Chandrababu Naidu: టీడీపీ కొత్త వ్యూహం.. బీజేపీని టార్గెట్ చేయాల్సిందే.. ఏపీలో మరో పొలిటికల్ వార్?

చంద్రబాబు స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ అలాగే ఉంటాయి. తనకు అవసరం ఉంటే ఒకలా.. లేకపోతే మరోలా. బీజేపీ విషయంలో 2018లో పొరపాటు చేశానని గ్రహించి.. తప్పుదిద్దుకున్నట్లు వ్యవహరించాడు. నాలుగేళ్ళ నుంచి బీజేపీతో స్నేహం గురించి చేయని ప్రయత్నం లేదు. పవన్ కళ్యాణ్ ద్వారా కూడా బీజేపీకి చేరువయ్యేందుకు ప్రయత్నించారు. అయితే, టీడీపీతో కలిసే ప్రసక్తే లేదని బీజేపీ తెగేసి చెప్పడంతో వ్యూహం మార్చేసింది టీడీపీ. నాలుగేళ్ళ తరువాత బీజేపీపై విమర్శలు గుప్పించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 21, 2023 | 05:00 PMLast Updated on: Apr 21, 2023 | 5:00 PM

Chandrababu Naidu Election Strategy

తాజాగా అచ్చెన్నాయుడు, పితాని బీజేపీపై విరుచుకు పడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినా.. లేదా జనసేనతో కలిసి పోటీ చేసినా గెలుస్తామనే గ్యారెంటీ వచ్చేసినట్లుంది. పైగా బీజేపీపై ఏపీ జనంలో వ్యతిరేకత ఉందని పసిగట్టి టీడీపీ వ్యూహం మార్చేసింది. ఇంకేముంది.. ఏపీలో కొత్తగా టీడీపీ వర్సెస్ బీజేపీ పొలిటికల్ వార్ కూడా కొనసాగబోతుంది.

రాజకీయం అంటే అంతే.. అవసరమే అన్నింటికీ ప్రాతిపదిక. ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఏం లాభం, ఏం నష్టం.. ఏ పార్టీని వ్యతిరేకిస్తే భవిష్యత్ అనే లెక్కల మీదే ప్రణాళికలుంటాయి. దీనికి అనుగుణంగా విధానాలు మారుతుంటాయి. ఇప్పుడు ఏపీలో ఈ లెక్క ప్రకారమే బీజేపీపై టీడీపీ విమర్శలు మొదలెట్టినట్లు కనిపిస్తోంది. మొన్నటివరకు బీజేపీని ఒక్క మాట కూడా అనని టీడీపీ నెమ్మదిగా బీజేపీపై విమర్శలు చేస్తోంది. ఇటీవల టీడీపీకి చెందిన మాజీ మంత్రి పితాని సత్య నారాయణ, అచ్చెన్నాయుడు బీజేపీపై విమర్శలు చేశారు. ఇదంతా టీడీపీ అధినేత చంద్రబాబు ప్లాన్ ప్రకారమే మొదలైనట్లు కనిపిస్తోంది. ఎన్నికలకు ఇంకో ఏడాది సమయం ఉన్న దృష్ట్యా బీజేపీపై టీడీపీ మరిన్ని విమర్శలు చేసే అవకాశం ఉంది.

వైసీపీతో బీజేపీ లోపాయికారీ ఒప్పందం నిజమేనా?
దేశానికి, రాష్ట్రానికి బీజేపీ అవసరమా అని ప్రశ్నించారు మాజీ మంత్రి పితాని. ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ వ్యతిరేకతతో ఉన్నట్లు కనిపిస్తున్నా.. లోపాయికారిగా ఆ పార్టీకి బీజేపీ సహకరిస్తోందని పితాని ఆరోపించారు. బీజేపీ, వైసీపీ.. రెండూ ఒక్కటే అని చెప్పారు. ఇది నిజమే అనిపించకమానదు కొన్ని అంశాల్ని పరిశీలిస్తే. అధికారికంగా రెండు పార్టీల మధ్య ఎలాంటి పొత్తూ లేదు. కానీ, కేంద్రంలో బీజేపీకి ఎలాంటి మద్దతు అవసరమైనా సరే వైసీపీ ముందుంటుంది. దేశంలో ఎన్ని పార్టీలు బీజేపీపై ఎన్ని విమర్శలు చేస్తున్నా వైసీపీ మాత్రం మోదీని కానీ.. బీజేపీని కానీ ఒక్క మాట కూడా అనలేదు. పోనీ ఇంత మద్దతు ఇస్తున్నప్పటికీ ఏపీకి బీజేపీ ఏమైనా ఒరగబెట్టిందా అంటే అదీ లేదు.

బీజేపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వదు. ఏపీకి గర్వకారణమైన విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటు పరం చేస్తోంది. అయినా వైసీపీ మౌనంగానే ఉంటుంది. ఏపీకి ఏ ప్రయోజనం కలగకపోయినా వైసీపీ నేతలు అడగరు. ఇది వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కనిపిస్తున్న వైఖరి మాత్రమే. చంద్రబాబు సీఎంగా.. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా బీజేపీ విధానాలు ఇలాగే ఉన్నాయి. అయితే, అప్పుడు మాత్రం టీడీపీ ప్రభుత్వాన్ని, చంద్రబాబును జగన్ విమర్శించారు. ఈ అంశాలపై కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించరు అంటూ జగన్ తెగ హడావుడి చేశాడు. ప్రత్యేక హోదా కోసం దీక్షలు చేశాడు. 25 మంది ఎంపీలను ఇస్తే అవన్నీ ఎందుకు రావు అంటూ చెప్పుకొచ్చాడు. తీరా జగన్ అధికారంలోకి రాగానే వాటి ఊసే మర్చిపోయాడు. కేంద్రాన్ని ఈ విషయంలో ప్రశ్నించకపోగా పూర్తిగా సపోర్టు చేస్తున్నాడు జగన్. మరోవైపు ఏపీలోని అవినీతి, జగన్ కేసుల విషయంలోనూ కేంద్రం సరిగ్గా స్పందించదు. దీంతో ఇరుపార్టీల మధ్య రహస్య ఒప్పందం ఉందనే ప్రచారం ఊపందుకుంది.

