Chandrababu Naidu: చంద్రబాబు క్వాష్ పిటిషన్‍పై విచారణ అక్టోబర్ 3కు వాయిదా..
మొదట ఈ కేసు విచారణను చేపట్టేందుకు సుప్రీం జడ్జి ఎస్వీఎన్ భట్టి నిరాకరించారు. ఆయన నాట్ బిఫోర్ మి అని చెప్పడంతో కేసు దాఖలు చేసిన లాయర్ సిద్ధార్థ్ లూథ్రా సీజేఐ ముందు మళ్లీ మెన్షన్ చేశారు. ఈ కేసును వెంటనే మెన్షన్ చేయాలని లూథ్రా సీజేఐని కోరారు.
Chandrababu Naidu: స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విచారణ అక్టోబర్ 3కు వాయిదా పడింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ కింద గవర్నర్ అనుమతి తీసుకోకుండా తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. అంతకుముందే ఈ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. దీంతో చంద్రబాబు శనివారం సుప్రీంను ఆశ్రయించారు.
బుధవారం ఈ కేసు విచారణకు వచ్చింది. మొదట ఈ కేసు విచారణను చేపట్టేందుకు సుప్రీం జడ్జి ఎస్వీఎన్ భట్టి నిరాకరించారు. ఆయన నాట్ బిఫోర్ మి అని చెప్పడంతో కేసు దాఖలు చేసిన లాయర్ సిద్ధార్థ్ లూథ్రా సీజేఐ ముందు మళ్లీ మెన్షన్ చేశారు. ఈ కేసును వెంటనే మెన్షన్ చేయాలని లూథ్రా సీజేఐని కోరారు. “నిజానికి ఈ కేసు అనేకసార్లు విచారణ వాయిదాపడుతూ వచ్చింది. మరోవైపు కేసులో చంద్రబాబును పోలీస్ కస్టడీ కోరుతున్నారు. ఆర్టికల్ 17ఏ కింద న్యాయనిబంధన ఉంది. ఇది మూలాల నుంచి చర్చించాల్సిన అంశం. నా క్లయింట్ అన్యాయంగా అరెస్టై, సెప్టెంబర్ 8 నుంచి నిర్బంధంలో ఉన్నారు. కేసు త్వరగా లిస్టు చేయాలన్నది మా మొదటి అభ్యర్థన. మధ్యంతర ఉపశమనం కలిగించాలని రెండో అభ్యర్థన. ఎఫ్ఐఆర్ ప్రకారం చంద్రబాబును కస్టడీలో పెట్టకూడనటువంటి కేసు ఇది. మేము బెయిల్ కోరుకోవడం లేదు. జడ్ క్యాటగిరీ, ఎన్‍ఎస్‍జీ సెక్యూరిటీ ఉన్న వ్యక్తిని ఇలా ట్రీట్ చేస్తారా..? ఇది పూర్తిగా వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన విషయం.
యశ్వంత్ సిన్హా కేసులో వ్యక్తి స్వేచ్ఛపై అన్ని విషయాలు పొందుపరిచారు. నా క్లయింట్ చంద్రబాబుకు పోలీసు కస్టడీ నుంచి మినహాయింపు కోరుతున్నా” అంటూ సిద్ధార్థ లూథ్రా కోర్టులో వాదించారు. దీనిపై స్పందించిన సీజేఐ.. కేసు విచారణలో సంయమనం పాటించాలని ట్రయల్ కోర్టు జడ్జికి చెప్పలేమన్నారు. కేసు విచారణను అక్టోబర్ 3కు వాయిదా వేశారు.