నెతన్యాహు చేతికి బంకర్ కిల్లర్స్ గాజాను తుడిచిపెట్టేందుకు రెడీ
2025 జనవరి 19వ తేదీ.. పదిహేను నెలల సుదీర్ఘ యుద్ధానికి బ్రేక్ పడిన రోజది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది ఆరోజే.

2025 జనవరి 19వ తేదీ.. పదిహేను నెలల సుదీర్ఘ యుద్ధానికి బ్రేక్ పడిన రోజది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది ఆరోజే. దీంతో అప్పటివరకూ భీకర దాడులతో దద్దరిల్లిన గాజాలో పిన్ డ్రాప్ సైలెన్స్ ఏర్పడింది. తర్వాత ప్రతి శనివారం ముగ్గురు బందీల చొప్పున విడుదలచేస్తూ వచ్చింది హమాస్. మూడు దశల ఒప్పందంలో భాగంగా తొలి దశలో 42 రోజులు తాత్కాలిక కాల్పుల విరమణ జరగాల్సి ఉంది. మొత్తం 33మంది బందీలను హమాస్ విడుదల చేయడం, బదులుగా తమ కారాగారాల్లో ఉన్న 737 మంది పాలస్తీనా ఖైదీలకు విడిచిపెట్టడం ఈ ఒప్పందం లక్ష్యం. ఈ నెల 11వ తేదీ వరకూ అంతా అనుకున్నట్టే జరిగింది. కానీ, ఈ నెల 15న రిలీజ్ చేయాల్సిన ముగ్గురు బందీలను విడిచిపెట్టబోమని హమాస్ చేసిన ప్రకటనతో సీన్ మారింది. చివరికి ట్రంప్, నెతన్యాహుల హెచ్చరికలతో హమాస్ ముగ్గురు బందీలను విడిచిపెట్టారు. దీంతో గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతుందనే అంతా అనుకున్నారు. కానీ, గాజాలో జరగకూడనిది ఇంకేదో జరుగుతోంది. అదేంటో ఇవాల్టి టాప్ స్టోరీలో చూద్దాం.
సీజ్ ఫైర్ డీల్‌గాలో భాగంగా ప్రతివారం ముగ్గురు బందీల విడుదలకు ఓకే చెప్పిన నెతన్యాహు ఇప్పుడు మొత్తం బందీలను ఒకేసారి విడుదల చేయాయాలని పట్టుబడుతున్నారు. బందీలుగా ఉన్న తమ పౌరులను విడుదల చేయకపోతే హమాస్‌ను లేకుండా చేస్తామని, హమాస్ ఉగ్రవాదులకు నరకం గేట్లు తెరుస్తామని వార్నింగ్ ఇచ్చారు. హమాస్‌ను పూర్తిగా నిర్మూలించడంపై తమ వద్ద ఉన్న వ్యూహాన్ని ఇప్పుడే చెప్పలేమనీ.. అమెరికా కూడా ఇందుకు సహకరిస్తుందన్నారు. ఇజ్రాయెల్ పర్యటనకు వచ్చిన అమెరికా స్టేట్ సెక్రటరీ మార్కో రుబియో ఎదుటే ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో రూబియో సైతం హమాస్‌ను ఇలానే బెదిరించారు. హమాస్‌ను నిర్మూలించాల్సిందే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. హమాస్‌కు పాలన చేసే సత్తా లేదా హింసకు పాల్పడగల బలం ఉన్నంతకాలం శాంతి అసాధ్యం అనీ.. హమాస్‌ను నిర్మూలిండం ఒక్కటే ఆప్షన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇటు నెతన్యాహు, అటు మార్కో రూబియో హెచ్చరికలు గాజాలో రీసౌండ్ ఇస్తున్న సేమ్ టైంలో ఇజ్రాయెల్ సైన్యాధిపతి అమెరికా ఫ్లైట్ ఎక్కడం హాట్ టాపిక్‌గా మారింది. సైన్యాధిపతి లెఫ్టినెంట్ జనరల్ హెర్జీ హలేవి మూడు రోజుల అమెరికా పర్యటనలో కీలక అధికారులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఆ సమావేశాల అజెండా ఏంటో ఇజ్రాయెల్, అమెరికా ప్రభుత్వాలు బయటకు చెప్పడం లేదు. మార్చి 6న హెర్జీ హలేవి తన పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఈ పర్యటన చర్చనీయాంశంగా మారింది. హెర్జీ పర్యటన వెనుక వ్యూహాత్మక కార్యాచరణ దాగి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనికి కొద్ది గంటల ముందే మరో కీలక పరిణామం జరిగింది. అమెరికా నుంచి 2000 పౌండ్ల బరువున్న ఎంకే-84 బాంబులు ఇజ్రాయిల్‌లోని అష్డోడ్ పోర్ట్‌కు చేరుకున్నాయి. దీంతో ఇజ్రాయెల్, అమెరికా కలిసి గాజాలో ఏదో పెద్ద ప్లానే వేస్తున్నాయన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి.
