Pawan Kalyan: పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు.. పోసానిపై కేసు నమోదు చేయాలన్న కోర్టు..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను పోసానిపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో పోసానిపై రాజమండ్రి పోలీసులు కేసు నమోదు చేశారు. పవన్‌పై కొద్ది రోజుల క్రితం పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారు.

Pawan Kalyan: సినీ నటుడు, ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళికి ఎదురుదెబ్బ తగిలింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను పోసానిపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో పోసానిపై రాజమండ్రి పోలీసులు.. ఐపీసీ 354, 355, 500, 504, 506, 507, 509 సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. పవన్‌పై కొద్ది రోజుల క్రితం పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఏలూరులో జరిగిన వారాహి యాత్రలో పవన్ కల్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై విమర్శలు చేశారు. ఈ అంశం అప్పట్లో వివాదాస్పదమైంది.
పవన్ వ్యాఖ్యలకు పోసాని కౌంటర్ ఇచ్చారు. వాలంటీర్ వ్యవస్థ చాలా గొప్పదన్నారు. వాలంటీర్లలో ఆడవాళ్లు ఉంటారని, అలాంటి వాళ్లను తిట్టడం తగదన్నారు. భీమవరంలో పవన్ ఓడిపోవడానికి టీడీపీనే కారణమన్నారు. పవన్‌పై పోసాని పలు విమర్శలు చేశారు. దీనిపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంలో చర్యలు తీసుకోవాలని కోరుతూ జనసేన నేతలు పోలీసుల్ని ఆశ్రయించారు. రాజమండ్రి వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో జనసేన నేతలు కోర్టును ఆశ్రయించారు. పోసానిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కోర్టు పోసానిపై చర్యలు తీసుకోవాలని, కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో పోలీసులు వివిధ సెక్షన్ల కింద పోసానిపై కేసు నమోదు చేశారు.
గత ఏడాది కూడా పోసానిపై జనసేన పార్టీ రాజమహేంద్రవరం నేత యందం ఇందిరా ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై అప్పట్లోనే కేసు నమోదైంది. ఈ కేసు విచారణ సాగుతుండగానే.. మరోసారి పవన్‌పై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశాడు. పవన్‌పై గతంలో కూడా పలుసార్లు పోసాని తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కుటుంబంపై, వ్యక్తిగత జీవితంపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. 2021లో హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో పోసాని కృష్ణమురళి మీడియా సమక్షంలో పవన్‌పై, ఆయన కుటుంబంపై విమర్శలు చేశారు. ఈ సమయంలో పోసాని కృష్ణమురళిపై జనసేన కార్యకర్తలు దాడికి యత్నించారు. ఈ విషయం అప్పట్లో సంచలనంగా మారింది. దీనిపై జనసేన, పోసాని కృష్ణమురళి పరస్పరం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు.