Chandrababu Naidu: చంద్రబాబుకు భారీ షాక్.. మరో 11 రోజులు రాజమండ్రి జైలులోనే..!
చంద్రబాబు రిమాండ్ వచ్చే నెల 5 వరకు పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఆదివారం నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం మరో 11 రోజులు.. అంటే అక్టోబర్ 5 వరకు చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులోనే రిమాండ్ ఖైదీగా ఉండనున్నారు. మరోవైపు చంద్రబాబు సీఐడీ కస్టడీ ముగిసింది.
Chandrababu Naidu: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు మరో భారీ షాక్ తగిలింది. చంద్రబాబు రిమాండ్ వచ్చే నెల 5 వరకు పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఆదివారం నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం మరో 11 రోజులు.. అంటే అక్టోబర్ 5 వరకు చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులోనే రిమాండ్ ఖైదీగా ఉండనున్నారు. మరోవైపు చంద్రబాబు సీఐడీ కస్టడీ ముగిసింది. చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలులో సీఐడీ అధికారులు శని, ఆది వారాల్లో విచారించారు.
చంద్రబాబు రిమాండ్ పొడిగించాలని కోరుతూ సీఐడీ తరఫు లాయర్లు విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు కస్టడీ, రిమాండ్ పొడిగించాలని సీఐడీ అధికారులు న్యాయమూర్తిని కోరారు. దీనిపై విచారణ సందర్భంగా సీఐడీ, చంద్రబాబు లాయర్ల మధ్య వాదోపవాదాలు జరిగాయి. రిమాండ్ పొడిగింపును చంద్రబాబు వ్యతిరేకించారు. ఈ కేసు విచారణలో వర్చువల్‌గా చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విచారణలో చంద్రబాబును జడ్జి పలు ప్రశ్నలు అడిగారు. విచారణ సందర్భంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించారా అని చంద్రబాబును జడ్జి ప్రశ్నించారు. దీనికి చంద్రబాబు లేదని, ఈ విషయంలో ఎలాంటి సమస్య లేదని సమాధానమిచ్చారు. చంద్రబాబు రిమాండ్ పొడిగింపు సందర్భంగా.. ఇప్పుడే అంతా అయిపోయిందని భావించాల్సిన అవసరం లేదని, కేవలం విచారణ మాత్రమే జరుగుతోందని, జ్యుడీషియల్ కస్టడీలో మాత్రమే ఉన్నారని బాబుకు జడ్జి సూచించారు.
కాగా, కేసు విచారణకు సంబంధించిన ప్రాథమిక సాక్ష్యాధారాలను బయటపెట్టాలని చంద్రబాబు అడిగారు. విచారణ సమయంలో ఈ వివరాలను బయటపెట్టడం సరికాదని జడ్జి సూచించారు. ఈ వివరాలు చంద్రబాబు లాయర్ల దగ్గరి నుంచి అడిగి తెలుసుకోవాలన్నారు. 11 రోజుల రిమాండ్ పొడిగిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నట్లు జడ్జి తెలిపారు. సీఐడీ కస్టడీ ముగిసినందున చంద్రబాబును జైలు అధికారులకు అప్పగించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. సీఐడీ కస్టడీ పొడిగించాలని కోర్టును సీఐడీ అధికారులు కోరారు. దీనికోసం మరో పిటిషన్ దాఖలు చేస్తే పరిశీలిస్తామని కోర్టు చెప్పింది. కాగా చంద్రబాబు తరఫున ఆయన లాయర్లు వరుస పిటిషన్లు దాఖలు చేయడంపై జడ్జి అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వరుస పిటిషన్లతో కోర్టు సమయం వృథా అవుతుందని, విచారణలో జాప్యం జరుగుతుందని జడ్జి అన్నారు. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై సోమవారం విచారణ జరగనుంది.
కస్టడీలో విచారణ సాగిందిలా..
చంద్రబాబును సీఐడీ పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించిన సంగతి తెలిసిందే. శనివారం చంద్రబాబును దాదాపు 50 ప్రశ్నలు అడగగా, ఆదివారం కూడా అదే స్థాయిలో సీఐడీ అధికారులు ప్రశ్నించారు. మొత్తం 30 అంశాలపై 120 వరకు ప్రశ్నలు సంధించి, చంద్రబాబు నుంచి సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలోని సీఐడీ అధికారులు కొన్ని వివరాలు రాబట్టారు. వివిధ డాక్యుమెంట్స్ చూపించి నిధులు ఎలా కేటాయించారని అధికారులు ప్రశ్నించారు. షెల్ కంపెనీల ద్వారా నిధుల తరలింపుపై సీఐడీ తమ అనుమానాలను విచారణలో ప్రస్తావించింది. రెండు రోజుల్లో 12 గంటలపాటు చంద్రబాబును ప్రశ్నించారు.