YS Jagan: జగన్ గారూ ఇది విన్నారా.. ఇంగ్లీష్ పాయె.. తెలుగు వచ్చె…

ఏపీ ముఖ్యమంత్రి జగన్ గారేంటి.. ఇంగ్లీష్ మీడియం, బైజూస్ జపం చేస్తున్నారు. పైగా ఏపీలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను సీబీఎస్ఈ బోర్డుకు మార్చే ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 30, 2023 | 09:34 AMLast Updated on: Jul 30, 2023 | 9:34 AM

Cbse Decided To Educate In Local Languages

YS Jagan: అదేంటి.. మాతృభాషలో చదువా.. మోదీ గారెంటి అంత మాట అనేశారు. ఇకపై సాంఘిక శాస్త్రం నుంచి ఇంజినీరింగ్ వరకు మొత్తం చదువంతా మాతృభాషలోనే సాగుతుందా..? జాతీయ విద్యావిధానం అలా ఉంటే మరి మా ఏపీ ముఖ్యమంత్రి జగన్ గారేంటి.. ఇంగ్లీష్ మీడియం, బైజూస్ జపం చేస్తున్నారు. పైగా ఏపీలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను సీబీఎస్ఈ బోర్డుకు మార్చే ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారు. కానీ సీబీఎస్ఈ కూడా జాతీయ విద్యావిధానాన్ని అనుసరించి భారతీయ భాషల్లోనే విద్యాబోధన అందించేందుకు అన్ని సీబీఎస్ఈ స్కూల్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే.. జాతీయ విద్యావిధానం మాతృ భాషకు పెద్ద పీట వేస్తోంది.
సరే ఇక మన ఏపీ విషయానికొద్దాం.. వైసీపీ అధికారంలోకి రాగానే.. విద్యార్థులకు మేనమామగా మారిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. తెలుగు మీడియం స్కూల్స్ కు మంగళం పాడటం మొదలుపెట్టారు. అసలు తెలుగు మీడియం చదవులతో ఏమాత్రం ఉపయోగం ఉండదని, భవిష్యత్తు మొత్తం ఇంగ్లీష్ మీడియానిదే అంటూ ఊదరకొడుతూ వచ్చారు. మేనమామగా తాను ఏపీ పిల్లల భవిష్యత్తుకు ఇంగ్లీష్ మీడియం పేరుతో రాచబాట వేస్తుంటే.. తెలుగు.. తెలుగు అంటూ కొంతమంది మూర్ఖంగా వాదిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. పేదలకు ఇంగ్లీష్ మీడియం విద్య అందకుండా చేసేందుకు ప్రతిపక్షాలు, సోకాల్డ్ యెల్లో మీడియా కుట్రలు చేస్తున్నాయని, జగన్ తో పాటు వైసీపీ నేతలంతా తిట్ల పురాణం అందుకున్నారు.
వాస్తవానికి ఇంగ్లీష్ మీడియం చదువులను వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. కానీ తెలుగు వద్దు.. ఇంగ్లీషే ముద్దు అన్న కాన్సెప్ట్ దగ్గరే వివాదం మొదలవుతుంది. తెలుగు మీడియంలో చదివితే ఉద్యోగాలు రావు. తెలుగు మీడియం వల్ల గ్లోబల్ ప్రొజెక్షన్ ఉండదు. తెలుగు మీడియం తెలుగు రాష్ట్రాలకే పరిమితం. తెలుగులో బోధిస్తే అలా.. ఇలా.. అంటూ చాలా సిద్ధాంతాలు తెరపైకి తెచ్చారు. బోధన విషయంలో చాయిస్ లేకుండా.. అంతా ఇంగ్లీషే అనడంతోనే అసలు సమస్య. జాతీయ విద్యావిధానాన్ని అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం మాత్రం అన్ని భాషల్లో బోధన జరగాలని కోరుకుంటోంది. సీబీఎస్ఈ స్కూల్స్ లో కూడా ఇప్పుడు తెలుగులో బోధించే అవకాశం వచ్చింది. జగన్ గారు ఇంకా ఇంగ్లీష్ జపమే చేస్తారా.. లేక తెలుగుతో పాటు ఇంగ్లీష్ మాధ్యమాల్లో బోధిస్తారా అన్నది చూడాలి.