సి ఎస్ కి కూడా కులగజ్జి అంటించేసారా?
ఏపీలో ఇప్పుడు ఏం జరిగినా దానికి కులాన్ని ఆపాదించడం అలవాటుగా మారిపోయింది. రాను రాను ప్రభుత్వం ,పార్టీలు అన్ని కులం చుట్టే తిరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో బీసీల భజన ఒకటి విపరీతంగా పెరిగింది.
ఏపీలో ఇప్పుడు ఏం జరిగినా దానికి కులాన్ని ఆపాదించడం అలవాటుగా మారిపోయింది. రాను రాను ప్రభుత్వం ,పార్టీలు అన్ని కులం చుట్టే తిరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో బీసీల భజన ఒకటి విపరీతంగా పెరిగింది. అన్ని పార్టీలు బీసీలకు ఏదో మేలు చేస్తున్నాయి అనే బిల్డప్ ఇవ్వడానికి…. ఏ స్థాయికి అయినా దిగజారి పోతున్నారు. చివరికి ఉన్నతాధికారులకు కూడా కులాన్ని ఆపాదించి,
క్రెడిట్ కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏపీ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా విజయానంద్ నియమితులయ్యారు. ఆ సందర్భంగా రాష్ట్రం మంత్రులు నలుగురు స్వయంగా ప్రెస్ నోట్లు విడుదల చేస్తూ… బీసీకి ప్రాధాన్యం ఇచ్చామని, బీసీల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పు కుంటూ వచ్చారు. అంతే కాదు జగన్ సర్కార్ ఉన్నతాధికారులందరినీ రెడ్లనే పెట్టిందని… అప్పట్లో చీఫ్ సెక్రటరీగా జవహర్ రెడ్డి, డి జి పి గా రాజేంద్రనాథ్ రెడ్డి తోపాటు కీలక పోస్టులన్నీ రెడ్లకి ఇచ్చారనే విషయాన్ని గుర్తు చేశారు మంత్రులు. ఏపీ మంత్రులు చేసిన ఈ బిసి ప్రెస్ నోట్ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకి దారి తీసింది. పొలిటికల్ పోస్టులు, నామినేటెడ్ పోస్టులు.. కులాలు లెక్కలు కట్టి… బీసీలు, ఎస్సీలు ,ఓసీలుగా చూసి ఇస్తారు తప్ప…. ఇలా బహిరంగంగా కులాల ఆధారంగా అధికారులకు పోస్టులు ఇస్తారా..? అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.
ఒక ఉన్నతాధికారిని…. పైగా రాష్ట్ర ప్రభుత్వంలో సి ఎస్ లాంటి అత్యున్నత ఉద్యోగిని కులం పేరుతో గుర్తించడం…. తామేదో ఆయనకు మేలు చేసినట్లుగా…. బహిరంగంగా చెప్పుకోవడం … ప్రభుత్వ ఉద్యోగుల్ని , ఉన్నత చదువులు చదివిన వాళ్ళని అవమానించి నట్లు కాదా? ప్రతి దాంట్లోనూ రాజకీయ ప్రయోజనాలు వెతుక్కోవడం ఎంతవరకు సబబు?. విజయానంద్ రాష్ట్రంలోని సీనియర్ ఐఏఎస్ అధికారుల్లో ఒకరు.1992 బ్యాచ్ కి చెందిన ఐఏఎస్ అధికారి. ఆయన అన్ని విధాలుగా చీఫ్ సెక్రటరీ పోస్టుకు తగిన వ్యక్తి. ఎటువంటి వివాదాలు లేని ఆఫీసర్. గతంలో జన్ కో సిఎండి పోస్ట్ తో పాటు మీద కీలక శాఖ ల్లో పని చేశారు. యాదవ కులానికి చెందిన విజయానంద్ ఏనాడు తాను బీసీనని చెప్పుకోలేదు. కులం ఆధారంగా తనకు ప్రత్యేకంగా పదోన్నతులు కావాలని అడగలేదు. ఇప్పుడు ఆయన కులం గురించి ప్రస్తావిస్తూ…. ఆయన బీసీ కనకే ఆయనకు చీఫ్ సెక్రటరీ ఇచ్చామని నలుగురు మంత్రులు నిస్సిగ్గుగా ప్రకటన చేయడం…. అది తమ ప్రభుత్వ గొప్పతనంగా చెప్పుకోవడం చాలా జగ్గుప్సాకారంగా ఉంది. నిజానికి కొత్త చీఫ్ సెక్రటరీ పోస్టుకు సీనియారిటీ ప్రకారం చూస్తే… ఐఏఎస్ అధికారులు శ్రీలక్ష్మి, సాయి ప్రసాద్, విజయానంద్ ముగ్గురు ఉన్నారు. శ్రీ లక్ష్మీ వివాదాస్పద ఐఏఎస్ అధికారి.
