Chandrababu Naidu: జైల్లో తన ప్రాణాలకు ముప్పు ఉందన్న చంద్రబాబు.. ఏసీబీ జడ్జికి లేఖ..

నాకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది. నేను జైలుకు వచ్చినప్పుడు అనధికారికంగా నన్ను వీడియోలు, ఫొటోలు తీశారు. ఆ ఫుటేజ్‌ను స్వయంగా పోలీసులే లీక్ చేశారు. నా ప్రతిష్టను దెబ్బ తీసేందుకే వీడియో ఫుటేజ్ రిలీజ్ చేశారు. ఎస్ కోటకి చెందిన ఓ ముద్దాయి జైల్లో పెన్ కెమెరాతో విజువల్స్ తీస్తున్నారని నా దృష్టికి వచ్చింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 27, 2023 | 01:30 PMLast Updated on: Oct 27, 2023 | 1:30 PM

Chandrababu Naidu Wrote A Letter To Acb Judge On His Security

Chandrababu Naidu: రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. అక్కడ తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఏసీబీ జడ్జికి చంద్రబాబు లేఖ రాశారు. మరోవైపు చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ నుంచి హైకోర్టు జడ్జి తప్పుకొన్నారు. ఇటీవల కోర్టు విచారణకు చంద్రబాబు వర్చువల్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా జైలులో ఏదైనా సమస్యలుంటే తనకు లిఖిత పూర్వకంగా అందజేయాలని చంద్రబాబుకు జడ్జి సూచించారు. దీంతో చంద్రబాబు ఈ నెల 25న ఏసీబీ కోర్టు జడ్జికి లేఖ రాశారు. ‘‘నాకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది. నేను జైలుకు వచ్చినప్పుడు అనధికారికంగా నన్ను వీడియోలు, ఫొటోలు తీశారు.

ఆ ఫుటేజ్‌ను స్వయంగా పోలీసులే లీక్ చేశారు. నా ప్రతిష్టను దెబ్బ తీసేందుకే వీడియో ఫుటేజ్ రిలీజ్ చేశారు. ఎస్ కోటకి చెందిన ఓ ముద్దాయి జైల్లో పెన్ కెమెరాతో విజువల్స్ తీస్తున్నారని నా దృష్టికి వచ్చింది. నన్ను అంతమొందించేందుకు వామపక్ష తీవ్రవాదులు కుట్ర పన్నుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా ఎస్పీకి ఈ విషయమై లేఖ కూడా వచ్చింది. ఆ లేఖపై ఇప్పటి వరకు పోలీస్ అధికారులు ఎలాంటి విచారణ జరపలేదు. నా కదలికల కోసం జైలుపై అనధికారికంగా డ్రోన్లు ఎగరేస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్లే ఈ డ్రోన్లు ఎగరేశారని భావిస్తున్నాను. డ్రోన్లు ఎగరేసిన ఘటనలో ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవు. ఈ నెల 6న నన్ను కలవడానికి నా కుటుంబసభ్యులు వచ్చిన సందర్భంలో సెంట్రల్ జైలు మెయిన్ గేట్ వద్ద మరో డ్రోన్ ఎగరేశారు. నా భద్రతే కాదు.. నా కుటుంబ సభ్యులకు ప్రమాదం పొంచి ఉందనే ఆందోళనతో ఉన్నా.

నాలుగున్నరేళ్ల కాలంలో నాపై వివిధ సందర్భాల్లో అధికారంలో ఉన్న వాళ్లు దాడులు చేశారు. గంజాయి ప్యాకెట్లు జైలు ప్రాంగణంలో గార్డెనింగ్ చేస్తున్న ఖైదీల వద్దకు విసిరేస్తున్నారు. ఇక్కడి ఖైదీల్లో 750 మంది తీవ్ర నేరాలకు పాల్పడిన వారు ఉన్నారు. కొందరు ఖైదీల వల్ల నాకు తీవ్ర ముప్పు పొంచి ఉంది’’ అని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. కాగా, స్కిల్ డెవలప్‌మెంట్ కేసు వెకేషన్ బెంచ్ ముందుకు విచారణకు రాగా, జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప ‘నాటి బిఫోర్ మీ’ అంటూ విచారణ నుంచి తప్పుకొన్నారు.