Chandrababu Naidu: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు.. తీర్పు వాయిదా..

చంద్రబాబు తరఫున సీనియర్ లాయర్లు హరీష్ సాల్వే, సిద్ధార్థ్ లూథ్రా వర్చువల్‌గా వాదనలు వినిపించారు. సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ వాదించారు. ఇరు పక్షాల మధ్య హైకోర్టులో వాడివేడిగా వాదనలు కొనసాగాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 19, 2023 | 05:58 PMLast Updated on: Sep 19, 2023 | 6:40 PM

Chandrababu Naidus Bail Request Adjourned To Thursday

Chandrababu Naidu: స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ముగిసింది. దీనిపై కోర్టు తీర్పు వాయిదా వేసింది. తనపై అక్రమ కేసు నమోదు చేశారని చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ దాఖలు చేశారు. అలాగే రిమాండ్ రివ్యూ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ అంశాలపై చంద్రబాబు తరఫు లాయర్లు, సీఐడీ తరఫు లాయర్ల మధ్య హైకోర్టులో సుదీర్ఘ వాదనలు సాగాయి. చంద్రబాబు తరఫున సీనియర్ లాయర్లు హరీష్ సాల్వే, సిద్ధార్థ్ లూథ్రా వర్చువల్‌గా వాదనలు వినిపించారు. సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ వాదించారు. ఇరు పక్షాల మధ్య వాడివేడిగా వాదనలు కొనసాగాయి.
చంద్రబాబుకు ఈ కేసుతో సంబంధం లేదని, ఆయనను రాజకీయ దురుద్దేశంతో, అక్రమంగా అరెస్టు చేశారని ఆయన తరఫు లాయర్లు కోర్టుకు తెలిపారు. ఈ కేసులో చంద్రబాబు ప్రమేయంపై ఆరోపణలు లేవని, ఆయన అరెస్టు సమయంలోనే రిమాండ్ రిపోర్టు విషయంలో నిబంధనలు పాటించలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే చంద్రబాబును అరెస్టు చేశారని, అవినీతి నిరోధక చట్టం గురించి, సెక్షన్ 17 ఏ గురించి ప్రస్తావించారు. గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబును అరెస్టు చేయడం చట్ట విరుద్ధమని చంద్రబాబు తరఫు లాయర్లు పేర్కొన్నారు.

ఈ వాదనలపై సీఐడీ తరఫు లాయర్లు స్పందించారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌కు అర్హుడు కాదని సీఐడీ లాయర్ ముకుల్ రోహత్గీ అన్నారు. రెండేళ్ల విచారణ తర్వాత, సరైన ఆధారాలతోనే చంద్రబాబును అరెస్టు చేసినట్లు తెలిపారు. విచారణ చేస్తున్న అధికారులకు స్వేచ్ఛ ఇచ్చి, క్వాష్ పిటిషన్ కొట్టేయాలన్నారు. సెక్షన్ 319 ప్రకారం ఎన్ని చార్జిషీట్లు అయినా వేయొచ్చని, ఎంతమందినైనా విచారించవచ్చని, ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేయించడం ద్వారా నిధుల దుర్వినియోగం జరిగినట్లు తేలిందని కోర్టుకు తెలిపారు. నిధుల దుర్వినియోగంపై లెక్కలు తేలాలన్నారు. నకిలీ కంపెనీల ద్వారా నిధులు మళ్లించినట్లు చెప్పారు. క్వాష్ పిటిషన్‌పై వాదనలు కొనసాగుతుండగానే ఏపీ హైకోర్టులో మరో బెంచ్ ముందు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో దాఖలు చేసిన పిటిషన్ విచారణ ఈ నెల 21కి వాయిదా పడింది. మరోవైపు స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో వాదనలు ముగియడంతో తీర్పును గురువారానికి వాయిదావేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.

ఏసీబీ కోర్టులో చంద్రబాబుపై సీఐడీ మరో పీటీ వారెంట్
చంద్రబాబుపై ఫైబర్ నెట్ స్కాంలో సీఐడీ మరో పీటీ వారెంట్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించింది. ఫైబర్ నెట్ స్కాంలో చంద్రబాబు ప్రధాన ముద్దాయిగా ఏసీబీ పేర్కొంది. ఈ స్కాంలో రూ.121 కోట్ల నిధులు దోచుకున్నారని సిట్ నివేదిక ఇచ్చింది. 2021లోనే ఫైబర్ నెట్ స్కాంపై 19 మందిపై సీఐడీ కేసు నమోదు చేసింది. A1గా వేమూరి హరిప్రసాద్, A2గా మాజీ ఎండీ సాంబశివరావును చేర్చింది. చంద్రబాబుకు వేమూరి హరిప్రసాద్ అత్యంత సన్నిహితుడు. ఫైబర్ నెట్ స్కాంలో చంద్రబాబు పాత్ర ఉందన్న సీఐడీ వివరించింది. టెర్రా సాఫ్ట్‌ సంస్థకి అక్రమ మార్గంలో టెండర్లు ఇవ్వడంపై సీఐడీ విచారణ జరిపింది. నిబంధనలకు విరుద్ధంగా టెండర్ గడువు వారం రోజులు పొడిగించినట్లు తెలిపింది. బ్లాక్ లిస్ట్‌లో ఉన్న టెర్రా సాఫ్ట్‌కి టెండర్ దక్కేలా చక్రం తిప్పారని వేమూరిపై ఆరోపణలున్నాయి. ఫైబర్ నెట్ ఫేజ్-1లో రూ.320 కోట్లకు టెండర్లు వేశారు. ఇందులో రూ.121 కోట్ల అవినీతి జరిగిందని సీఐడీ ఆరోపిస్తోంది.