Sengol‎: రాజదండంపై రాజకీయం.. బీజేపీది కట్టుకథ అంటున్న కాంగ్రెస్.. తిప్పికొట్టిన బీజేపీ

రాజదండం (సెంగోల్)పై వివాదం ముదురుతోంది. ఈ అంశంపై కాంగ్రెస్, బీజేపీ పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్, హోంమంత్రి అమిత్ షా ఈ విషయంలో పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 27, 2023 | 02:40 PMLast Updated on: May 27, 2023 | 4:01 PM

Claim About Sengol Bogus Says Congress Bjp Slams Haters Of Culture

Sengol: నూతన పార్లమెంట్ భవనం ప్రారంభం సందర్బంగా స్పీకర్ కుర్చీ పక్కన ఏర్పాటు చేయనున్న రాజదండం (సెంగోల్)పై వివాదం ముదురుతోంది. ఈ అంశంపై కాంగ్రెస్, బీజేపీ పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్, హోంమంత్రి అమిత్ షా ఈ విషయంలో పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. రాజదండం విషయంలో బీజేపీ ప్రచారం చేస్తోంది అంతా కట్టుకథే అంటూ కాంగ్రెస్ విమర్శించింది. భారత సంస్కృతిని గౌరవించడం కాంగ్రెస్ పార్టీకి తెలియదని బీజేపీ బదులిచ్చింది.
రాజదండాన్ని పార్లమెంటులో ఏర్పాటు చేయబోతున్నట్లు బీజేపీ చెప్పింది. దీనికున్న చారిత్రక నేపథ్యాన్ని వివరించింది. బ్రిటీషర్ల నుంచి ఇండియాకు అధికార బదిలీ జరిగిన సందర్బంగా అప్పటి వైశ్రాయ్ మౌంట్ బాటెన్.. ఈ దండాన్ని నెహ్రూకు అప్పగించినట్లు బీజేపీ చెప్పింది. రాజగోపాలాచారి దీన్ని తమిళనాడుకు చెందిన తిరువడుత్తురై అథీనం ఆధ్వర్యంలో చేయించారు. బంగారంతో తయారైన ఈ రాజదండాన్ని తిరువడుత్తురై పీఠాధిపతులు మౌంట్ బాటెన్‌కు అప్పగించారు. ఆ తర్వాత ఆయన దగ్గరి నుంచి తీసుకుని, గంగాజలంతో శుద్ధి చేశారు. ఊరేగింపుగా తీసుకెళ్లి నెహ్రూకు అప్పగించారు. దీంతో బ్రిటీషర్ల నుంచి ఇండియాకు అధికార బదిలీ పూర్తైనట్లైంది. నెహ్రూ దీన్ని కొంతకాలం చేతికర్రగా వాడుకున్నారని, తర్వాత మ్యూజియంలో పెట్టేశారని బీజేపీ చెప్పింది.

ఈ నేపథ్యంలో అధికార బదిలీకి, స్వాతంత్ర్యం నాటి చారిత్రక నేపథ్యానికి చిహ్నంగా ఉన్న రాజదండాన్ని ఇప్పుడు పార్లమెంట్‌లో ప్రతిష్టించాలని మోదీ, బీజేపీ భావిస్తోంది. దీన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. బీజేపీ చెప్పింది అంతా కట్టుకథ అంటూ విమర్శించింది. బీజేపీ చెప్పినట్లుగా నెహ్రూకు, రాజదండానికి ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ అభిప్రాయపడుతోంది. కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ దీనిపై స్పందించారు. తమిళనాడులో రాజకీయ ప్రయోజనాల్ని ఆశించి.. బీజేపీ నేతలు, మోదీ రాజదండాన్ని తెరపైకి తెచ్చారని జైరాం రమేశ్ అన్నారు. మౌంట్ బాటెన్, నెహ్రూ మధ్య అధికార బదిలీకి ఈ రాజదండాన్ని చిహ్నంగా చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని ఆయన చెప్పారు. ఎక్కడో మ్యూజియంలో ఉన్న రాజదండాన్ని ఇలా నెహ్రూకు ఆపాదించడం సరికాదని కాంగ్రెస్ విమర్శించింది.

Sengol
అమిత్ షా కౌంటర్
కాంగ్రెస్ విమర్శలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి దేశ సంస్కృతిపై గౌరవం లేదన్నారు. భారత దేశ సంస్కృతి, సంప్రదాయాల్ని కాంగ్రెస్ ఎందుకు అంతగా ద్వేషిస్తోందని ప్రశ్నించారు. గతంలో దీన్ని వాకింగ్ స్టిక్‌గా వాడుకున్న కాంగ్రెస్, ఇప్పుడు మరోసారి రాజదండాన్ని అవమానిస్తోందని ఆయన ఆరోపించారు. దీని గురించి తమిళనాడుకు చెందిన తిరువడుత్తురై అధీనం వివరించిందని, ఇప్పుడు ఆ అధీనం చెప్పిన విషయాల్నే కాంగ్రెస్ బోగస్ అంటోందని ఆయన అన్నారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దా కూడా ఈ విషయంలో కాంగ్రెస్ వైఖరిని తప్పుబట్టారు. 1947లో రాజదండంపై టైమ్‌ మ్యాగజైన్‌ కూడా ఓ కథనాన్ని ప్రచురించిందని సూచిస్తూ, కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్‌ పురి ఒక లింక్‌ను ట్విటర్‌లో షేర్‌ చేశారు. రాజదండంపై వివాదం నడుస్తున్నా దీని ఏర్పాటు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే ఈ రాజదండం ఢిల్లీకి చేరుకుంది. పార్లమెంటులో కొలువుదీరబోతుంది.