CHINNA SRINU : చిన్న శ్రీను అరాచకాల ఫలితం…. విజయనగరం జిల్లాలో వైసీపీ ఫినిష్ !
చిన్న శ్రీను అలియాస్ డాన్ శ్రీను. ఆ పేరు వింటే విజయనగరం జిల్లా వణికిపోతోంది. సామాన్య జనం, అధికారులు, లీడర్స్ అందరికీ చిన్న శ్రీను పేరు చెప్తే దడ. వేళ్లతో సైగచేస్తాడు... చూపుతో శాసిస్తాడు... రాబందులా మింగేస్తాడు... ఆయనకి ఊక, తవుడు, నూక కాదేదీ వ్యాపారానికి అనర్హం. భూముల సెటిల్మెంట్ నుంచి వీధి తగాదా దాకా అన్నింటా డాన్ శ్రీను ప్రమేయమే.. దేన్నయినా తెంపగలడు.. కుదరకపోతే లాక్కోగలడు. ఆయన చెప్పిన దానికి అధికారులు కూడా తలాడించాల్సిందే. లేకుంటే బదిలీ ఖాయం. ఆ జిల్లాకు ఓ నరకాసురుడుగా విరాజిల్లుతున్నాడని విజయనగరం పబ్లిక్ టాక్.
విజయనగరం డాన్ మజ్జి శ్రీనివాసరావు ఒకప్పుడు మంత్రి బొత్స మేనల్లుడు చిన్న శ్రీనుగా పరిచితమై…నేడు వైసీపీకి జిల్లా అధ్యక్షుడుగా ఎదిగి… జిల్లానే శాసిస్తున్నాడు. ఒకప్పుడు చిన్న చిన్న పనులకు టెండర్స్ వేసిన వ్యక్తి ఇప్పుడు పనులు ఎవ్వరు చెయ్యాలో, ఎవరికి ఇవ్వాలో నిర్దేశించే స్థాయికి ఎదగాడు. ఒకప్పుడు విజయనగరంలో అద్దె గదిలో ఉన్న వ్యక్తి ఇప్పుడు అక్రమార్జనతో వేల కోట్లకు పడగలెత్తాడు. ఏ అధికారి ఎక్కడికి బదిలీ అవ్వాలన్నా, ఎవరికి ఏ పని అవ్వాలన్నా నిబంధనలతో ఈయనకి పని లేదు. చిటికెలో ఆ పని కానిచ్చేస్తాడు…
మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను… 2004 కి ముందు సాధారణ వ్యక్తి. ఈయన పేరు కూడా చాలా మందికి తెలీనే తెలీదు. మంత్రి బొత్స సత్యన్నారాయణతో కనిపిస్తే చిన్న శ్రీనట… సత్తిబాబు మేనల్లుడు అటా అని చెప్పుకునే వాళ్లు. సత్తిబాబు భార్య బొత్స ఝాన్సీలక్ష్మీకి తమ్ముడు అవుతాడన్న విషయం కూడా చాలా మందికి తెలీదు. అలాంటి వ్యక్తి కేవలం 20 యేళ్ళలో అసాధారణ శక్తిగా ఎదిగి రాజకీయ పరపతి, పలుకుబడితో జిల్లాలోని అన్ని రాజ్యాంగ, రాజ్యాంగేతర వ్యవస్థలన్నింటినీ గుప్పిట పట్టి, కనుసైగతో జిల్లాను శాసించే స్థాయికి ఎదిగిపోయాడు. నెల్లిమర్ల మండలం తంగుడుబిల్లి సతివాడ మధ్యలో సిరి సహస్ర రైస్ మిల్ ను బ్లాక్ మెయిల్ తో సొంతం చేసుకున్నారు.. ఈ మిల్లు కోసం ఇద్దరు వ్యాపారుల మధ్య గొడవ సరి చేస్తానని ఎంట్రీ ఇచ్చి వాళ్ళకి నామమాత్రంగా చేతిలో పెట్టి… మిల్లు లాక్కున్నాడు.. అలాగే చీపురుపల్లి పుర్రే వలస రైస్ మిల్ కూడా ఇలాగే స్వాధీనం చేసుకున్నాడు. మెరకముడిదాం మండలం గర్బాంలో పైపుల కంపెనీ ఏర్పాటు చేశాడు. జిల్లాలో వాటర్ మెయింటెనెన్స్ కాంట్రాక్టర్ అని చూపించి ఈ కంపెనీని పెట్టాడు చిన్న శ్రీను. ఉత్తరాంధ్రలో జేజేఎం ప్రాజెక్టుకు పైపుల సరఫరా కాంట్రాక్టును కూడా తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేజిక్కించుకున్నాడు. గుర్లగోషాడ లో 110 ఎకరాలు ఎస్సీలకు ఇందిరా గాంధీ హయాంలో ఇచ్చారు. ఇది పాలవలస, పాలకొండ రోడ్ల మధ్యలో ఉంటుంది. అత్యంత ఖరీదైన భూములు ఇవి. వీటిని కూడా బినామీ పేరుతో కొట్టేశారని టాక్. ఇక్కడ ఓ కంపెనీ పెట్టే ఆలోచన చేస్తున్నారని సమాచారం.