ఇజ్రాయెల్ అమెరికా పంపిన ఎంకే-84 బాంబులు సాధారణమైనవి కావు. వీటితో దాడిచేస్తే ఎంత పెద్ద భవనం అయినా నేలమట్టం కావడం ఖాయం, అంతేకాదు, ఆ భవనం పునాదుల కింద రహస్య బంక ర్లతో దాక్కొన్న వారు కూడా బయటపడే అవకాశం ఉండదు. అందుకే వీటిని బంకర్ బస్టర్లు అని కూడా పిలుస్తారు. పదిహేను నెలల యుద్ధంలో ఈ బాంబులే కీలకపాత్ర పోషించాయి. గాజాలో హమాస్, అటు లెబనాన్‌లో హిజ్బుల్లా కమాండర్లను అంతం చేయడంలో ఈ బాంబులదే కీ రోల్. కానీ, ఈ బాంబులను గాజాలోని జనావాసాలపై ఇజ్రాయెల్ ప్రయోగిస్తున్నట్టు ఆందోళనలు వ్యక్తం కావడం.. అమెరికాపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో వీటి సరఫరాపై గత బైడెన్ సర్కార్ నిషేధం విధించింది. ఐతే, ట్రంప్ ఛార్జ్ తీసుకున్న వెంటనే ఆ నిషేధాన్ని ఎత్తివేశారు. జనవరి 25న సముద్ర మార్గాన బయలుదేరిన 2000 పౌండ్ల MK-84 బాంబులు ఇజ్రాయిల్‌కు చేరుకున్నాయి.
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గాజా యుద్ధాన్ని తిరిగి ప్రారంభిస్తామనే పదే పదే చెబుతున్నారు. అమెరికాతో కలిసి తాము ఓ స్ట్రాటజీ రచించామనీ, దానిని రివీల్ చేయం అంటూనే హమాస్‌కు వార్నింగ్ ఇస్తున్నారు. అమెరికా సైతం హమాస్ అంతుచూడటమే తమ లక్ష్యమని తేల్చేసింది. తాజాగా రఫాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ముగ్గురు హమాస్ ప్రతినిధులు చనిపోయారు. దీనిపై హమాస్ ఆగ్రహంగా ఉంది. రెండో దశ కాల్పుల విరమణకుగాను మరోసారి చర్చలు జరగాలని, కాల్పుల విరమణతో పాటు గాజానుంచి ఇజ్రాయెల్ సైన్యం వెళ్లిపోవాలని హమాస్ అంటోంది. అంతేకాకుండా బందీల విడుదల కార్యక్రమాల్లో హమాస్ తన ఉనికిని చాటుకుంటోంది. గాజాపై ఇప్పటికీ తమకే పట్టుందన్న సంకేతాలు ఇస్తోంది. పాలస్తీనియన్లను గాజా నుంచి బయటకు పంపి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని పునర్నిర్మిం చాలని ట్రంప్ ఇటీవల చేసిన ప్రతిపాదన ఇప్పటికే పశ్చిమాసియాలో కలకలం రేపుతోంది. అరబ్ దేశాలు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ పరిణామాలన్నీ గాజాలో మళ్లీ భీకర యుద్ధం తప్పదన్న సంకేతాలే ఇస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ రూపొందించిన స్ట్రాటజీ అదే అయితే పశ్చిమాసియా మళ్లీ భగ్గుమనడం ఖాయం.