Andhra Politics : చంద్రబాబు.. రెండు చోట్ల నుంచి పోటీ చేస్తారా…? చేస్తే ఎక్కడ…?
చంద్రబాబు కుప్పం నియోజకవర్గం నుంచి వరుసగా ఏడుసార్లు గెలిచారు. 1989 నుంచి ఆయన కుప్పాన్ని తన కంచు కోటగా మార్చుకున్నారు. ఇక్కడ ఆయనకు ఓటమి అన్నదే లేదు. కానీ ఈసారి మాత్రం సీన్ మారింది.
చంద్రబాబు.. రెండు చోట్ల నుంచి పోటీ చేస్తారా…? చేస్తే ఎక్కడ…?
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నారా…? నిజమే అయితే కుప్పంతో పాటు ఆయన పోటీ చేసే నియోజకవర్గం ఏది…? కుప్పం గెలుస్తానన్న నమ్మకం లేదా.. లేక వేరే వ్యూహముందా…? రెండు నియోజకవర్గాల్లో పోటీపై టీడీపీ వర్గాలేమంటున్నాయి…?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో పోటీకి సై అన్నారు. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే బాటలో నడవబోతున్నారని ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో తెగ ప్రచారం జరుగుతోంది. ఇది ఎంతవరకు నిజమన్నదానిపై స్పష్టత లేదు. కానీ న్యూస్‌మాత్రం వైరల్ అయ్యింది. ఓటమి భయంతోనే చంద్రబాబు నియోజకవర్గాన్ని మారుస్తున్నారంటూ అధికారపక్షం సోషల్‌మీడియా విరుచుకుపడుతోంది. మరోవైపు టీడీపీ మాత్రం ఇది విషప్రచారమంటూ ఎదురుదాడికి దిగింది.
చంద్రబాబు కుప్పం నియోజకవర్గం నుంచి వరుసగా ఏడుసార్లు గెలిచారు. 1989 నుంచి ఆయన కుప్పాన్ని తన కంచు కోటగా మార్చుకున్నారు. ఇక్కడ ఆయనకు ఓటమి అన్నదే లేదు. కానీ ఈసారి మాత్రం సీన్ మారింది. కుప్పంలో చంద్రబాబును ఓడించి ఆయన రాజకీయ జీవితానికి ముగింపు పలకాలని వైసీపీ యోచిస్తోంది. సీఎం జగన్ ఆదేశాలతో కొంతకాలంగా కుప్పంపై మంత్రి పెద్దిరెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. టీడీపీ కేడర్‌ను తమవైపు తిప్పుకుంటున్నారు. బాబును ఓడించేందుకు తెరవెనుక మంత్రాంగం నడుపుతున్నారు. ఈసారి కుప్పంలో బాబు ఓటమి పక్కా అని వైసీపీ బల్లగుద్ది చెబుతోంది. దీంతో చంద్రబాబు అలర్ట్ అయ్యారు. కుప్పంలో గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో ఆయన ప్లాన్-బీ గా మరో నియోజకవర్గంలో పోటీ చేయాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి కృష్ణా లేదా గుంటూరు జిల్లాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి చంద్రబాబు పోటీకి సిద్దమవుతున్నారని యమ జోరుగా ప్రచారం సాగుతోంది. ఒకవేళ కుప్పంలో తేడా కొట్టినా ఇక్కడి నుంచి బయటపడొచ్చన్నది చంద్రబాబు ఆలోచన అని పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది.
టీడీపీ వర్గాల కథనం మాత్రం వేరేలా ఉంది. ఇది వైసీపీ ఆడుతున్న మైండ్‌గేమ్ అంటున్నారు టీడీపీ నేతలు. చంద్రబాబు కుప్పంలో కూడా గెలవరని, పార్టీ పూర్తిగా బలహీనమైందని అందుకే నియోజకవర్గం మారుతున్నారని చెప్పేలా కుట్ర చేస్తున్నారని అనుమానిస్తున్నారు. చంద్రబాబు కుప్పం నుంచే పోటీ చేస్తారని టీడీపీ నేతలు అంటున్నారు. ఈసారి అక్కడ లక్ష మెజారిటీ సాధించాలన్నది బాబు ప్లాన్ అంటున్నారు. ఇన్నాళ్ల నుంచి పోటీ చేస్తున్న నియోజకవర్గాన్ని వదిలితే అది ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు పంపుతుందో తమకు తెలుసంటున్నారు. పైగా లోకేష్ మరోసారి మంగళగిరిలో పోటీ చేయబోతున్నారని అలాంటప్పుడు అదే ప్రాంతంలో చంద్రబాబు పోటీ చేయాలని ఎలా అనుకుంటారని ఎదురు ప్రశ్నిస్తున్నారు. సంచలనాల కోసమే ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు.
ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఏపీలో ఇలాంటి చిత్ర విచిత్ర కథనాలు చాలానే వస్తాయంటున్నారు. ఒక్క అధికారపార్టీనే కాదు ప్రతిపక్షం కూడా ఇలాంటి ఎత్తుగడలకు దిగడం గ్యారెంటీ. మరి వాటిని పార్టీలు ఎలా తిప్పికొడతారో చూడాల్సి ఉంది.