు. అయినప్పటికీ కొందరు ఈ విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకున్నారు. వైఖరి మార్చుకోవడం లేదు. అసలే ఎన్నికలకు మరికొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. ఇలాంటి సమయంలో లోపాలను సరిదిద్దుకోవాలి. నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండాలి. వీలైనన్ని సమస్యలు పరిష్కరించాలి. ఎలాంటి వ్యతిరేకత రాకుండా చూసుకోవాలి. ఈ సమయంలో వివాదాలకు దూరంగా ఉండాలి. అన్నింటికంటే ముఖ్యంగా తమకు తోడుగా నిలిచిన కార్యకర్తలు, అనుచరులను బాగా చూసుకోవాలి. వారిలో అసంతృప్తి లేకుండా చేయాలి. వారి డిమాండ్లు నెరవేర్చాలి. సొంత మనుషుల్లా చూసుకోవాలి. వివిధ కారణాలతో దూరమైన వారిని తిరిగి దగ్గర చేర్చుకోవాలి. అప్పుడే వాళ్లు నాయకుడిని ప్రజల దగ్గరకు తీసుకెళ్లి, గెలిపిస్తారు. కానీ, కొందరు మాత్రం ఇవేవీ చేయకుండా కిందిస్థాయి నేతల విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఇంకొన్నిచోట్ల అనుచరులపైనే అక్రమ కేసులు పెట్టిస్తున్నారు. దీంతో వాళ్లు తిరగబడుతున్నారు.
వీళ్లపైనే వ్యతిరేకత
బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఉమ్మడి కరీంనగర్‌తో పాటు వరంగల్‌ జిల్లాలకు చెందిన నేతలపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మానుకోట ఎమ్మెల్యే శంకర్ నాయక్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌తో పాటు మరికొందరు ఎమ్మెల్యేలపై స్థానిక నేతల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ అసంతృప్తిని కార్యకర్తలు, నేతలు బహిరంగంగానే వెలిబుచ్చుతున్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌పై కూడా తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ప్రజలతోపాటు, పార్టీ నాయకులతో కూడా ఆయన సరిగ్గా వ్యవహరించడం లేదు. బూతులు తిడుతూ, పోలీసులతో అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని రమేశ్‌పై మంత్రి ఎర్రబెల్లికి, మాజీ ఎంపీ వినోద్ కుమార్‌‌కు స్థానిక నేతలు ఫిర్యాదు చేశారు. రమేశ్‌ను ఆయన సొంత నియోజకవర్గమైన ఘన్‌పూర్‌కు పంపాలని, స్తానికంగా వేరొకరికి అవకాశం ఇస్తే గెలిపించుకుంటామని చెబుతున్నారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌పై బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారను. చందర్‌కు వ్యతిరేకంగా నియోజకవర్గంలోనే ‘ప్రజా ఆశీర్వాద యాత్ర’ పేరుతో ఏకంగా పాదయాత్ర చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో చందర్‌ను మార్చాలని, ఒకవేళ చందర్‌కు టికెట్ ఇస్తే మాత్రం రామగుండంలో బీఆర్ఎస్‌కు ఓటమి తప్పదని స్థానిక నేతలు హెచ్చరిస్తున్నారు.

మానుకోట ఎమ్మెల్యే శంకర్ నాయక్‌ తీరు కూడా వివాదాస్పదంగానే ఉంది. ఆయనకు వ్యతిరేకంగా సొంత పార్టీ కార్యకర్తలే గళమెత్తుతున్నారు. ఇటీవల సమావేశం ఏర్పాటు చేసుకున్న కొందరు ద్వితీయశ్రేణి నేతలు శంకర్ నాయక్‌కు టిక్కెట్ ఇవ్వొద్దని అధిష్టానానికి విన్నవించారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌పై కూడా స్థానిక నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఈసారి ఆయనకు పార్టీ టిక్కెట్ రావడం కష్టమేననే వాదన వినిపిస్తోంది. ఈ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే బస్వరాజు సారయ్య లేదా గుండు సుధారాణికి టికెట్ దక్కే అవకాశాలున్నాయి. మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌‌పై అనుచరగణం గుర్రుగా ఉంది. ఆయనపై తిరుగుబాటు చేసేందుకు స్థానిక నేతలే సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో రసమయికి కూడా ఈసారి టిక్కెట్ దక్కే అవకాశం లేదనే ప్రచారం జరుగుతోంది. నిజానికి ఆయనకు గత ఎన్నికల్లో టిక్కెట్ కష్టమనే ప్రచారం జరిగింది. కానీ, ఎలాగోలా చివరకు టిక్కెట్ దక్కించుకుని గెలవగలిగారు. వీరితోపాటు మరికొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అనుచరులు తిరగబడుతున్నారు. ప్రస్తుతానికి వీరిలో కొందరు ద్వితీయశ్రేణి నేతలు మౌనంగానే ఉన్నా.. ఎన్నికల సమయానికి హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉంది. పైగా కాంగ్రెస్ బలపడుతుండటంతో కొందరు నేతలు అటువైపు చూస్తున్నారు.