Chandrababu Naidu: చంద్రబాబు ప్రాజెక్టుల బాట..! నమ్మేదెవరు..?
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల స్థితిగతులను ప్రజలకు చాటి చెప్పడమే లక్ష్యంగా ఆయన జిల్లాల పర్యటనకు వెళుతున్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టులను గాలికి వదిలేసిందని, తక్కువ ఖర్చయ్యే ప్రాజెక్టులను కూడా పూర్తి చేయలేదని ఆయన ఆరోపిస్తున్నారు.
Chandrababu Naidu: వైసీపీ ప్రభుత్వంపై సరమశంఖం పూరించిన చంద్రబాబు ప్రాజెక్టుల బాట పట్టారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రాజెక్టులు పూర్తి చేయకుండా రైతులను దగా చేస్తోందంటూ జనంలోకి వెళుతున్నారు. మరి పంపకాలు తప్ప ప్రాజెక్టుల పనులపై ఫోకస్ పెట్టని ప్రభుత్వం ఆయన్ను ఎలా ఎదుర్కోబోతోంది..?
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల స్థితిగతులను ప్రజలకు చాటి చెప్పడమే లక్ష్యంగా ఆయన జిల్లాల పర్యటనకు వెళుతున్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టులను గాలికి వదిలేసిందని, తక్కువ ఖర్చయ్యే ప్రాజెక్టులను కూడా పూర్తి చేయలేదని ఆయన ఆరోపిస్తున్నారు. ఇటీవలే దానిపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజంటేషన్లు కూడా ఇచ్చారు. ఈ ప్రజంటేషన్లు జనంలోకి వెళ్లబోవని గుర్తించిన ఆయన తానే నేరుగా జనంలోకి వెళ్లి ఆ విషయాన్ని వారికి అర్థమయ్యేలా చెబుతున్నారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను బాబు పరిశీలించనున్నారు. నందికొట్కూరు నుంచి ప్రారంభించి శ్రీకాకుళం పాతపట్నం వరకు రెండున్నర వేల కిలోమీటర్లు తిరగాలన్నది చంద్రబాబు ప్లాన్.
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ ప్రాజెక్టుకు ఎంత ఖర్చు చేసింది.. ఈ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందీ ప్రజలకు వివరిస్తున్నారు చంద్రబాబు. తమ హయాంలోనే రైతులకు న్యాయం జరిగిందన్నది ఆయన వాదన. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ విడతల వారీగా ఆయన పర్యటిస్తారు. తాము అధికారంలోకి రాగానే ముందుగా చిన్న చిన్న ప్రాజెక్టులను, ఆ తర్వాత పెద్ద వాటిని పూర్తి చేస్తామని ప్రజలకు హామీ ఇవ్వనున్నారు. కర్నూలు సభలో చంద్రబాబు వైసీపీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. ప్రాజెక్టులకు తాను రూ.68వేల కోట్లు ఖర్చు పెడితే జగన్ మాత్రం రూ.22వేల కోట్లే ఖర్చు చేశారంటున్నారు. జగన్ ముక్కు నేలకు రాసి రాయలసీమ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బాబు డిమాండ్ చేశారు.
ఏపీకి జీవనాడిగా భావించే పోలవరం ప్రాజెక్టును కూడా చంద్రబాబు పరిశీలించే అవకాశం ఉంది. తాము అధికారంలో ఉన్నప్పుడు చాలా పనులు పూర్తి చేశామని కానీ వైసీపీ ప్రభుత్వం మిగిలిన ఆ కొద్దిపాటి పనులను కూడా పూర్తి చేయలేకపోయిందని ఆయన విమర్శిస్తున్నారు. కాంట్రాక్టర్‌ను మార్చారు కానీ పనులు మాత్రం పూర్తి చేయించలేకపోయారని ఆయన మండిపడుతున్నారు. రెండేళ్లలో పోలవరాన్ని పూర్తి చేస్తామన్న జగన్ ప్రభుత్వం పలుమార్లు డెడ్‌లైన్లు మార్చింది. ఇప్పుడు ఆ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో తెలియదని ఏకంగా మంత్రి అంబటి రాంబాబే చెప్పేశారు. త్వరగా పూర్తి చేస్తాం కానీ ఎప్పటికో చెప్పలేమంటున్నారు. చంద్రబాబు చేసిన తప్పుల కారణంగానే పనులు ఆలస్యమయ్యాయంటూ తప్పంతా గత ప్రభుత్వంపై వేసి చేతులు దులుపుకున్నారు. అయితే నాలుగేళ్లలో ఆ తప్పులను ఎందుకు సరి చేయలేకపోయారనే ప్రశ్నకు మాత్రం మంత్రి నుంచి సమాధానం లేదు.
చంద్రబాబును అడ్డుకోవడానికి వైసీపీ శ్రేణులు కూడా సిద్ధమవుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిన చంద్రబాబు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రాజెక్టులను అడ్డుపెట్టుకుని అడ్డంగా దోచుకున్నారని వారు ఆరోపిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని నిధుల కొరత వేధిస్తోంది. నెలనెలా సంక్షేమ పథకాలకే ఎక్కడ పడితే అక్కడ.. ఎలా పడితే అలా అప్పులు చేశారు. చివరకు ప్రభుత్వ ఆస్తులను కూడా తాకట్టు పెట్టారు. కార్పొరేషన్ల పేరిట రుణాలు తీసుకున్నారు. అయినా ఆ నిధులు చాలట్లేదు. ఉద్యోగులకు సరైన సమయానికి జీతాలు ఇవ్వలేకపోతున్నారు. నెలనెలా గండమే. అప్పుల కోసమే ఆర్థిక మంత్రి ఉన్నారు అన్నట్లు పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రాజెక్టులపై వైసీపీ సర్కార్ అసలు ఫోకస్ పెట్టలేదు. వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసే ప్రాజెక్టులను కూడా పూర్తి చేయలేకపోయింది. ఇప్పుడు వాటినే చంద్రబాబు హైలైట్ చేయబోతున్నారు. పట్టిసీమను రికార్డు సమయంలో పూర్తి చేసి కృష్ణా-గోదావరిలను అనుసంధానం చేసిన ఘనత చంద్రబాబుకు దక్కుతుంది. పోలవరం కాలువలనే అందుకు వాడుకున్నప్పటికీ ఆ ఆలోచన మాత్రం మంచి ఫలితాలనే ఇచ్చింది. కృష్ణాబేసిన్‌ను కాపాడగలిగామని, తాను అధికారంలోకి వస్తే గోదావరి నీటిని రాయలసీమకు తరలించేలా ప్రయత్నాలు చేస్తానని చంద్రబాబు హామీలు ఇవ్వబోతున్నారు. మరి ఈ హామీలు ఆయనకు ఓట్లు కురిపిస్తాయా..?