Chandrababu Naidu: పురంధేశ్వరి, నడ్డాతో చంద్రబాబు భేటీ.. ఢిల్లీ వేదికగా ఏం జరిగింది..?

చంద్రబాబు, తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన అర్ధాంగి, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, వైసీపీ ఎంపీ రఘురామరాజు తదితరులు జేపీ నడ్డాతో వేరుగా భేటీ అయ్యారు. ఇక్కడే అసలు సమస్య వచ్చింది. బీజేపీతో టీడీపీలోకి ఎలాగూ పొత్తులు లేవు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 28, 2023 | 04:55 PMLast Updated on: Aug 28, 2023 | 4:55 PM

Chandrababu Naidu Meets Jp Nadda In Delhi With Daggubati Purandeswari

Chandrababu Naidu: ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని.. తారకరాముడి గౌరవార్ధం ఆయన బొమ్మతో ముద్రించిన వంద రూపాయల నాణేన్ని విడుదల చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కూతురు, ఏపీ ప్రస్తుత బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరితో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా పాల్గొన్నారు. కట్‌ చేస్తే ఇక్కడే అసలు చర్చ మొదలైంది. పక్కనే కూర్చున్న నడ్డాతో.. చంద్రబాబు ఏదో మాట్లాడుతున్నప్పుడు తీసిన ఫోటో మీడియాలోకి వచ్చింది.

అది కాస్త ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ తర్వాత చంద్రబాబు, తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన అర్ధాంగి, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, వైసీపీ ఎంపీ రఘురామరాజు తదితరులు జేపీ నడ్డాతో వేరుగా భేటీ అయ్యారు. ఇక్కడే అసలు సమస్య వచ్చింది. బీజేపీతో టీడీపీలోకి ఎలాగూ పొత్తులు లేవు. అందువల్ల నడ్డాను చంద్రబాబు వేరుగా కలవాల్సిన అవసరం లేదు. ఐతే పురందేశ్వరిని వెంటబెట్టుకొని జేపీ నడ్డాతో చంద్రబాబు భేటీ అయ్యారంటే.. దాల్ మే కుచ్‌ కాలా హై అంటూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. రాబోయే ఎన్నికల్లో పొత్తుల వ్యవహారంపై ముగ్గురి మధ్య చర్చకు వచ్చినట్లు స్పష్టంగా అర్థం అవుతుందనే డిస్కషన్ మొదలైంది. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయా లేదా అన్నది ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాల్లో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. సైకిల్‌ను, కమలాన్ని కలిపేందుకు పవన్‌ ఎన్ని ప్రయత్నాలు చేసినా పెద్దగా సక్సెస్‌ కావడం లేదు. ఐతే బీజేపీ, టీడీపీ, జనసేన కలిస్తే బాగుంటుందని కమలం పార్టీలోని మెజారిటీ వర్గం ఫీల్ అవుతోంది.

ఇలాంటి సమయంలో ఈ ముగ్గురి భేటీ మరింత ఆసక్తికరంగా మారింది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరికి ఏపీలో రాజకీయ పరిస్థితుల గురించి బాగా తెలుసు. టీడీపీతో పొత్తులకు ఆమె కూడా సానుకూలంగా ఉన్నారనే గుసగుస వినిపిస్తోంది. అందుకే చంద్రబాబుతో కలిసి.. జేపీ నడ్డాతో భేటీ అయి ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయ్. ఒకవేళ టీడీపీతో బీజేపీ పొత్తులకి నడ్డా అంగీకరిస్తే.. తర్వాత వారందరూ అమిత్‌ షా, ప్రధాని మోదీతో భేటీ అయ్యే చాన్స్ ఉంటుంది. టీడీపీ, బీజేపీ పొత్తులు కానీ సెట్ అయితే.. ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోయే అవకాశం ఉంటుంది. ఏమైనా ఆ ముగ్గురి భేటీలో ఏం జరిగిందన్నది ఆ మూడు పార్టీలకు చెందిన వారు చెప్తే తప్ప క్లారిటీ వచ్చే అవకాశం లేదు.