Chandrababu Naidu: కేసీఆర్‌కు చంద్రబాబు రిటర్న్‌ గిఫ్ట్ ఇస్తారా.. తెలంగాణలో టీడీపీ ప్లాన్ ఏంటి..?

2018 ఎన్నికల్లో గులాబీ పార్టీ టార్గెట్‌గా మహాకూటమి ఏర్పాటులో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. ఐతే ఆ ఎన్నికల్లో కారు పార్టీ అద్భుత విజయం సాధించింది. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని ఆ విజయోత్సవ వేడుకల్లో చెప్పిన కేసీఆర్‌.. 2019 ఎన్నికల్లో వైసీపీ, జగన్‌కు.. ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతుగా నిలిచారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 10, 2023 | 06:22 PMLast Updated on: Jun 10, 2023 | 6:23 PM

Chandrababu Naidu Gives Return Gift To Cm Kcr In Telangana In Upcoming Elections

Chandrababu Naidu: తెలంగాణ రాష్ట్రం ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయింది. నేతల మధ్య మాటలు తూటాల్లా పేలుతుంటే.. పార్టీల వ్యూహాలు అంతకుమించి అనిపిస్తున్నాయ్. మూడోసారి అధికారంలోకి రావాలని బీఆర్ఎస్‌.. గులాబీ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని కాంగ్రెస్‌.. తెలంగాణను గెలిచి దక్షిణాది రాష్ట్రాలకు తెలంగాణను గేట్‌వేగా మార్చుకోవాలని బీజేపీ.. ఎవరికి వారు తగ్గేదేలే అంటున్నారు. ఒకరిని మించి ఒకరు వ్యూహాలతో దూసుకుపోతున్నారు.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త పరిణామాలు వెలుగుచూస్తున్నాయ్. వైటీపీ కాంగ్రెస్‌తో కలుస్తుందా అని ఒకసారి.. తెలంగాణ జనసమితిని కోదండరాం ఏ పార్టీలో కలిపేస్తారు అని ఇంకోసారి.. బీజేపీ, టీడీపీ ఇక్కడ కలుస్తాయా అని మరోసారి.. ఇలా ఒక్కోసారి ఒక్కో రకమైన ప్రచారం తెలంగాణ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. మిగతా పార్టీల సంగతి ఎలా ఉన్నా.. బీజేపీతో కలిసేందుకు చంద్రబాబు ఆరాటపడుతున్నారు. ఏపీలోనూ, తెలంగాణలోనూ బీజేపీతో కలిసి పోటీ చేసేందుకు సిద్ధం అని సంకేతాలు కూడా ఇస్తున్నారు. తెలంగాణలో పార్టీని రీబౌన్స్‌ చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ప్రతి జిల్లాలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించి పరోక్షంగా ఇచ్చిన సంకేతాలు అవే!

ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల సమయంలో చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్న కేసీఆర్‌.. అన్నంత పని చేశారు. 2018 ఎన్నికల్లో గులాబీ పార్టీ టార్గెట్‌గా మహాకూటమి ఏర్పాటులో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. ఐతే ఆ ఎన్నికల్లో కారు పార్టీ అద్భుత విజయం సాధించింది. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని ఆ విజయోత్సవ వేడుకల్లో చెప్పిన కేసీఆర్‌.. 2019 ఎన్నికల్లో వైసీపీ, జగన్‌కు.. ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతుగా నిలిచారు. టీడీపీ ఓడిపోవడంలో కీలక పాత్ర పోషించారు. కట్ చేస్తే కేసీఆర్ ఇచ్చిన రిటర్న్‌ గిఫ్ట్‌ను రిటర్న్‌ ఇచ్చేందుకు చంద్రబాబు పట్టుదలతో కనిపిస్తున్నారు. దీనికోసం బీజేపీతో జతకట్టాలని ఫిక్స్ అయినట్లు కనిపిస్తున్నారు.

నిజానికి అసెంబ్లీలో టీడీపీకి ప్రాతినిధ్యం లేకపోయినా పసుపు పార్టీ చాలా జిల్లాల్లో బలంగానే ఉంది. ఉమ్మడి ఖమ్మం, నిజామాబాద్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌లోని కొన్ని నియోజకవర్గాల్లో సైకిల్‌ పార్టీకి బలం ఉంది. బీజేపీ గతంతో పోలిస్తే భారీగా పుంజుకుంది. కమలం పార్టీకి తమ బలం తోడు అయితే.. కేసీఆర్‌ మీద ప్రతీకారం తీర్చుకోవడం పెద్ద మ్యాటర్ కాదు అన్నది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తోంది. మరి బీజేపీ, టీడీపీకి పొత్తు కుదురుతుందా..? కుదిరినా కారును ఢీకొట్టడంలో సక్సెస్ అవుతారా..? కేసీఆర్‌కు చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారా..? అంటే.. కాలమే సమాధానం చెప్పాలి మరి..!