Andhra Pradesh Politics: సంక్షేమ పథకాలపైనే జగన్ ఆశ.. టీడీపీ-జనసేన కలిసినా గెలుపు తనదేనంటున్న జగన్.. అభివృద్ధి పట్టని జనం..!

పీలో జగన్ సంక్షేమ పథకాల్ని విస్తృతంగా అమలు చేస్తున్నారు. ఏదో ఒక పథకం పేరు చెప్పి కోట్లాది కుటంబాల అకౌంట్లలో డబ్బులు పడేలా చూస్తున్నాడు. ఈ పథకాలు అందుకున్న లబ్ధిదారులు వాటి కోసమైనా తనకు ఓటు వేస్తారని జగన్ ధీమాగా ఉన్నారు. మరోవైపు టీడీపీ-జనసేన కూటమిగా ఏర్పడి రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 8, 2023 | 04:04 PMLast Updated on: May 08, 2023 | 4:05 PM

Cm Jagan Beliefs That He Will Form Government Due To This Reason

Andhra Pradesh Politics: ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా సాగుతోంది. ఒకవైపు జనసేన-టీడీపీ కలిసే అవకాశాలున్నాయి. మరోవైపు వైసీపీ ఒంటరిగా పోటీకి సిద్ధమవుతోంది. అయితే, గెలుపుపై ఎవరి ధీమా వారిది. తమ కలయిక అధికారాన్ని కట్టబెడుతుందని టీడీపీ-జనసేన భావిస్తుంటే.. తాను అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలే గెలిపిస్తాయని జగన్ నమ్మకంగా ఉన్నారు. రెండు పార్టీలు కలిసినా తాను తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని, అయితే మెజారిటీ మాత్రం తగ్గుతుందని జగన్ భావిస్తున్నారు. తన సంక్షేమ పథకాల లబ్ధిదారులపైనే భారం వేసి జగన్ ఎన్నికలకు సిద్ధమవ్వబోతున్నారు.
ఏడాదిలో ఏపీలో ఎన్నికలు జరుగుతాయి. ఈ లోపే పార్టీలు తమ వ్యూహాలు, పొత్తులు సిద్ధం చేసుకోవాలి. ఈ అంశంలో అన్ని పక్షాలు తాము అధికారంలోకి వస్తామనే ధీమాతోనే ఉన్నాయి. ముఖ్యంగా ఈసారి కూడా ఏపీలో అధికారం తనదే అంటూ జగన్ నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలే పార్టీకి ఓట్లు తెస్తాయని, ప్రతిపక్షాలు బలపడ్డప్పటికీ అధికారం మాత్రం ఖాయం అని జగన్ విశ్వసిస్తున్నారు. ఈ విషయంలో జగన్‌కు తన లెక్కలు తనకున్నాయి.
కోటి 60 లక్షల కుటుంబాలకు లబ్ధి
ఏపీలో జగన్ సంక్షేమ పథకాల్ని విస్తృతంగా అమలు చేస్తున్నారు. ఏదో ఒక పథకం పేరు చెప్పి కోట్లాది కుటంబాల అకౌంట్లలో డబ్బులు పడేలా చూస్తున్నాడు. దీంతో అనేక పేద, మధ్య తరగతి కుటుంబాలకు ప్రయోజనం కలుగుతోంది. తాను అధికారంలోకి రాకపోతే ఈ పథకాలు ఆగిపోతాయని జగన్ అంటున్నారు. అంటే ఈ పథకాలు కొనసాగాలంటే తనను గెలిపించి తీరాల్సిందే అని జగన్ ప్రజలకు చెబుతున్నారు. ప్రస్తుతం ఏపీలో దాదాపు కోటి 60 లక్షల కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అమ్మఒడి, విద్యా దీవెన, ఆసరా వంటి అనేక పథకాల ద్వారా లబ్ధిదారులకు ప్రతి ఏటా వేల రూపాయల్ని అకౌంట్లలో జమ చేస్తున్నారు. ఈ పథకాలు అందుకున్న లబ్ధిదారులు వాటి కోసమైనా తనకు ఓటు వేస్తారని జగన్ ధీమాగా ఉన్నారు. ఇప్పటికే పలు సర్వేల్లో ఈ విషయం రుజువైంది. ఇటీవల విడుదలైన ఒక సర్వేలో లబ్ధిదారుల్లో అత్యధిక శాతం.. అంటే కోటి 16 లక్షల కుటుంబాలు జగన్‌కు అనుకూలంగా తమ అభిప్రాయం చెప్పాయి. ఈ కుటుంబాలు ఓటేసినా చాలు.. తన గెలుపు సులభం అవుతుందని జగన్ అంచనా. అందుకే ఎన్నికల ఏడాది కాబట్టి.. ఎట్టిపరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాల్ని గట్టిగా అమలు చేయాలని ఆయన భావిస్తున్నారు.