ప్రస్తుత భార్య పుష్పాంజలి పేరున గరివిడి ఫ్యాక్టరీ భూమి తక్కువ ధరకే తీసేసుకున్నారు. పక్కనే ఉన్నకోడూరు శ్మశానం భూమిని ఆక్రమించారు. ఇది దాదాపు ఎకరన్నర ఉంటుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.. అలాగే రైతుల నుంచి సేకరించిన ధాన్యం తమ మిల్లులకు వెళ్లేలా… ట్రాక్ షీట్ ను అధికారులతో తయారుచేసుకున్నారు. ఊక, తవుడు, నూక అన్నీ తన సొంతం చేసుకున్నారు. అలాగే డీసీబీ బ్యాంకు భవనాలకు అద్దెకు ఈయన స్థలాలే కేటాయించేలా స్కెచ్చేశాడు. భీమవరం, గాతాడ, తాతన్నవలస క్వారీలు పదింటిని.. తన కబంధ హస్తాల్లో ఉంచుకున్నాడు. పబ్లిక్ హియరింగ్ లో జనం వ్యతిరేకించినా… తనదైన శైలిలో అధికారులను బెదిరించి…అన్నింటికీ ఓకే చేయించుకున్నాడు. చిన్న శ్రీనుని విజయనగరం వాసులు ఓ నరకాసురుడు గా అభివర్ణిస్తారు. ఈయనకి చరమ గీతం పాడితే దీపావళి పండగ చేసుకోడానికి సిద్దంగా ఉన్నారు.
బొత్స సత్యన్నారాయణ 2004 లో తొలిసారి చీపురుపల్లి నుంచి శాసనసభకు ఎన్నికై మంత్రి పదవిని చేజిక్కించుకున్న తరువాత చిన్న శ్రీను జాతకమే మారిపోయింది. అప్పటి సీఎం ys రాజశేఖర్ రెడ్డి… బొత్సపై ఉన్న నమ్మకంతో కొన్ని అదనపు బాధ్యతలను కూడా అప్పగించడంతో ఆయన బిజీ అయ్యారు. అప్పుడు చిన్న శ్రీనుని తెరపైకి తెచ్చి… జిల్లా వాసులకు అధికారికంగా పరిచయం చేశాడు. తాను అందుబాటులో ఉండని సమయంలో తన ప్రతినిధిగా చిన్న శ్రీనును భావించాలని కేడర్ తో పాటు అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. అప్పటి నుంచి చిన్న శ్రీను వెనక్కి తిరిగి చూడలేదు. అందివచ్చిన అవకాశాన్ని అస్త్రంగా మలుచుకున్నాడు. తానే మంత్రిగా చెలామణి అవ్వడం మొదలు పెట్టాడు. జిల్లాలో కుగ్రామాల్లో కూడా చిన్న శ్రీను పేరు మార్మోగేంతగా చేశాడు. కాలంతో పాటు ఆయన రాజకీయ హవా పతాక స్థాయికి చేరి… నియంత మాదిరిగా జిల్లాను ఏలడం మొదలుపెట్టాడు. ఏ పని జరగాలన్నా ఆయన్ని ప్రసన్నం చేసుకోవాల్సిందే…. ఆయన సిఫార్సు లేనిదే అటెండర్ నుంచి జిల్లా అధికారి వరకూ.. ఏ పనీ జరగదన్నది జగమెరిగిన సత్యం. జెడ్పీ చైర్మన్ తరవాత వార్ రూమ్ వ్యహరాలు అన్నీ ఇన్నీ కాదు. చివరికి ఈయన చైర్మన్ అయ్యాక జిల్లా పరిషత్ CEO సైతం సంతకాలకే పరిమితమయ్యారు. అధికారులు అటెండర్లుగా మారి…. వీళ్ల అధికారాలు ఆయన చేతులోనే పెట్టేశారన్న టాక్. ఏ వ్యవహారమైనా అక్రమామా ? సక్రమమా ? అన్నదాంతో సంబంధం లేకుండా శ్రీను ఆదేశాలకు అధికార్లు తలొగ్గాల్సిందే.. కాదంటే కష్టాలు తప్పవు.. నో చెప్పడానికి నో ఛాన్స్. చిన్న శ్రీను రాజ్యాంగేతర శక్తిగా మారి జిల్లాను శాసిస్తున్న తీరు అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి చాలావరకూ నష్టం కలిగించిందన్నది పరిశీలకుల టాక్. అధికార దర్పంతో జిల్లాలో చిన్న శ్రీను పేట్రేగి పోతున్నారన్న చర్చ పార్టీ వర్గాల్లో బాగా నడుస్తోంది. ఈ రెండు దశాబ్దాల కాలంలో చిన్న శ్రీను అక్రమ ఆస్తుల విలువ రెండు వేల కోట్లపైనే అని ప్రచారం జరుగుతోంది.
