Mysterious Chinese spacecraft: అంతరిక్షంలో చైనా అనుమానాస్పద నౌక

ప్రస్తుతం భూమిచుట్టూ తిరుగుతున్న ఉపగ్రహాల్లో మెజారిటీ అమెరికావే... చైనా ఉపగ్రహాలు అందులో ఆరోవంతు మాత్రమే. అయితే త్వరలో అగ్రరాజ్యాన్ని అధిగమించాలన్నది చైనా ఆశ.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 9, 2023 | 09:01 PMLast Updated on: May 09, 2023 | 9:01 PM

Chinas Secretive Spacecraft Returns To Earth After 9 Months Orbital Mission

చైనాకు చెందిన ఓ వ్యోమనౌక అంతరిక్షంలో 276రోజులు గడిపి తిరిగి భూమికి చేరుకుంది. అంతరిక్ష నౌకలు వెళ్లడం, రావడం మామూలే అయినా ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ అంతరిక్షంలో ఏం చేసిందన్నదే ఇప్పుడు పెద్ద మిస్టరీ…!

రీయూజబుల్‌ స్పేస్‌ టెక్నాలజీలో భాగంగా తాము పంపిన ఓ వ్యోమనౌక తిరిగి క్షేమంగా భూమిని చేరుకున్నట్లు చైనా ప్రకటించింది. అంతరిక్షంలో 276రోజులు గడిపిన ఆ నౌక జియువాన్ లాంచ్‌ సెంటర్‌కు షెడ్యూల్ ప్రకారం తిరిగి చేరుకున్నట్లు మాత్రమే ప్రకటించారు. భవిష్యత్తులో తక్కువ ఖర్చుతో స్పేస్‌ మిషన్స్‌ నిర్వహించడానికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు. అంతకు మించి ఆ వ్యోమనౌకకు సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని చైనా పంచుకోలేదు. ఫోటోలు కూడా విడుదల చేయలేదు. ఇదే పెద్ద అనుమానాలను రేపుతోంది.
అమెరికా నుంచి కాపీ కొట్టేశారా..!
ఈ స్పేస్‌క్రాఫ్ట్‌లో ఎలాంటి టెక్నాలజీని వాడారు…? అంతరిక్షంలో ఎంత ఎత్తుకు అది చేరింది…? గత ఆగస్టులో ప్రయోగించినప్పటి నుంచి ఏ ఆర్బిట్‌లో పరిభ్రమించింది వంటి వివరాలన్నింటినీ రహస్యంగా ఉంచింది. ఇది అమెరికా వాయుసేనకు చెందిన బోయింగ్ ఎక్స్‌-37బీ తరహాలో కొన్నేళ్ల పాటు అంతరిక్షంలోనే గడపగల సామర్ధ్యం కలిగి ఉన్నట్లు భావిస్తున్నారు. అమెరికా ఎక్స్‌-37బీని ఇప్పటికి ఆరుసార్లు ప్రయోగించారు. చివరిసారి ప్రయోగంలో అది అంతరిక్షంలో 908రోజులు గడిపింది. ఇప్పుడు చైనా కూడా అదే టెక్నాలజీని వాడినట్లు అనుమానిస్తున్నారు. చైనా అమెరికా నుంచి మేథోసంపత్తిని చోరీ చేస్తోందన్న ఆరోపణలు చాలాకాలంగా ఉన్నాయి. అలాగే ఈ టెక్నాలజీని కూడా కొట్టేసిందా అన్నది తాజా అనుమానం. 2021లో చైనా ఇలాంటి నౌకనే ప్రయోగించింది. అదే అదే రోజు తిరిగి భూమిని చేరుకుంది. కానీ ఈసారి మాత్రం 9నెలలు అంతరిక్షంలో గడిపింది. ఇంతలోనే అంత టెక్నాలజీని డెవలప్‌ చేయగలగడం అనుమానాలు రేపుతోంది. అమెరికాకు కూడా ఈ అనుమానం ఉంది. దానికి సంబంధించిన ఆధారాల సేకరణలోనూ పడింది.
నిఘా కోసం వాడారా…!
అంతరిక్షంపై ఆధిపత్యం కోసం చైనా చాలాకాలంగా ఎత్తులు వేస్తోంది. ప్రపంచంలోని అగ్రదేశాలన్నింటిపై నిఘా పెడుతోంది. ఇది కూడా ఆ కోవకే చెందినదే అన్నది మరికొందరి అనుమానం. సున్నితమైన సమాచారాన్ని ఈ నిఘా స్పేస్‌క్రాఫ్ట్‌ ద్వారా సేకరించి ఉండొచ్చని భావిస్తున్నారు. గతనెలలో చైనా ఓ ప్రయోగం చేసింది. ఓ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ మెషిన్‌తో తన శాటిలైట్‌నే కంట్రోల్‌లోకి తీసుకుంది. దానిద్వారా మన దేశంలోని పాట్నా సిటీ మొత్తాన్ని చిత్రీకరించింది. గాల్వాన్‌ ఘర్షణలో చైనా సైనికులను ఎదిరించింది ఈ పాట్నా రెజిమెంటే… జపాన్‌లోనే అత్యంత రద్దీ కలిగిన ఎయిర్‌పోర్ట్‌ను కూడా ఏఐ మెషిన్‌ శాటిలైట్‌ ద్వారా జూమ్‌ చేసింది. అమెరికా యుద్ధనౌకలు అప్పుడప్పుడు ఇక్కడే ఆగుతుంటాయి. అదే టెక్నాలజీని ఉపయోగించి మిగిలిన దేశాల ఉపగ్రహాలను లాక్‌ చేస్తే ఏమవుతుందో ఊహించుకోవచ్చు.
ఆధిపత్యం కోసం ఆరాటం
చైనా చాలాకాలంగా అంతరిక్షంపై ఆధిపత్యం కోసం తహతహలాడుతోంది. భవిష్యత్ యుద్ధక్షేత్రం అంతరిక్షమే. శత్రుదేశాలపై నిఘా అన్నది ఓ అంశమైతే ఆ దేశాల ఉపగ్రహాలను టార్గెట్‌ చేయడం మరో ముఖ్యమైన అంశం. శత్రుదేశాల ఉపగ్రహాలను కూల్చివేయగలిగితే చాలు మొత్తం అస్తవ్యస్తమవుతుంది. కమ్యునికేషన్ వ్యవస్థ కుప్పకూలితే చాలు రక్తం చిందకుండా యుద్ధాన్ని నెగ్గొచ్చు. అందుకే చైనా అంతరిక్షంపై పట్టుకోసం ప్రయోగాలు చేస్తోందని అమెరికా సహా పలు దేశాలు అనుమానిస్తున్నాయి. డ్రాగన్‌ ఇప్పుడు నిర్వహిస్తున్న పలు అంతరిక్ష ప్రోగ్రామ్‌ల గురించిన వివరాలు చాలా రహస్యంగా ఉంచుతోంది. ప్రస్తుతం భూమిచుట్టూ తిరుగుతున్న ఉపగ్రహాల్లో మెజారిటీ అమెరికావే… చైనా ఉపగ్రహాలు అందులో ఆరోవంతు మాత్రమే. అయితే త్వరలో అగ్రరాజ్యాన్ని అధిగమించాలన్నది చైనా ఆశ. వచ్చే దశాబ్దం చివరకు అంతరిక్షం పూర్తిగా తన గ్రిప్‌లోకి రావాలని చైనా టార్గెట్‌గా పెట్టుకున్నట్లు భావిస్తున్నారు.