Chandrababu Naidu: చంద్రబాబుకు తాత్కాలిక ఊరట.. ఐఆర్ఆర్ కేసులో ముందస్తు బెయిల్..
ఐఆర్ఆర్‌తోపాటు, అంగళ్లు కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అంగళ్లు కేసులో గురువారం వరకు, ఐఆర్ఆర్ కేసులో వచ్చే సోమవారం వరకు అరెస్టు చేయొద్దని సూచించింది. ఈ కేసులో పీటీ వారెంట్, పోలీస్ కస్టడీపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దని ఏసీబీ కోర్టుకు హైకోర్టు సూచించింది.
Chandrababu Naidu: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) అలైన్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తాత్కాలిక ఊరట లభించింది. ఈ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. వచ్చే సోమవారం వరకు చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే అంగళ్లు కేసులో కూడా గురువారం వరకు అరెస్టు చేయొద్దని ఆదేశించింది. చంద్రబాబు సీఎంగా ఉండగా జరిగిన ఐఆర్ఆర్ స్కాంలో ఆయన పాత్ర ఉందని ఆరోపిస్తూ, ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది.
ఈ కేసులో నిందితుల్లో చంద్రబాబు పేరు కూడా చేర్చింది. ఐఆర్ఆర్ అలైన్‌మెంట్ మార్పు ద్వారా చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్ధతో పాటు మాజీ మంత్రి నారాయణ, ఆయన కుటుంబ సభ్యులు, పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ లబ్ది పొందారని సీఐడీ ఆరోపిస్తోంది. దీంతో చంద్రబాబును ఈ కేసులో సీఐడీ అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తోంది. చంద్రబాబు ఇప్పటికే స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మాత్రమే అరెస్టై, రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఐఆర్ఆర్ కేసులో మాత్రం ఆయనను ఇంకా అరెస్టు చేయలేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు తరఫు లాయర్లు ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై బుధవారం ఉదయం విచారణ జరిగింది. చంద్రబాబు తరఫున లాయర్ దుమ్మాలపాటి శ్రీనివాస్, ఏపీ సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ తమ వాదనలు వినిపించారు. చంద్రబాబును అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని, ఆయన విచారణకు సహకరిస్తారని ఆయన తరఫున లాయర్ శ్రీనివాస్ కోరారు. దీనిపై స్పందించిన కోర్టు.. ఈ విషయంపై సీఐడీ, హోం శాఖతో మాట్లాడి చెప్పాలని సూచించింది.
అయితే, ఈ అంశంలో ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ పెండింగ్‌లో ఉందని, ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని సీఐడీ తరఫు లాయర్ కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. ఐఆర్ఆర్‌తోపాటు, అంగళ్లు కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అంగళ్లు కేసులో గురువారం వరకు, ఐఆర్ఆర్ కేసులో వచ్చే సోమవారం వరకు అరెస్టు చేయొద్దని సూచించింది. ఈ కేసులో పీటీ వారెంట్, పోలీస్ కస్టడీపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దని ఏసీబీ కోర్టుకు హైకోర్టు సూచించింది. ఇది చంద్రబాబుకు తాత్కాలిక ఊరటగా చెప్పుకోవచ్చు. మరోవైపు చంద్రబాబు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ శుక్రవారం జరగనుంది.