జగన్ ట్రాపులో పడ్డ చంద్రబాబు
2014లో అధికారం చేపట్టిన తర్వాత టీడీపీ, బీజేపీ కలిసే ఉన్నాయి. అయితే, తెలంగాణ బిల్లు సమయంలో హామీ ఇచ్చినట్లుగా ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వలేమని బీజేపీ తేల్చిచెప్పింది. ఇదే అంశాన్ని జగన్ తన రాజకీయ అస్త్రంగా మార్చుకున్నారు. చంద్రబాబు వైఫల్యం వల్లే ఏపీకి ప్రత్యేక హోదా రాలేదని ప్రచారం చేశాడు జగన్. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాడు. ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు చేశాడు. అయితే, జగన్ ఇక్కడే తన రాజకీయ చతురత ప్రయోగించాడు. ప్రత్యేక హోదా రానందుకు చంద్రబాబును విమర్శించాడే తప్ప బీజేపీని జగన్ ఏమీ అనలేదు. హోదా విషయంలో జగన్, ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి మేరకు తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు బీజేపీపై తిరుగుబాటు చేసి ఆ పార్టీకి దూరమయ్యారు. దీంతో మోదీతో, బీజేపీతో చంద్రబాబుకు ఉన్న బంధం తెగిపోయింది. దీనిలో నష్టపోయింది చంద్రబాబు. లబ్ధిపొందింది జగన్. ఎందుకంటే ఇదే అంశం జగన్ ఏపీలో గెలవడానికి.. చంద్రబాబు అధికారం కోల్పోవడానికి కారణమైంది. మరోవైపు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ప్రత్యేక హోదా ఊసే ఎత్తలేదు. దీంతో చంద్రబాబుకు నెమ్మదిగా విషయం అర్థమైంది.

తప్పు తెలుసుకున్న బాబు
జగన్ ట్రాపులో పడి బీజేపీకి దూరమవ్వడం తాను చేసిన పొరపాటు అని చంద్రబాబుకు నెమ్మదిగా అర్థమైంది. అందుకే ప్రతిపక్షంలో ఉన్న నాలుగేళ్లలో బీజేపీని టీడీపీ ఒక్క మాట కూడా అనలేదు. పైగా తిరిగి బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నించారు. అనేక విషయాల్లో ఏపీకి అన్యాయం జరుగుతున్నా.. మోదీని, బీజేపీని విమర్శించే ప్రయత్నం చేయలేదు. ఏదో ఒక రోజు తిరిగి టీడీపీ, బీజేపీ కలుస్తాయని నమ్మారు. కానీ, ఆయన ప్రయత్నాలేవీ ఫలించలేదు. టీడీపీని బీజేపీ విస్మరిస్తూనే వచ్చింది. ఆ పార్టీతో పొత్తులో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ద్వారా అయినా బీజేపీకి దగ్గరవ్వాలని చంద్రబాబు ప్రయత్నించారు. కానీ, దీర్ఘకాలిక వ్యూహాల్లో భాగంగా టీడీపీకి దూరంగా ఉండాలని బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయించుకుంది. దీంతో బీజేపీతో ఇక లాభం లేదనుకున్న చంద్రబాబు వ్యూహం మార్చినట్లు కనిపిస్తోంది.

ఇకపై సమరమే!
చంద్రబాబు అంచనా ప్రకారం ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తే ఈ కూటమి అధికారంలోకి రావడం పక్కా. టీడీపీతో కలిసేందుకు జనసేన సిద్ధంగానే ఉంది. మరోవైపు ఇప్పటికే జనసేన-బీజేపీ కూటమిగా ఉన్నాయి. కానీ, టీడీపీతో కలిసేందుకు బీజేపీ సిద్ధంగా లేదు. పైగా జనసేనను కూడా దూరంగా ఉంచేందుకు ప్రయత్నిస్తోంది. దీని ద్వారా అంతిమంగా లబ్ధిపొందేది వైసీపీ. ఆ పార్టీని అధికారంలోకి తేవడానికి ఇదంతా బీజేపీ అమలు చేస్తున్న వ్యూహంగా టీడీపీ చెబుతోంది. పైగా ఏపీలో బీజేపీకి పెద్దగా బలం లేదు. ఇప్పట్లో ఆ పార్టీ పుంజుకునే అవకాశం కూడా లేదు. దీంతో ఆ పార్టీపై విమర్శలు ఎక్కుపెడుతోంది టీడీపీ. అంతేకాకుండా.. బీజేపీ, వైసీపీ రెండూ ఒకటే అనే అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లబోతుంది. బీజేపీ రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ఆ పార్టీపై వ్యతిరేకత పెంచాలని, ఇదే జరిగితే బీజేపీతో బంధాన్ని తెంచుకుని జనసేన తమతో కలవాలని కూడా చంద్రబాబు భావిస్తున్నారు. మొత్తానికి ఇన్నాళ్లూ బీజేపీపై మెతకవైఖరి అవలంబించిన టీడీపీ ఇప్పుడు సమరానికి సై అంటోంది. మారుతున్న వైఖరితో జగన్‌ను కూడా మరింత టార్గెట్ చేసే ఉద్దేశం కనిపిస్తోంది. మరి బాబు వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.