Chandrababu Naidu: మరో కేసులో చంద్రబాబు చుట్టూ ఉచ్చు.. జైలు నుంచి బయటకు రానివ్వరా..?
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు.. ఇప్పట్లో జైలు నుంచి బయటకు రాలేరా.. రాకుండా చేస్తున్నారా అనే చర్చ జరుగుతోంది రాజకీయవర్గాల్లో! చంద్రబాబుపై మరో కేసు విచారణకు రంగం సిద్దం అవుతోంది.
Chandrababu Naidu: చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇంకో ఆరు నెలల్లో అధికారం మారుతుందని, తామేంటో చూపిస్తామని టీడీపీ నేతలు బహిరంగంగానే జగన్‌కు సవాల్ విసురుతున్నారు. దీంతో ఏపీ రాజకీయం మరింత రగలడం ఖాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో రివేంజ్ పాలిటిక్స్.. ఏపీ మీద జనాలకు చులకన భావం వచ్చేలా చేస్తున్నాయి. ఇదంతా ఎలా ఉన్నా.. చంద్రబాబు చుట్టూ నెమ్మదిగా ఉచ్చు బిగుసుకుంటోంది.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు.. ఇప్పట్లో జైలు నుంచి బయటకు రాలేరా.. రాకుండా చేస్తున్నారా అనే చర్చ జరుగుతోంది రాజకీయవర్గాల్లో! చంద్రబాబుపై మరో కేసు విచారణకు రంగం సిద్దం అవుతోంది. ప్రస్తుతం స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రాజమండ్రి జైలులో రిమాండ్‌లో ఉన్న చంద్రబాబును, అమరావతి కేసులో విచారణకు వీలుగా పీటీ వారెంట్ ఇవ్వాలని కోరుతూ సీఐడీ మరో పిటిషన్ దాఖలుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న సమయంలోనే.. ఈ కేసులోనూ విచారణకు అనుమతి ఇవ్వాలని సీఐడీ కోరుతున్నట్లు సమాచారం. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారంలో చంద్రబాబును విచారించేందుకు వీలుగా పీటీ వారెంట్ ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. 2022లో నమోదైన అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో సీఐడీ.. చంద్రబాబుపైన అభియోగాలు నమోదు చేసింది. ఆ కేసులో విచారణకు సీఐడీ ఇప్పుడు సిద్ధం అవుతోంది. ఈ కేసులో చంద్రబాబు A1గా ఉన్నారు.
మిగతా నిందితులు ఇప్పటికే ముందస్తు బెయిల్ తీసుకోగా.. చంద్రబాబు తీసుకోలేదు. ఐతే ఇప్పుడు సీఐడీ మరో పిటిషన్ దాఖలు చేయడానికి సిద్ధం అవుతుందన్న ప్రచారం జరుగుతున్న వేళ.. చంద్రబాబును పూర్తిగా జైలుకే పరిమితం చేస్తారా అనే గుసగుసలు జనాల్లో వినిపిస్తన్నాయి. చంద్రబాబు హౌస్ అరెస్ట్ పిటిషన్ విచారణ సమయంలోనే సీఐడీ అమరావతి అంశాన్ని ప్రస్తావిస్తూ ఆ కేసులో చంద్రబాబును విచారించటం ద్వారా పలు విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్తోంది. చంద్రబాబు స్కిల్ స్కాంలో మాత్రమే కాదని, పలు కేసుల్లో ఉన్నారని.. అన్నీ విచారణకు వస్తాయని వైసీపీ నేతలు వరుసగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అందులో అమరావతి కేసు అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ సమయంలోనే సీఐడీ పీటీ వారెంట్ కోరుతూ పిటిషన్ దాఖలు వ్యవహారంతో ఇప్పుడు ఇది రాజకీయంగా కలకలం సృష్టిస్తోంది.