CM KCR: కేసీఆర్‌కు టైం కలిసిరావట్లేదా..? బీఆర్ఎస్‌లో మొదలైన టెన్షన్..!

టికెట్‌ ఆశించి భంగపడ్డ నేతలు పక్క చూపులు చూస్తుండటంతో కేసీఆర్‌లో రోజు రోజుకూ టెన్షన్‌ పెరిగిపోతోంది. ఇప్పటికే పొంగులేటి కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్లడంతో ఖమ్మం జిల్లా మీద దాదాపు ఆశలు వదులుకునే పరిస్థితికి వచ్చింది బీఆర్‌ఎస్‌ పార్టీ. ఇప్పుడు మరో కీలక నేత మైనంపల్లి హనుమంతరావు కూడా బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు ప్రకటించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 25, 2023 | 07:37 PMLast Updated on: Sep 25, 2023 | 7:37 PM

Brs Sitting Mlas Leaving Party Cm Kcr In Tension

CM KCR: ఒక్క స్పీచ్‌తో తెలంగాణ అటెన్షన్‌ మొత్తాన్ని తనవైపు తిప్పుకోగలిగిన నేర్పరి కేసీఆర్‌కు ప్రస్తుతం బ్యాడ్‌ టైం నడుస్తోంది. టికెట్‌ ఆశించి భంగపడ్డ నేతలు పక్క చూపులు చూస్తుండటంతో కేసీఆర్‌లో రోజు రోజుకూ టెన్షన్‌ పెరిగిపోతోంది. ఇప్పటికే పొంగులేటి కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్లడంతో ఖమ్మం జిల్లా మీద దాదాపు ఆశలు వదులుకునే పరిస్థితికి వచ్చింది బీఆర్‌ఎస్‌ పార్టీ. ఇప్పుడు మరో కీలక నేత మైనంపల్లి హనుమంతరావు కూడా బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు ప్రకటించారు.

మరో రెండు రోజుల్లో ఢిల్లీలో తన కొడుకుతో సహా కాంగ్రెస్‌ కండువా కప్పుకోబోతున్నారు. దీంతో మల్కాజ్‌గిరి స్థానం గెలవడం కూడా ఇప్పుడు కేసీఆర్‌కు పెద్ద టాస్క్‌. ఇదే పెద్ద తలనొప్పి అనుకుంటున్న టైంలో మరో ఎమ్మెల్యే బీఆర్‌ఎస్‌ను వీడుతున్నట్ట ప్రకటించారు. బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావ్ త్వరలో కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు టాక్‌ నడుస్తోంది. అక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయిన బాపురావ్‌ను కాదని వేరే వ్యక్తికి టికెట్‌ ఇవ్వడంతో ఆయన పార్టీ వీడాలని నిర్ణయించుకున్నారట. త్వరలోనే ఆయన కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు తెలుస్తోంది. ఇండిపెండెంట్‌గా నిలబడి ఎమ్మెల్యేగా గెలిచిన బాపురావ్‌.. తాను గెలవకపోయినా పర్లేదు కానీ బీఆర్‌ఎస్‌ను మాత్రం ఓడగొట్టాలి అనే కసితో ఉన్నారట.

ఇక ఖానాపూర్‌లో కూడా దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ను కాదని కేటీఆర్‌ స్నేహితుడు జాన్సన్‌ రాథోడ్‌కు ఇక్కడ టికెట్‌ ఇచ్చారు. దీంతో రేఖానాయక్ అధిష్టానానికి ఎదురు తిరిగారు. ఆమె భర్త ఇప్పటికే బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌‌లో జాయిన్‌ కూడా అయ్యారు. రేఖానాయక్‌ మాత్రం బీఆర్‌ఎస్‌లోనే ఉన్నా.. జాన్సన్‌ రాథోడ్‌ను మాత్రం గెలిపించేది లేదని వార్నింగ్‌ ఇచ్చారు. తనను కాదని ఖానాపూర్‌లో బీఆర్‌ఎస్‌ ఎలా గెలుస్తుందో చూస్తా అన్నట్టుగా స్టేట్‌మెంట్‌లు ఇస్తున్నారు. మరోపక్క ముందునుంచీ వివాదాస్పదంగా ఉన్న స్టేషన్‌ఘన్‌పూర్‌లో రాజయ్య రోజుకోమాట మాట్లాడుతున్నారు. నిన్నటి వరకూ కడియంకు మద్దతు తెలిపినట్టు కనిపించిన రాజయ్య.. తాజాగా తన కార్యకర్తలతో షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని.. ఆలోపు ఏదైనా జరగొచ్చంటూ కార్యకర్తలతో చెప్పారు రాజయ్య. తాను కడియంకు మద్దతిస్తానంటూ ఎక్కడా స్వయంగా చెప్పలేదంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. దీంతో అంతా సెట్‌ అయ్యింది అనుకున్న బీఆర్‌ఎస్‌ పార్టీకి మళ్లీ టెన్షన్‌ మొదలైంది.

రాజయ్యతో విభేదించి కడియం స్టేషన్‌ఘన్‌పూర్‌లో గెలవడం పెద్ద టాస్క్‌. జనగాం పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది. మొన్నటి వరకూ అలకబూనిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి.. కేటీఆర్‌తో మాట్లాడిన తరువాత కాస్త కూల్‌ అయినట్టు కనిపించారు. కానీ, ఇప్పటికీ ఆయన అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్టు ఆయన అనుచరవర్గంలో టాక్‌ నడుస్తోంది. చాన్స్‌ దొరికితే తాను ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆలోచనలో ముత్తిరెడ్డి ఉన్నట్టు టాక్‌. ఇదే జరిగితే జనగామ కూడా కష్టమే. ఇలా బీఆర్ఎస్‌ లిస్ట్‌లో చాలా నియోజకవర్గాలు వివాదాస్పదంగా ఉన్నాయి. తాము గెలవకపోయినా పర్లేదు కానీ బీఆర్‌ఎస్‌ను ఓడించాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఒకింత ప్రజా వ్యతిరేకత ఎదుర్కుంటున్న బీఆర్‌ఎస్‌ పార్టీ ఈ రెబల్స్‌ గాలిని తట్టుకుని ఎన్నికలు ఎలా దాటుతుందో చూడాలి మరి.