ఆమె పూర్తిగా మాజీ ముఖ్యమంత్రి ,వైసీపీ అధినేత జగన్ మనిషి. జగన్ అక్రమార్జన కేసులో గతంలో శ్రీలక్ష్మి జైలుకు కూడా వెళ్ళొచ్చింది. అందుకే ముఖ్యమైన చంద్రబాబు ఆమె పేరుని పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇక సాయి ప్రసాద్ 1991 బ్యాచ్ అధికారి.
పూర్తి అనుభవం ఉన్న ఐఏఎస్. విజయానంద్ 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. సాయి ప్రసాద్ కన్నా విజయానంద్ త్వరగా రిటైర్ అవుతారు. సాయి ప్రసాద్ కన్నా ఒక సంవత్సరం జూనియర్ అయినా ఆయన రిటైర్మెంట్ ని దృష్టిలో పెట్టుకొని ఆయనకు చీఫ్ సెక్రటరీ పోస్ట్ ఇచ్చింది ప్రభుత్వం. కానీ దీనిని మంత్రులు, టిడిపి నేతలు మరో రకంగా ప్రచారం చేశారు. ప్రసాద్ కమ్మ అయినందున, ముఖ్యమంత్రి ఆయన ఒకే కులం కనుక ఆయనకు చీఫ్ సెక్రటరీ ఇవ్వలేదని.
బీసీలకు న్యాయం చేయాలని లక్ష్యంతో,సిఎం తన సొంత కులం వాడిని కూడా పక్కన పెట్టి విజయనందుకు సిఎస్ పోస్ట్ ఇచ్చినట్టు నిస్సిగ్గుగా ,నిర్లజ్జగా చెప్పుకున్నారు కూటమి ప్రభుత్వ పెద్దలు. నిజానికి విజయానంద్ ఏనాడు తాను యాదవ కులం చెందిన వాడిని చెప్పుకోలేదు. ఆయన ట్రాన్స్కో, జెన్కో సంస్థలకి సీఎండీగా పని చేశారు. మంచి ఆఫీసర్. అన్నిటికన్నా అధికారంలో ఉన్న వాళ్ళ పట్ల అనుకువగా ఉంటారు . పారిశ్రామికవేత్తలతో కలిసిమెలిసి ఉంటారని ఒకటి అర విమర్శలు మినహాయించి విజయానంద్ సర్వీస్ పై పెద్ద ఆరోపణలు లేవు. ఎక్కడపడితే అక్కడ గుడ్డిగా సంతకాలు పెట్టకుండా పైవాళ్ళకి plus లు మైనస్లు చక్కగా వివరించగలుగుతారని కూడా ఆయన పేరు ఉంది. అలాంటి అధికారికి CS పోస్టింగ్ ఇచ్చి ఆయన కులాన్ని బహిరంగంగా అందరికీ చెప్పి విజయానంద్ ని అవమానించారు ఏపీ మంత్రులు. ఆయన ప్రతిభ కంటే కులానికి ప్రాధాన్యము ఇచ్చామని, కులం చూసి ప్రమోషన్ ఇచ్చామని చెప్పుకోవడం ద్వారా బిసిలందరినీ అవమానించారు. దారుణ మైన విషయం ఈ నలుగురు మంత్రులు బిసి లు కావడమే. ప్రతి అంశం లోనూ ప్రచారాన్ని వెతుక్కునే చంద్రబాబు u చివరికి చీఫ్ శెక్రటరీ నియామకం విషయం లో కూడా చీప్ పబ్లిసిటీ కి పాల్పడ్డారని జనం తిట్టుకుంటున్నారు.