Chandrababu Naidu: చంద్రబాబు రిమాండ్.. ఏపీ బంద్‌కు టీడీపీ పిలుపు.. వైసీపీ శ్రేణుల సంబరాలు..!
చంద్రబాబు నాయుడు రిమాండ్‌ను వైసీపీ శ్రేణులు ఘనంగా జరుపుకొంటున్నాయి. మరోవైపు ఏపీవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసనలకు దిగాయి. సోమవారం ఏపీ బంద్‌కు టీడీపీ పిలుపునిచ్చింది.

Chandrababu Naidu: ఏపీలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. చంద్రబాబు నాయుడుకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు వెలువడటంపై వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటుంటే.. టీడీపీ శ్రేణులు నిరసనలు, ఆందోళనలకు దిగాయి.
ప్రస్తుతం ఏపీ రాజకీయం చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుతోంది. ఆయన రిమాండ్‌ను వైసీపీ శ్రేణులు ఘనంగా జరుపుకొంటున్నాయి. నగరిలో మంత్రి రోజా స్వీట్లు పంచి, టపాసులు పేల్చి సంబరాలు జరుపుకొన్నారు. మంత్రి అంబటి రాంబాబు, ఐటీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ కూడా హర్షం వ్యక్తం చేశారు. విశాఖసహా అనేక చోట్ల వైసీపీ శ్రేణులు స్వీట్లు పంచుతూ, టపాసులు కాల్చుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు అరెస్టు ఆరంభం మాత్రమేనని, ఆయన చేసిన ఎన్నో కుంభకోణాలు బయటకొస్తాయని వ్యాఖ్యానిస్తున్నాయి వైసీపీ శ్రేణులు.
సోమవారం ఏపీ బంద్..
మరోవైపు ఏపీవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసనలకు దిగాయి. అనేక చోట్ల ప్రభుత్వం, జగన్ దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నారు. రోడ్లపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాగా, చంద్రబాబు రిమాండ్‌ను నిరసిస్తూ సోమవారం ఏపీ బంద్‌కు టీడీపీ పిలుపునిచ్చింది. ప్రజాస్వామ్యం అపహాస్యం అయిందంటూ టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. అయితే చంద్రబాబు రిమాండ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. అనేక మండలాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ర్యాలీలు, నిరసనలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్లే మార్గంలో ఎలాంటి సమస్యా తలెత్తకుండా రహదారి మొత్తం గట్టి భద్రత ఏర్పాటు చేశారు. స్పెషల్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. అనేక చోట్ల ముందు జాగ్రత్త చర్యగా టీడీపీ నేతల్ని అదుపులోకి తీసుకోగా, కొన్ని చోట్ల హౌజ్ అరెస్ట్ చేశారు.