Chandrababu Naidu: ఒకట్రెండు రోజుల్లోనే నన్ను అరెస్టు చేస్తారు.. ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఆరోపణలు
చంద్రబాబుపై ఐటీ స్కాంపై అభియోగాలు నమోదైన సంగతి తెలిసిందే. బాబు అవినీతిపై ఐటీ శాఖ నోటీసులు కూడా జారీ చేసింది. ఐటీ స్కాం, స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంపై ఏపీ సీఐడీ విచారణ జరుపుతోంది. ఈ కేసుల్లో చంద్రబాబును అరెస్టు చేసే అవకాశాలున్నాయనే ప్రచారం కూడా జరుగుతోంది.
Chandrababu Naidu: ఒకట్రెండు రోజుల్లో తనను అరెస్టు చేసే అవకాశం ఉందని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం తనపై తప్పుడు కేసులు పెడుతోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏపీలోని రాయదుర్గం పల్లె ప్రగతి కోసం ప్రజావేదిక కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబుపై ఐటీ స్కాంపై అభియోగాలు నమోదైన సంగతి తెలిసిందే. బాబు అవినీతిపై ఐటీ శాఖ నోటీసులు కూడా జారీ చేసింది. ఐటీ స్కాం, స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంపై ఏపీ సీఐడీ విచారణ జరుపుతోంది. ఈ కేసుల్లో చంద్రబాబును అరెస్టు చేసే అవకాశాలున్నాయనే ప్రచారం కూడా జరుగుతోంది.
ఈ నేపథ్యంలో చంద్రబాబు మాట్లాడారు. “వైసీపీ నేతలు రాష్ట్రంలో భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇలాంటి అరాచక పాలన కోసం ఇంటికి ఒకరు ముందుకు రావాలి. ఒకటి రెండు రోజుల్లో నన్ను కూడా అరెస్ట్ చేసే అవకాశం వుంది. నా పైనా దాడులు చేస్తారు. నా పైనే తప్పుడు కేసులు పెడుతున్నారు. నిప్పులా బతికాను. వ్యవస్థల్ని అడ్డం పెట్టుకుని వైసీపీ అరాచకాలకు పాల్పడుతోంది. గతంలో వైఎస్సార్ కూడా నాపై 20 ఎంక్వైరీలు వేశారు. కానీ, ఏమీ చేయలేకపోయారు. ఏదో కంపెనీ తీసుకొచ్చి, నా పేరు చెప్పించాలని చూస్తున్నారు. డబ్బు కూడా ఇస్తామని ఆశ పెడుతున్నారు” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఐటీ స్కాం, స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంపై ఏపీ సీఐడీ అధికారులు చంద్రబాబును విచారించే అవకాశం ఉంది. ఐటీ స్కాంలో మనోజ్ వాసుదేవ్ పార్ధసాని, స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో నిందితుడు యోగేశ్ గుప్తాను సీఐడీ విచారించబోతుంది. టిడ్కో ఇళ్ల నిర్మాణంలో రేట్లు పెంచి అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగాలు కూడా ఉన్నాయి. రెండు స్కాంలలో చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌పై కూడా ఆరోపణలున్నాయి. ఈ స్కాంలలో చంద్రబాబు దుబాయ్‌లో డబ్బు అందుకున్నారని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు దుబాయికి విచారణ కోసం వెళ్లనున్నారు. ఈ కేసుల్లో మరిన్ని ఆధారాలుంటే చంద్రబాబును అరెస్టు చేసే అవకాశాలున్నాయి.