Chandra Babu: పులివెందులపై చంద్రబాబు “సానుభూతి” బాంబు !
వైఎస్ కుటుంబానికి కంచుకోట అయిన పులివెందులకు ఇటీవల వెళ్లిన చంద్రబాబు తన ప్రసంగంలో షర్మిల, సునీతల పేర్లను పదేపదే ప్రస్తావించారు. వివేకా కుమార్తె సునీతను పులివెందుల పులిగా ఆయన అభివర్ణించారు.
చంద్రబాబు.. రాజకీయ చాణక్యుడు! ఏ టైంలో ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయాలనేది ఆయనకు బాగా తెలుసు. “శత్రువు యొక్క శత్రువు మనకు మిత్రువు” అని వేల ఏళ్ల క్రితం చాణక్యుడు చెప్పిన సూత్రాన్ని ఇప్పుడు చంద్రబాబు తూ.చా తప్పకుండా ఫాలో అవుతున్నారు. అందులో భాగంగానే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల, వైఎస్ వివేకా కుమార్తె సునీతలపై చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వైఎస్ కుటుంబానికి కంచుకోట అయిన పులివెందులకు ఇటీవల వెళ్లిన చంద్రబాబు తన ప్రసంగంలో షర్మిల, సునీతల పేర్లను పదేపదే ప్రస్తావించారు. వివేకా కుమార్తె సునీతను పులివెందుల పులిగా ఆయన అభివర్ణించారు. “తండ్రిని(వైఎస్ వివేకా) చంపిన వాళ్లెవరో ప్రపంచానికి తెలియజేసేందుకు సునీత ధైర్యంగా పోరాడుతోంది. ఆడబిడ్డయినా ప్రాణాలకు తెగించి ముందుకు సాగుతోంది” అని చంద్రబాబు అన్నారు. ఇక షర్మిలకు సపోర్ట్ గా మాట్లాడుతూ .. “పాపం షర్మిల. ఎన్నికలకు ముందు ఆమెను జగన్ ఊరూరా తిప్పారు. నాకు కౌంటర్‌గా పాదయాత్ర చేయించారు. ఎంపీని చేస్తానన్నారు. ఆమెకు ఆస్తిలో సమాన వాటా ఇస్తానని వైఎస్ ఎప్పుడో చెప్పారు. కానీ జగన్ ఇవ్వలేదు. పాపం ఆమె తెలంగాణలో తిరుగుతోంది” అని బాబు కామెంట్ చేశారు.
యావత్ రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించేలా..
వైఎస్ కుటుంబానికి కంచుకోట అయిన పులివెందులలో ఈ వ్యాఖ్యలు చేయడం ద్వారా యావత్ రాష్ట్ర ప్రజల దృష్టిని టీడీపీ చీఫ్ ఆకర్షించారు. వైఎస్ ఫ్యామిలీలోని ఆడబిడ్డలకు అండగా మాట్లాడటం ద్వారా ఎంతోమంది వైఎస్ అభిమానుల దృష్టిలో తన ఇమేజ్ ను చంద్రబాబు మరింత పెంచుకున్నారు. షర్మిల, సునీతలపై సానుభూతి చూపిస్తున్న ప్రజానీకం దృష్టిలోనూ ప్లస్ పాయింట్స్ కొట్టేశారు. అంతేకాదు.. సొంత కుటుంబ సభ్యులతో వైఎస్సార్ సీపీ చీఫ్ జగన్ కు ఉన్న గ్యాప్ పై జనాల్లోకి పరోక్ష సందేశాన్ని చంద్రబాబు పంపగలిగారు. “వైఎస్ ఒక మాట చెబితే వివేకా జవదాటడని చెప్పేవారు. అలాంటి బాబాయిపై గొడ్డలి వేటు వేసిన వారికి మీరూ, మేమూ ఒక లెక్కా?” అనే కామెంట్ లో కూడా టీడీపీ చీఫ్ ఆచీతూచీ పాదాలను ప్రయోగించారు.
రాయలసీమ సెంటిమెంట్ తోనూ ..
“నేనూ రాయలసీమ బిడ్డనే. నాకు వయసైపోయిందని ఈ ముఖ్యమంత్రి (జగన్) ప్రచారం చేస్తున్నారు. నా విషయంలో వయసు ఒక అంకె మాత్రమే. సింహం ఎప్పటికీ సింహమే. నాతో మర్యాదగా ఉంటే నేనూ అలాగే ఉంటాను. తక్కువ అంచనా వేసినా, రెచ్చగొట్టినా కొదమసింహంలా విరుచుకుపడి అణచివేస్తాను” అని పులివెందుల గడ్డపై చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య వ్యవహారం.. సునీత చేస్తున్న న్యాయపోరాటాన్ని కూడా చంద్రబాబు తన వ్యాఖ్యలతో మరోసారి మీడియా తెరపైకి తెచ్చారు. వైఎస్సార్ రాష్ట్ర రాజకీయాల్లో తలమునకలై వుంటే, అన్న ఆకాంక్షలకు తగ్గట్టు లోకల్ గా ప్రజలతో వివేకా మమేకం అయ్యేవారు. వైఎస్సార్ పులివెందుల్లో లేని లోటును వివేకా భర్తీ చేసేవారు. అందుకే వైఎస్సార్‌తో కంటే వివేకాతోనే పులివెందుల వాసులకు ఎక్కువ అనుబంధం ఉంది.