Chandrababu Naidu: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన చంద్రబాబు.. మహిళలతో ముఖాముఖి
తాజాగా గురువారం.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేట నియోజకవర్గం, ఆలమూరులో ఆర్టీసీ బస్సులో చంద్రబాబు ప్రయాణించారు. టిక్కెట్ తీసుకుని, బస్సులో వెళ్తూ, అందులో ప్రయాణిస్తున్న మహిళలతో మాట్లాడారు. మహిళల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు.
Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి, మహిళలతో మాట్లాడి వాళ్ల సమస్యలు తెలుసుకున్నారు. ప్రస్తుతం చంద్రబాబు టీడీపీ ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారెంటీ అనే కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ వర్గాల ప్రజలతో బాబు మమేకం అవుతూ స్థానిక సమస్యలు తెలుసుకుంటున్నారు.
తాజాగా గురువారం.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేట నియోజకవర్గం, ఆలమూరులో ఆర్టీసీ బస్సులో చంద్రబాబు ప్రయాణించారు. టిక్కెట్ తీసుకుని, బస్సులో వెళ్తూ, అందులో ప్రయాణిస్తున్న మహిళలతో మాట్లాడారు. మహిళల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. భారంగా మారిన నిత్యావసర వస్తువుల ధరలు, ప్రభుత్వ పన్నుల గురించి మహిళలు తమ అవేదన వ్యక్తం చేశారు. కరెంట్ బిల్లులు వేలల్లో వస్తున్నాయని, తీవ్ర భారంగా మారాయని మహిళలు చంద్రబాదు దృష్టికి తెచ్చారు. ఆర్టీసీకి సంబంధించి చంద్రబాబు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై మహిళలు హర్షం వ్యక్తం చేశారు. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ప్రకటించిన మహా శక్తి పథకం లబ్ధిని మహిళలకు చంద్రబాబు వివరించారు. తమ ప్రభుత్వం అమలు చేయబోయే ఆరు పథకాల గురించి తెలియజేశారు.
మధ్యలో ప్రభుత్వ పనితీరు, రోడ్ల పరిస్థితిపై ప్రయాణికుల నుంచి వివరాలు ఆరా తీశారు. బస్సులో రావులపాలెం వరకు చంద్రబాబు వెళ్లారు. ప్రజలు, స్థానికులతో మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాల్ని స్వయంగా మహిళలకు వివరించారు. టీడీపీ ప్రభుత్వంతోనే సర్పంచ్‌లకు హక్కులు, గౌరవం లభిస్తాయన్నారు. నిధుల కోసం సర్పంచ్‌ల పోరాటంతో జగన్ పారిపోవాలని తెలిపారు. సర్పంచుల అధికారాలు తీసేసిన జగన్.. తన అధికారం తొలగిస్తే ఊరుకుంటాడా..? అని చంద్రబాబు ప్రశ్నించారు.