2021 లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం సాధించి చిన్న శ్రీను జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా ఎన్నికవ్వడం తో ఆ తరువాత మరింత విజృంభించి రాజ్యాంగేతర శక్తి నుంచి ప్రజాప్రతినిధి అవతారమెత్తారు. కారణం ఏంటో తెలీదు గానీ….బొత్సకు మించి చిన్న శ్రీనుకి వైసీపీలో ప్రియారిటీ ఉందన్న గుసగుసలూ ఉన్నాయి. జిల్లాలో బొత్స సత్యనారాయణ ప్రాధాన్యం తగ్గించడానికి అప్పట్లో విజయ్ సాయి రెడ్డి చిన్న శ్రీను ని ప్రోత్సహించారు. సాయిరెడ్డి సహకారం తో చిన్న శ్రీను మరింత రెచ్చిపోయాడు. మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను తనకు రాజకీయ భిక్ష పెట్టిన బొత్స సత్తిబాబు దంపతులకు పక్కలో బల్లెంలా మారారని జిల్లా అంతటా ఇప్పుడు హాట్ టాపిక్.
విజయనగరం జిల్లా వైసీపీ మొత్తం ఇప్పుడు చిన్న శ్రీను చేతిలోకి వచ్చేసింది. బొత్స సత్యనారాయణ కేవలం నామమాత్రపు నాయకుడిగా మిగిలిపోయారు. విజయ సాయిరెడ్డి చిన్న శీనుని డాన్ శీనుగా మార్చారు. ఉత్తరాంధ్రలో జనం సహజంగానే కొంత అమాయకంగా ఉంటారు. అదే ఇప్పుడు చిన్న శ్రీనుకి ఆయుధంగా మారింది. ఆయన అరాచకాలకి అంతు లేకుండా పోయింది. విజయనగరం మాత్రమే కాదు… శ్రీకాకుళం, విశాఖపట్నంకి కూడా డాన్ శ్రీను అరాచకాలు విస్తరించాయి. మంత్రి గుడివాడ అమర్నాథ్… చిన్న శ్రీనుకి వ్యాపార భాగస్వామి కావడంతో అరాచకాలకు అడ్డు లేకుండా పోయింది. చిత్రమైన విషయం ఏంటంటే …. ఉత్తరాంధ్ర లో కొందరు టీడీపీ నాయకులు కూడా డాన్ శ్రీనుకి స్నేహితులు, పార్టనర్స్ కూడా… పబ్లిక్ గా ఇద్దరు భార్యలను మెయింటైన్ చేసే చిన్న శ్రీను వారి పేరున కూడా బినామీ వ్యాపారాలు చేస్తున్నాడు.
విజయనగరంలో జనం ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చిన్న శీను బాధితులంతా ఒక్కటై… వైసీపీకి వ్యతిరేకంగా ప్రచారం కూడా చేస్తున్నారు. ఈ మధ్య 1500 మంది విద్యార్థులు ఉన్న ఓ స్కూల్ అంతర్గత వ్యవహారంలో చిన్న శీను జోక్యం చేసుకున్నాడు. తాను అడిగింది ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇవ్వకపోవడంతో స్కూల్ కి తాళం కూడా వేసాడు. చివరికి ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యం చేసుకొని… స్కూల్ యాజమాన్యానికి సర్ది చెప్పింది. చిన్న శీను అరాచకాలను కంట్రోల్ చేయలేనని బొత్స సత్యనారాయణ ఎప్పుడో చేతులెత్తేశారు. విజయసాయిరెడ్డి, సిఎం జగన్మోహన్ రెడ్డి…. ఇద్దరు చిన్న శీను అరాచకాలు చూస్తూ మురిసిపోతూ ఉంటారు. కానీ మరో నాలుగు నెలల్లో పరిస్థితులు మరోలా ఉండబోతున్నాయి. కేవలం చిన్న శ్రీను కారణంగానే విజయనగరంలో వైసీపీ దారుణంగా ఓడిపోబోతోంది. 9 స్థానాల్లో కనీసం ఏడు స్థానాలు వైసీపీ నుంచి పోతాయని ఒక అంచనా. ఇది అంతా డాన్ శ్రీను పుణ్యమే మరి.