Chandrababu Naidu: బాబుగారి గొప్పలు ఇంకెంతకాలం.. వాస్తవాలు గ్రహించరా? ఇలాగైతే కష్టమే!
తాను చేసిన, చేయని పనుల గురించి కూడా చంద్రబాబు గొప్పలు చెప్పుకొంటూ ఉంటారు. గతంలో చంద్రబాబు ఏం చెప్పినా.. ఏం చేసినా చెల్లింది. అయితే.. ఇప్పుడు తరం మారింది. కాలం మారింది. రాజకీయమూ మారింది. కానీ, చంద్రబాబు మాత్రం ఇంకా మారలేదేమో అనిపిస్తోంది ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే.
Chandrababu Naidu: ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తనను తాను విజనరీ పర్సన్‌గా చెప్పుకొంటూ ఉంటారు. అవకాశం దొరికినప్పుడల్లా తనకన్నా గొప్ప విజన్ ఉన్న నేత రాజకీయాల్లో కనబడరు అన్నట్లు మాట్లాడుతుంటారు. తాను చేసిన, చేయని పనుల గురించి కూడా గొప్పలు చెప్పుకొంటూ ఉంటారు. గతంలో చంద్రబాబు ఏం చెప్పినా.. ఏం చేసినా చెల్లింది. అయితే.. ఇప్పుడు తరం మారింది. కాలం మారింది. రాజకీయమూ మారింది. కానీ, చంద్రబాబు మాత్రం ఇంకా మారలేదేమో అనిపిస్తోంది ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే. ఇప్పటికీ అవే గొప్పలు చెప్పుకొంటూ రాజకీయాల్లో నెట్టుకొద్దామనుకుంటున్నారు. కానీ, అది కుదరని పని అని గ్రహించేనా?
చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్న సమయంలో, రెండు దశాబ్దాల క్రితం విజన్ 2020 నినాదం అందుకున్నారు. 2020లోపు రాష్ట్రాన్ని, దేశాన్ని మార్చేయాలనుకున్నారు. విజన్ 2020ని విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు. అప్పట్లో ఆయన హైదరాబాద్‌లో ఐటీకి ప్రాధాన్యం ఇచ్చింది నిజమే. దీనికోసం హైటెక్ సిటీ కట్టించారు. అయితే, అప్పటి నుంచి ఐటీని తానే అభివృద్ధి చేశానని పదేపదే చెప్పుకొంటున్నారు. హైటెక్ సిటీని చూపించి హైదరాబాద్‌ను కూడా తానే అభివృద్ధి చేశానంటూ చెబుతారు. బిల్‌గేట్స్‌ను హైదరాబాద్ తీసుకొచ్చిన ఘనత తనదే అంటారు. అబ్దుల్ కలాంను రాష్ట్రపతిగా ప్రతిపాదించింది తానేనని అనేకసార్లు చెప్పుకొన్నారు. సెల్‌ఫోన్ రావడానికి కూడా కారణం నేనే అని బాబు గత ఏడాదే చెప్పారు. తన విజన్ వల్లే దేశంలో సెల్‌ఫోన్ విప్లవం వచ్చిందన్నారు. దేశ ఆర్థిక సంస్కరణల్లో తన పాత్ర చాలా కీలకంగా ఉందని తెలిపారు. ఇలా చెప్పుకొంటూ పోతే బాబుగారి గొప్పలు ఎన్నో. వీలున్నప్పుడల్లా చంద్రబాబు ఈ విషయాల్ని గుర్తు చేస్తూ ఉంటారు. ఎప్పుడో.. ఏదో చేసేశానని చంద్రబాబు ఇప్పుడు చెప్పుకొంటే ఏం ప్రయోజనం?
ఇప్పుడు కొత్త పల్లవి
గతంలో విజన్ 2020 అని చెప్పుకొన్న చంద్రబాబు ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న విజన్ 2047కు మద్దతిస్తున్నట్లు చెప్పారు. ప్రధాని మోదీ చెబుతున్న విజన్-2047తో ఏకీభవిస్తున్నట్లు పేర్కొన్నారు. 2047కల్లా ఇండియాను ప్రపంచ నెంబర్ వన్ దేశంగా చూడాలన్నది తన కల, లక్ష్యమని వెల్లడించారు. 1995 నుంచే ఐటీ, రెండో తరం ఆర్థిక సంస్కరణల గురించి ప్రస్తావించినట్లు గుర్తు చేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వంలో చేరాలని అప్పటి ప్రధాని వాజ్‌పేయి తనను కోరినట్లు, తమ పార్టీకి 7-8 మంత్రి పదవులు ఇస్తానని ఆయన చెప్పినట్లు, తాను వాటిని కాదన్నట్లు తాజాగా చంద్రబాబు చెప్పుకొచ్చారు. యూదులకంటే భారతీయుల సంపద ఎక్కువగా ఉండాలని అభిప్రాయపడ్డారు.
కాలం మారింది.. బాబు మారరా?
నిజమే.. చంద్రబాబు నాయుడు చేసిన కొన్ని మంచి పనులను కాదనలేం. ముఖ్యంగా ఐటీ రంగం అభివృద్ధికి కృషి చేశారు. కానీ, దీనికి తానొక్కడే కారణం అన్నట్లు చెప్పుకొంటారు. హైదరాబాద్ అభివృద్ధి, జాతీయ రాజకీయాల్లో తన పాత్ర.. ఇలా సందర్భాన్నిబట్టి ప్రతి అంశాన్ని తనకు అనుకూలంగా చెప్పుకొంటారు. అయితే, వీటివల్ల ప్రయోజనం ఏంటి? ఒకప్పుడు చంద్రబాబు ఏం చెబితే అది చెల్లిందేమో కానీ.. ఇప్పుడు కాదు. కాలం మారింది. పదేపదే గొప్పలు చెప్పుకొంటూ ఉంటే జనాలు నవ్వుకొంటారు. సెల్‌ఫోన్లు కూడా తానే తెచ్చానంటే నమ్ముతారా? ఇది ప్రపంచమంతా వచ్చిన మార్పు కాదా? నేటి తరం ఓటర్లకు ఇలాంటివన్నీ వినే ఓపిక లేదు. ప్రస్తుత రాజకీయాలకు అనుగుణంగా చంద్రబాబు మారాలి. పాత పద్ధతులు, మూస విధానాలు పక్కనబెట్టాలి. నిజంగా తన వల్ల జరిగిన మంచిని చెప్పుకొంటే చాలు. నాడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన చంద్రబాబుకు.. నేడు కనీస ఓట్లు కూడా తెచ్చుకోలేకపోతున్న చంద్రబాబుకు చాలా తేడా ఉంది. పాత విషయాల్ని గుర్తు చేసుకుంటే కాలక్షేపానికే పనికొస్తాయి. ఇప్పుడేమాత్రం ప్రాధాన్యం లేని విషయాల్ని గుర్తు చేసుకుంటే ఉపయోగం లేదు. అందుకే తన తర్వాత వచ్చిన యువతరం నాయకుల్ని చూసి బాబు తన పద్ధతులు మార్చుకోవాలి. అప్పుడే చంద్రబాబును ప్రజలు నమ్ముతారు.