పులివెందులకు ఉప ఎన్నిక, రఘురామ చెప్పింది జగన్ చేయాల్సిందేనా…?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రతిపక్ష పార్టీల అధినేతలు ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడం సెన్సేషన్ అవుతుంది. తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ శాసనసభ సమావేశాలకు హాజరు కావడానికి ఆసక్తి చూపించడం లేదు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రతిపక్ష పార్టీల అధినేతలు ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడం సెన్సేషన్ అవుతుంది. తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ శాసనసభ సమావేశాలకు హాజరు కావడానికి ఆసక్తి చూపించడం లేదు. కేసిఆర్ కు ప్రతిపక్ష హోదా ఉన్నా సరే ఆయన సమావేశాలకు హాజరయ్యేందుకు ముందుకు రావటం లేదు. రేవంత్ రెడ్డి పదేపదే రెచ్చగొడుతున్న సరే కేసీఆర్ సైలెంట్ గానే ఉంటున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే టీడీపీ రెచ్చగొడుతున్న సరే, వైయస్ జగన్ మాత్రం అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదు.
తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే శాసనసభలో అడుగు పెడతానని వైఎస్ జగన్ ఇటీవల కాలంలో సభకు వెళ్లే ప్రయత్నం చేయకుండా పట్టుదలగానే ఉండిపోయారు. అయితే ఆయన సమావేశాలకు హాజరయ్యే అవకాశం లేదనే అభిప్రాయం గట్టిగానే వినపడుతోంది. వైసీపీ కష్టాలు పడుతున్న సమయంలో జగన్ సభకు వెళ్లకుండా సైలెంట్ గా ఉండటం పట్ల, ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడం పట్ల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జగన్ అయినా మరో ఎమ్మెల్యే అయినా సరే సరైన కారణంతో సెలవు కోసం దరఖాస్తు చేయకుండా, వరుసగా 60 రోజులు అసెంబ్లీకి ఆబ్సెంట్ అయితే వారు చట్ట ప్రకారం అనార్హతకు గురవుతారని రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు. రాష్ట్రంలో మొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలకు, ఈ నెలలో నిర్వహించబోయే శిక్షణ తరగతుల కార్యక్రమానికి లోక్సభ స్పీకర్ ఓమ్ బిర్లను ఆహ్వానించేందుకు ఢిల్లీ వెళ్లిన ఆయన, ఏపీ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సభకు అటెండ్ అవ్వని వైసీపీ అధినేత జగన్ సభకు రాకపోతే కచ్చితంగా పులివెందులకు ఉపఎన్నిక రావటం ఖాయమని ఆయన పేర్కొన్నారు.
జగన్ గత ఐదేళ్లలో ముందుగా రికార్డు చేసిన ప్రెస్ మీట్లో తప్పితే, నేరుగా మీడియాను కలిసిన పాపాన పోలేదని, కానీ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు మీడియా ముందు కొంత ఎక్కువగా కనిపిస్తున్నారని, ఒక శాసనసభ్యుడుగా అసెంబ్లీకి వచ్చి తన భావాలను వ్యక్తిపరిస్తే, ఆయనకు గౌరవంగా ఉంటుందన్నారు రఘురామ. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇవ్వని గౌరవం కోసం మంకుపట్టు పడితే ఫలితం ఉండదు అన్నారు. మొత్తం సభ్యుల్లో 10 శాతం బలం ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్న సాంప్రదాయాన్ని 1952 నుంచి ఫాలో అవుతున్నారని, ఇది ఆయనకు కూడా తెలుసు అన్నారు.
వరుసగా సభకు అటెండ్ కానీ వారిపై చర్యలు తీసుకోవడానికి చట్టంలోని నిబంధనలు అవకాశం కల్పిస్తున్నాయని అన్నారు. 60 రోజులు హాజారు కానందుకు… సెలవుకు దరఖాస్తు చేస్తే పరిశీలిస్తారని, లేదంటే 60 రోజులు దాటిన తర్వాత ఆయన ఆటోమేటిక్ గా ఎమ్మెల్యేగా అనర్హుడు అవుతాడని పేర్కొన్నారు. సభకు రాకుండా రిజిస్టర్ లో సంతకం పెట్టి వెళ్లిపోవచ్చు కదా అనే ప్రశ్నకు రఘురామా అవునని కూడా సమాధానం ఇచ్చారు. తన సీటు నిలబెట్టుకోవడానికి పనికొస్తుంది తప్ప, ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే సభకు రాను అన్న మాటకు విలువ ఉండదు అన్నారు.