pawan kalyan
టీడీపీ-జనసేన కలిస్తే..
మరోవైపు టీడీపీ-జనసేన కూటమిగా ఏర్పడి రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీతో కలిసేందుకు అవసరమైతే బీజేపీని ఒప్పించడమో లేక దూరం జరగడమో చేయాలని జనసేన భావిస్తోంది. రెండు పార్టీలు కూటమి కడితే సామాజిక సమీకరణాలు కూడా కలిసొచ్చే అవకాశం ఉంది. ఒకవేళ జనసేన-టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే చెరో రెండేళ్లు సీఎం పదవి పంచుకుంటారనే ప్రచారం కూడా జరుగుతోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. సామాజిక సమీకరణాలు, జగన్‌పై వ్యతిరేకత వంటివి తమకు కలిసొస్తాయని ఈ రెండు పార్టీల నమ్మకం. దీనివల్ల ప్రతిపక్ష ఓట్లు చీలకుండా ఉంటాయి. అయితే, ఈ కలయికను వైసీపీ తీవ్రంగా విమర్శిస్తోంది. చంద్రబాబును సీఎం చేసేందుకే ఈ కూటమి అని విమర్శిస్తున్నాయి. రెండు పార్టీలు కలిసినా తనకే లాభం అని కూడా వైసీపీ నమ్మకం. ఏదేమైనా ఒంటరిగా వెళ్లినా విజయం సాధిస్తామనే ధీమా జగన్‌లో కనిపిస్తోంది. అయితే, గతంలో వచ్చినన్ని సీట్లు రావని మాత్రం జగన్‌కు అర్థమైంది. భారీగా సీట్లు తగ్గే అవకాశమైతే ఉంది.
పథకాల యావ తప్ప అభివృద్ధి పట్టని జనం
ఒకప్పుడు ఎన్నికల సందర్భంగా ఓటర్లకు డబ్బు పంచి ఓట్లు వేయించుకుని గెలిచేవాళ్లు. దాని కోసం నేతలు సొంత డబ్బు ఖర్చు పెట్టేవాళ్లు. అయితే, ఇప్పుడు ట్రెండు మారింది. ప్రజల సొమ్ము.. ప్రజలకు పంచి ఓట్లు వేయించుకుంటున్నారు. అంటే ఏదో ఒక పథకం పేరు చెప్పి ప్రజల అకౌంట్లలో డబ్బులు వేస్తున్నాయి అధికార పార్టీలు. దీంతో ఈ డబ్బు పొందుతున్న ఓటర్లు, అదే డబ్బు కోసం తిరిగి వారికే అధికారం కట్టబెడుతున్నారు. కానీ, అభివృద్ధి మాట మాత్రం పట్టించుకోవడం లేదు. పన్నులు పెంచినా, కరెంటు చార్జీలు పెంచినా, పెట్రోల్ చార్జీలు పెంచినా పట్టించుకోవడం లేదు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇవ్వకపోయినా గొంతెత్తడం లేదు. తమకు ఆర్థికంగా, అయాచితంగా లబ్ధి కలిగిందా.. లేదా అని మాత్రమే ఆలోచిస్తున్నాయి. ప్రస్తుతం పథకాల లబ్ధిదారులే ఎన్నికలను ప్రభావితం చేస్తున్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులు మాత్రమే స్వల్పంగా అభివృద్ధి చెందుతున్నారు. ప్రజలందరి సమగ్ర అభివృద్ధి జరగడం లేదు. ఇలాంటివాళ్ల ఓట్లు ఎన్నికల్ని ప్రభావితం చేయడం లేదు. మోదీ చెప్పినట్లు అందరూ కట్టే పన్నుల్ని.. కొందరి కోసమే వినియోగించడం సరికాదని నిపుణులు అంటున్నారు. ఇది జనం గుర్తించనంత కాలం ప్రజల్ని.. ప్రజల డబ్బుతోనే కొనుక్కునే ‘సంక్షేమ’ రాజకీయం కొనసాగుతూనే ఉంటుంది.