రాజకీయాలకు దూరమంటూనే.. వేడి పుట్టిస్తున్న చిరంజీవి.. తమ్ముడి కోసమేనా ఇదంతా..?
నన్ను వదిలేయండి మహా ప్రభు.. నేను సినిమాలు చేసుకుంటాను.. నాకు రాజకీయాలు అవసరం లేదు అంటూ చిరంజీవి పదే పదే చెబుతున్నాడు..

నన్ను వదిలేయండి మహా ప్రభు.. నేను సినిమాలు చేసుకుంటాను.. నాకు రాజకీయాలు అవసరం లేదు అంటూ చిరంజీవి పదే పదే చెబుతున్నాడు.. కానీ ఆయన నుంచి మాత్రం రాజకీయాలు దూరం కావడం లేదు. ఇంకా చెప్పాలంటే మధ్య మధ్యలో ఆయన చేసే కామెంట్స్ పొలిటికల్ గా బాగా వేడి పుట్టిస్తున్నాయి. పదేళ్లు పాలిటిక్స్ చేసిన తర్వాత ఆయనకు రాజకీయమంటేనే విరక్తి వచ్చేసిందని.. అయినదానికి కాని దానికి అందర్నీ తిట్టాలి అంటే మనసు రాదు అని చెప్పాడు చిరంజీవి. తన స్థానంలో తమ్ముడు ఉన్నాడు అంతా వాడు చూసుకుంటాడు అని చెప్పుకొచ్చాడు మెగాస్టార్. తనది కానీ గ్రౌండ్ లోకి వెళ్లి అనవసరంగా 10 సంవత్సరాలు వేస్ట్ చేశాను అని చిరంజీవి ఇంతకు ముందు కూడా బాధపడ్డాడు. అయితే సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా అప్పుడప్పుడు చిరంజీవి రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉంటాడు.
ఆయన పాలిటిక్స్ గురించి కామెంట్ చేసిన ప్రతిసారి పొలిటికల్ గ్రౌండ్ మొత్తం హీట్ ఎక్కిపోతుంది. ఆ మధ్య పద్మ విభూషణ్ వేడుకలో మాట్లాడుతూ.. రాజకీయాల్లో మాట చాలా ముఖ్యమని.. ఇప్పుడు రాజకీయాలు మొత్తం వ్యక్తిగత విమర్శల వైపు వెళ్ళిపోతున్నాయి అంటూ చిరు చేసిన కామెంట్స్ వేడి పుట్టించాయి. రాజకీయాలకు దూరంగా ఉంటాను అంటూనే చిరు చేసే కామెంట్స్ పాలిటిక్స్ లో సంచలనంగా మారుతుంటాయి. మొన్నటికి మొన్న లైలా సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో కూడా జై జనసేన అంటూ.. ఓపెన్ గానే తమ్ముడికి సపోర్ట్ చేశాడు. రాజకీయాలు నాకు వద్దు అంటూనే ప్రజారాజ్యమే ఇప్పుడు జనసేన అయిందంటూ అభిమానుల్లో ఉత్సాహం నింపాడు మెగాస్టార్.
అప్పట్లో వాల్తేరు వీరయ్య 200 రోజుల వేడుకలో కూడా తమ రెమ్యూనరేషన్ గురించి పార్లమెంటులో మాట్లాడవలసిన పరిస్థితి ఏమొచ్చింది.. పెద్దల సభలో ఇంత చిన్న విషయం మాట్లాడాలా.. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్టు ఇండస్ట్రీ మీద మీకు కోపం ఎందుకు అంటూ పొలిటికల్ లీడర్స్ పై మండి పడ్డాడు చిరంజీవి. ఛాన్స్ దొరికిన ప్రతిసారి రాజకీయాల గురించి మాట్లాడుతూ.. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతున్నాడు మెగాస్టార్. ఈయనకు త్వరలోనే రాజ్యసభ ఇస్తారు అంటూ ప్రచారం జరుగుతుంది. మరి దాన్ని చిరంజీవి తీసుకుంటాడా లేదా అనేది చూడాలి. ఏదేమైనా చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉన్నాడు కానీ.. ఆయన నుంచి రాజకీయం మాత్రం దూరంగా జరగడం లేదు.