CM Jagan: కార్యకర్తల ప్రసన్నం కోసం వైసీపీ యత్నం.. ఎన్నికల వేళ అధికార పార్టీ తంటాలు..!
ఇది ఎన్నికల సమయం. మరో ఏడాదిలోపే ఏపీలో ఎన్నికలొచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది డిసెంబరులోనే రావొచ్చంటున్నారు. ఎన్నికల్లో పార్టీ గెలవాలంటే కార్యకర్తల సహకారం అవసరం. ఈ విషయంలో వైసీపీ వెనుకబడిపోయినట్లు కనిపిస్తోంది. కారణం.. కార్యకర్తల్ని పట్టించుకోకపోవడమే.
CM Jagan: ఇన్నాళ్లూ అధికారబలంతో నెట్టుకొచ్చిన వైసీపీని ఇప్పుడు కార్యకర్తల అంశం టెన్షన్ పెడుతోంది. కారణం.. అధికారంలొకి వచ్చినప్పటికీ ఇంతకాలం కార్యకర్తల్ని సరిగ్గా పట్టించుకోకపోవడమే. ప్రస్తుతం కార్యకర్తల్ని ఆకట్టుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు ప్రారంభించింది.
ఇది ఎన్నికల సమయం. మరో ఏడాదిలోపే ఏపీలో ఎన్నికలొచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది డిసెంబరులోనే రావొచ్చంటున్నారు. ఎన్నికల్లో పార్టీ గెలవాలంటే కార్యకర్తల సహకారం అవసరం. ఈ విషయంలో వైసీపీ వెనుకబడిపోయినట్లు కనిపిస్తోంది. కారణం.. కార్యకర్తల్ని పట్టించుకోకపోవడమే. గతంలో ఉత్సాహంగా ఉన్న వైసీపీ క్యాడర్ ఇప్పుడు అసంతృప్తితో ఉంది. పార్టీ, అధికారిక కార్యక్రమాల్లో వారికి ఎలాంటి భాగస్వామ్యం లభించలేదు. పథకాల అమలు దగ్గరి నుంచి అన్ని కార్యక్రమాల్ని వాలంటీర్లు, సచివాలయ సిబ్బందే చూసుకున్నారు. కార్యకర్తలు ప్రజలకు దగ్గరయ్యే అవకాశమే దొరకలేదు. తమకు ఎలాంటి ప్రాధాన్యం లేకపోవడంతో క్యాడర్ అంతా అసంతృప్తితో ఉంది. పార్టీకి దూరంగా తమపని తాము చేసుకుంటూ పోయారు.
ఇప్పుడు వారిని ప్రసన్నం చేసుకునేందుకు వైసీపీ అనుబంధ సంఘాల చీఫ్ విజయసాయిరెడ్డి రంగంలోకి దిగారు. కార్యకర్తలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీకి సంబంధించిన విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, కార్మిక, మహిళా సంఘాలు.. ఇలా అనేక విభాగాలు పార్టీకోసం పనిచేశాయి. కానీ, అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో వారికి పని లేకుండా పోయింది. వీరి పాత్ర ఎక్కడా కనిపించలేదు. అప్పట్లో బూత్ ఇంచార్జులుగా పని చేసి, పార్టీకి ఓట్లు వేయించిన వారిని కూడా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. త్వరలో ఎన్నికలు జరగబోతుండటంతో వీరి అవసరం పార్టీకి ఏర్పడింది. దీంతో మళ్లీ కార్యకర్తల్ని దగ్గర చేసే ప్రయత్నాల్ని ప్రారంభించింది పార్టీ.
జగన్ సమావేశం
నిన్నటివరకు ఎమ్మెల్యేలు, మంత్రులకే అపాయింట్ మెంట్ ఇవ్వని సీఎం జగన్ ఇప్పుడు తన వైఖరి మార్చుకున్నారు. ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ద్వితీయశ్రేణి నేతలతో సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. జిల్లాలకు వెళ్లినప్పుడు వారితో సమావేశం కావాలనుకుంటున్నారు. అలాగే నియోజకవర్గ సమీక్షల్లో కూడా కిందిస్థాయి నేతల్ని పిలిపించుకుంటున్నారు. అయితే, ఇప్పటివరకు పెద్దగా సమీక్షలు జరపలేదు. దీంతో ఎక్కువ మంది కార్యకర్తలతొ సమావేశమయ్యే అవకాశం రాలేదు. పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన అంశం.. సోషల్ మీడియా విభాగం. సోషల్ మీడియలో వైసీపీ అభిమానులు, కార్యకర్తలు చేసే ప్రచారం ఆ పార్టీకి ఎంతో కలిసొచ్చింది. కానీ, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విభాగాన్ని పెద్దగా పట్టించుకోలేదు. దీంతో గతంలోలాగా చాలా మంది యాక్టివ్‌గా లేరు. ఇప్పుడు ఈ అంశంపై కూడా వైసీపీ దృష్టిపెట్టింది. వైసీపీ సోషల్ మీడియా విభాగ బాధ్యతలు చూస్తున్న సజ్జల భార్గవ ఐటీ ఉద్యోగాలు చేసే వారిపై దృష్టి పెట్టారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లో పని చేసే ఐటీ ఉద్యోగుల్ని వైసీపీ కోసం పని చేసేందుకు నియమించుకోనున్నారు. కనీసం లక్ష మందిని అయినా సోషల్ మీడియా వారియర్స్ ను పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ ఇలా కింది స్థాయి కార్యకర్తలపై దృష్టిపెట్టి గెలుపుకోసం ప్రయత్నిస్తోంది.