Chandrababu Naidu: మీ ప్రేమను జీవితాంతం గుర్తుంచుకుంటా.. భువనేశ్వరి ఎమోషనల్ ట్వీట్..
బాబుకు స్వాగతం పలికేందుకు ఆయన కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలివచ్చారు. తమ ప్రియతమ నాయకుడిని చూసి భావోద్వేగానికి గురయ్యారు.

Chandrababu Naidu: 53 రోజుల నిరీక్షణ ముగిసింది. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరైంది. దాదాపు రెండు నెలలు జైలులోనే ఉన్న చంద్రబాబు మంగళవారం బయటకు వచ్చారు. బాబుకు స్వాగతం పలికేందుకు ఆయన కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలివచ్చారు. తమ ప్రియతమ నాయకుడిని చూసి భావోద్వేగానికి గురయ్యారు.
తాను జైలులో ఉన్నప్పుటు తనకు మద్దతుగా గళం వినిపించిన ప్రతీ ఒక్కరికీ చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన సతీమణి నారా భువనేశ్వరి కూడా పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఎమోషనల్ ట్వీట్ చేశారు. చంద్రబాబు అరెస్ట్ అయినప్పటి నుంచీ భువనేశ్వరి రాజమండ్రిలోనే ఉన్నారు. కార్యకర్తలను కలుస్తూ చంద్రబాబుకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించేందుకు నిజం గెలవాలి పేరుతో యాత్ర కూడా చేపట్టారు. ఎట్టకేలకు భర్తకు బెయిల్ రావడంతో తమకు అండగా ఉన్న పార్టీ కార్యకర్తలు, ప్రజలను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు.
“చంద్రబాబు అరెస్టుతో ఈ 53 రోజుల కాలం ఎంతో వేదన.. తట్టుకోలేనంత బాధతో, క్షణం ఒక యుగంలా గడిచింది. అయితే ఈ కష్ట సమయంలో తెలుగు జాతి నుంచి వచ్చిన మద్దతు మాకు ఎంతో ఊరటనిచ్చింది. సత్యం యొక్క బలం ఎంతో చూపించింది. ఎప్పుడూ బయటకు రాని మహిళలు సైతం, కక్ష సాధింపు రాజకీయాలపై పోరాటంలో, రోడ్డెక్కి చేసిన నిరసనలు, వారు చూపిన తెగువ, మాకు మరింత స్ఫూర్తినిచ్చాయి. నిజం గెలవాలి అనే పోరాటంలో మద్దతుగా నిలిచిన ప్రతీ సోదరుడికి, ప్రతీ మహిళకు, ప్రతీ పౌరుడికి శిరస్సు వంచి కృతజ్ఞతలు చెప్తున్నా. చంద్రబాబు అరెస్టుతో 53 రోజులుగా ఇక్కడే బస చేసిన నన్ను మీ ఇంటి బిడ్డలా చూసుకున్న రాజమహేంద్రవరం ప్రజల ఆదరణ, ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేను. ఆ దేవుడి దయతో ప్రజలకు, రాష్ట్రానికి మంచి జరగాలి అని కోరుకుంటున్నా” అంటూ ట్వీట్ చేశారు భువనేశ్వరి.