Chandrababu Naidu: నువ్వు ఎవడికి చెప్తే వాడికి ఓటేయలా? బాబుకి టీడీపీ క్యాడర్ సూటి ప్రశ్న?

చంద్రబాబు తరచూ తన రాజకీయ అవసరాల కోసం వ్యూహాలను వేగంగా మార్చేస్తుంటారు. మిత్రులను శత్రువులుగా చేసేస్తారు. వర్గ శత్రువులను కూడా కౌగిలించుకుంటారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 7, 2023 | 09:43 AMLast Updated on: Jun 07, 2023 | 12:46 PM

Chandrababu Naidutdpbjpamit Sha

Chandrababu Naidu: చంద్రబాబు, అమిత్ షా భేటీ తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ దుమారం రేపింది. నాలుగున్నర సంవత్సరాల తర్వాత అమిత్ షా, నడ్డాలతో బాబు భేటీ కచ్చితంగా చర్చనీయాంశమే. పొలిటికల్ పార్టీగా టీడీపీ ఎవరితోనైనా తన రాజకీయ అవసరాలకు అనుగుణంగా పొత్తు పెట్టుకోవచ్చు. కానీ విషయం ఏమిటంటే.. చంద్రబాబు నాయుడు రాజకీయ నిబద్ధత.. విశ్వసనీయత.

చంద్రబాబు తరచూ తన రాజకీయ అవసరాల కోసం వ్యూహాలను వేగంగా మార్చేస్తుంటారు. మిత్రులను శత్రువులుగా చేసేస్తారు. వర్గ శత్రువులను కూడా కౌగిలించుకుంటారు. టీడీపీ 2009 లో టీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీలతో, 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకుంది. 2018లో వర్గశత్రువు అయిన కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది. ఎన్నడూ ముఖం చూడని వాళ్లతో కూడా చంద్రబాబు చేతులు కలిపేశారు. ఇది జనం జీర్ణించుకోలేకపోయారు. ఏ సోనియా గాంధీ.. ఏ కాంగ్రెస్ పార్టీ తెలుగు రాష్ట్రాల్ని విచ్ఛిన్నం చేశారో.. ఆంధ్ర ప్రజలు నిత్యం అసహ్యించుకునే కాంగ్రెస్ పార్టీని ఆయన ఊహకందనంత వేగంతో వెళ్లి కౌగిలించుకున్నారు. చంద్రబాబు , కాంగ్రెస్ మైత్రిని జనం జీర్ణించుకోలేకపోయారు.

దాని ఫలితమే 2018లో తెలంగాణలో, 2019లో ఏపీలో దారుణ ఓటమి. 2019లో బీజేపీ, జనసేనలను రెండింటినీ వదిలేశారు చంద్రబాబు. మోడీని, బీజేపీని నానా తిట్లు తిట్టారు. ఏకంగా మోడీపై వ్యక్తిగత విమర్శలు చేశారు. ఆ ఎన్నికల్లో గట్టి దెబ్బ తిన్నారు. తర్వాత బీజేపీ పూర్తిగా టీడీపీకి, చంద్రబాబుకి తలుపులు మూసేసింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా మళ్లీ ఇప్పటివరకు తెరవలేదు. చేసిన పొరపాటుని దిద్దుకుని చంద్రబాబు ఆ తలుపుని తడుతూనే ఉన్నారు. కట్ చేస్తే ఇప్పుడు మళ్లీ పొత్తులు అంటున్నారు. రాజకీయ పార్టీలు ఎవరితో అయినా పొత్తు పెట్టుకోవచ్చు.

రాజకీయ అవసరాలు చూసుకోవడం కూడా నేరం కాదు. కానీ ఆ పొత్తులు ప్రజలకు జీర్ణమౌతున్నాయా.. లేదా అనే విషయం కచ్చితంగా చూసుకోవాలి. చంద్రబాబు 2009లో లెప్ట్, అప్పటి టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నారు. 2014 వచ్చేసరికి బీజేపీ, జనసేనతో కూటమి కట్టారు. 2018లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు. ఇప్పుడు మళ్లీ బీజేపీతో మైత్రికి ఆసక్తిగా ఉన్నారు. ఇలా ఎన్నిక ఎన్నికకూ మారుతున్న పొత్తులు.. చంద్రబాబు రాజకీయ వ్యక్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. చంద్రబాబు పొత్తుల విషయం తీసుకుంటున్న నిర్ణయాల మార్పు ప్రభావం టీడీపీపై పడుతోంది. పదేపదే పొత్తులపై నిర్ణయాలు మారిస్తే.. వాటిని సమర్థించుకోవడం నేతలకే కాదు.. క్షేత్రస్థాయిలో క్యాడర్ కూ తలనొప్పే. కేవలం చంద్రబాబు నాయుడికే కాదు.. ఏ నేతకైనా ఇలాంటి పరిస్థితి ఇబ్బందే.

రాజకీయాలంటే పదవులే కాదు సిద్ధాంతమూ ముఖ్యమే అని గుర్తుంచుకోవాలి. పొత్తులు నేరం కాకపోయినా.. పరస్పర విరుద్ధ నిర్ణయాలు తీసుకుంటే ప్రజలేమనుకుంటారో ఆలోచించుకోవాలి. చంద్రబాబు రాజకీయ వ్యూహాలపై ఎవరికీ అనుమానం లేదు. కానీ రాజకీయ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా తీసుకుంటున్న పొత్తు నిర్ణయాలపైనే చర్చ జరుగుతోంది. టీడీపీ పొత్తులు అధికారం కోసం కాదు ప్రజాప్రయోజనాల కోసం అనే అర్థం వచ్చేలా నిర్ణయాలుండాలి కానీ.. పదవుల కోసం ఎవరితో అయినా పొత్తుకు సిద్ధమై పోవడం పార్టీకి, చంద్రబాబుకు మంచిది కాదు. రాజకీయ అవసరాల కోసం పొత్తులు పెట్టుకోవడం తప్పు కాదు. కానీ చంద్రబాబు పొత్తులపై తీసుకుంటున్న నిర్ణయాలు.. ఆయన రాజకీయ విశ్వసనీయతను దెబ్బతీస్తున్నాయి. రాజకీయ వ్యక్తిత్వాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయి.