INDIA As BHARATH: ఇండియా ఇకపై భారత్‌గా మారబోతుందా..? కీలక మార్పులకు సిద్ధమైన కేంద్రం..!
జీ20 సదస్సులో సెప్టెంబర్ 9న జరిగే విందుకు సంబంధించి కేంద్రం విడుదల చేసిన జీవోలో ద ప్రెసిడెంట్ ఆఫ్ భారత్‌గా పేర్కొంది. రాష్ట్రపతి భవన్ నుంచే ఈ ఆదేశాలు వెలువడటం విశేషం.

INDIA As BHARATH: ఇండియా పేరు ఇకపై భారత్‌గా మారబోతుందా..? తాజా పరిణామాలు చూస్తుంటే ఔననే అనిపిస్తోంది. ఈ మేరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ వారంలో జరగబోతున్న జీ20 సదస్సుకు సంబంధించి రాష్ట్రపతి భవన్ విడుదల చేసిన ఆదేశాల్లో ఇండియా స్థానంలో భారత్ పేరు ఉండటమే దీనికి నిదర్శనం. ప్రభుత్వం విడుదల చేసిన ఒక నోటిఫికేషన్‌లో ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్థానంలో.. ద ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ఉండటం గమనార్హం. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ కూడా రిపబ్లిక్ ఆఫ్ భారత్ అని ట్వీట్ చేశారు. దీన్నిబట్టి ఇండియా పేరును శాశ్వతంగా భారత్‌గా మార్చేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ అభ్యంతరం
జీ20 సదస్సులో సెప్టెంబర్ 9న జరిగే విందుకు సంబంధించి కేంద్రం విడుదల చేసిన జీవోలో ద ప్రెసిడెంట్ ఆఫ్ భారత్‌గా పేర్కొంది. రాష్ట్రపతి భవన్ నుంచే ఈ ఆదేశాలు వెలువడటం విశేషం. దీనిపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇండియా పేరుతో ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడిన నేపథ్యంలో ఓటమి భయంతోనే ఇండియా పేరును భారత్‌గా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని విమర్శించింది. ప్రతిపక్ష ఇండియా పేరును మరుగునపర్చాలనే లక్ష్యంతోనే బీజేపీ దేశం పేరు మార్చే చర్యకు దగిందని కాంగ్రెస్ అభిప్రాయపడింది. ప్రస్తుతానికి పేరు మారుస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. ఇది ఇంకా పూర్తి స్థాయిలో అమలయ్యే అవకాశం లేదు. దీనిపై పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. త్వరలో జరగబోతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ బిల్లు ఆమోదం పొంది, రాష్ట్రపతి కూడా ఆమోదముద్ర వేస్తే.. ఇకపై పూర్తిస్థాయిలో అధికారికంగా ఇండియా స్థానంలో భారత్ అనే పేరు ఉంటుంది.
కీలక చట్టాల మార్పు
కేంద్ర ఇటీవలి కాలంలో చట్టాల్లో అనేక సంస్కరణలకు తెరతీస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలోనే ఐపీసీ, సీఆర్‌పీసీ సెక్షన్లు మారుస్తూ బిల్లు ప్రవేశపెట్టబోతున్నట్లు వెల్లడించింది. ఈ చట్టాలు బ్రిటీష్ కాలం నాటివి కావడం గమనార్హం. అందుకే నాటి కొలోనియల్ చట్టాల్ని రద్దు చేసి.. వాటికి పూర్తి భారతీయత ఇచ్చేలా చూడాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగానే ఇండియా పేరును భారత్‌గా మార్చబోతుంది. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే కేంద్రం దీనికి సిద్ధమైనట్లు స్పష్టమవుతోంది. అలాగే జమిలి ఎన్నికలపై కూడా త్వరలోనే కేంద్రం బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.