Khalistan Supporters: కెనడాలో భారత దౌత్యవేత్తలకు భద్రత.. మరి ఖలిస్తాన్ ఉద్యమం సంగతేంటి..?
ఇండియాకు వ్యతిరేకంగా, ఖలిస్తాన్ కోసం ఈ నెల 8న సిక్కులు భారీ ర్యాలీ చేపట్టాలని నిర్ణయించారు. కెనడాలోని భారత దౌత్య కార్యాలయాల ఎదట నిరసన చేపట్టనున్నారు. అలాగే భారత దౌత్యవేత్తలకు హెచ్చరికలు కూడా జారీ చేశారు.
Khalistan Supporters: కెనడాలో ఖలిస్తాన్ ఉద్యమం ఊపందుకుంటోంది. ఇండియాలో కొందరు సిక్కులు తమకు ఖలిస్తాన్ పేరిట ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మన దేశంలో ఈ ఉద్యమ ప్రభావం తక్కువే అయినప్పటికీ ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికా, కెనడాల్లో పెద్దఎత్తున సాగుతోంది. వీటికి పరోక్షంగా అక్కడి ప్రభుత్వాలూ మద్దతు ఇస్తున్నట్లు కనిపిస్తోంది. కెనడా వైఖరే దీనికి నిదర్శనం.
కెనడాలో కొందరు సిక్కులు ఖలిస్తాన్ ఉద్యమానికి మద్దతిస్తున్నారు. ఇండియాలో ఖలిస్తాన్ ఏర్పాటు చేయాలంటూ కెనడాలో నిరసనలకు పిలుపునిచ్చారు. అలాగే సిక్కు సంస్థకు చెందిన గ్యాంగ్‌స్టర్ హర్దీప్ సింగ్ నిజ్జార్‌ను కొందరు దుండగులు కాల్చి చంపారు. దీనికి ఇండియానే కారణమంటూ అక్కడి సిక్కులు ఆరోపిస్తున్నారు. అందుకే ఇండియాకు వ్యతిరేకంగా, ఖలిస్తాన్ కోసం ఈ నెల 8న సిక్కులు భారీ ర్యాలీ చేపట్టాలని నిర్ణయించారు. కెనడాలోని భారత దౌత్య కార్యాలయాల ఎదట నిరసన చేపట్టనున్నారు. అలాగే భారత దౌత్యవేత్తలకు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ విషయాన్ని భారత్ ఖండించింది. ఖలిస్తాన్ అనుకూల ఉద్యమాన్ని అణచివేయాలని, భారత దౌత్యవేత్తలకు, రాయబార కార్యాలయాలకు రక్షణ కల్పించాలని కెనడాక సూచించింది. దీనిపై కెనడా స్పందించింది. భారత దౌత్యవేత్తలకు పూర్తి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చింది.
ప్రధాని స్పందనేది..?
ఇండియాకు వ్యతిరేకంగా ఇంత జరుగుతున్నా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడా మాత్రం దీనిపై సరిగ్గా స్పందించలేదు. భారత దౌత్యవేత్తలకు రక్షణ కల్పిస్తున్నామని చెప్పారే తప్ప.. ఖలిస్తాన్ ఉద్యమం విషయంలో కఠినంగా వ్యవహరించడం లేదు. నామమాత్రపు ప్రకటనలే చేస్తున్నారు. ఖలిస్తాన్ ఉద్యమాన్ని సరైంది కాదన్నారు. దీన్ని సీరియస్‌గా తీసుకుంటామని చెప్పారే కానీ.. ఆ రకమైన చర్యలు తీసుకున్నట్లు కనిపించడం లేదు. ప్రధానితోపాటు అక్కడి రాజకీయ నేతలు కూడా దీనిపై పెద్దగా మాట్లాడటం లేదు. దీని వెనుక రాజకీయ కారణాలున్నాయి. అవే సిక్కుల ఓట్లు.
18 మంది సిక్కు ఎంపీలు
కెనడాలో 24 లక్షల మంది వరకు భారతీయులు, భారత సంతతి ప్రజలున్నారు. అందులో ఏడు లక్షల మంది సిక్కులే ఉన్నారు. అంటే మెజారిటీ ఇండియన్స్ సిక్కులే. దీంతో వారి ఆధిపత్యం అక్కడ కొనసాగుతోంది. కొన్ని దశాబ్దాల క్రితమే గ్రేటర్ టొరంటో, వాంకోవర్ వంటి చోట్ల వీళ్లు స్థిరపడ్డారు. ఈ సిక్కులు రాజకీయంగా, ఆర్థికంగా బలంగా ఉన్నారు. కెనడా పార్లమెంట్‌లో 18 మంది సిక్కు ఎంపీలే ఉన్నారంటే వారి ఆధిపత్యం ఏ స్తాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇతర భారతీయులు కూడా ఉన్నప్పటికీ వారి ప్రభావం తక్కువ. దీంతో అక్కడి సిక్కు ఎంపీల మద్దతుతో సిక్కులు ఖలిస్తాన్ కోసం ఉద్యమిస్తున్నారు. రాజకీయపరంగా సిక్కులు, సిక్కు ఎంపీల మద్దతు అవసరం ఉండటంతో ప్రధాని సహా ఎవరూ ఖలిస్తాన్ ఉద్యమానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానించడానికి వెనుకాడుతున్నారు. ఫలితంగా ఖలిస్తాన్ ఉద్యమం ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతోంది. అయితే, కెనడాలో భారత సంతతికి చెందిన చంద్ర ఆర్య మాత్రం ఖలిస్తాన్ మద్దతుదారుల వైఖరిని ఖండించారు. వాళ్లు స్వేచ్ఛ పేరిట హింసను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. భారత దౌత్యవేత్తలపై హింసకు పాల్పడుతామని బహిరంగంగా హెచ్చరించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఖలిస్తాన్ ఉద్యమం విషయంలో కెనడా వైఖరిని మాత్రం భారత్ తప్పుబడుతోంది.