CM Jagan: త్వరలోనే విశాఖ నుంచి పాలన.. జగన్ కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై జగన్ సర్కార్ వెనక్కు తగ్గట్లేదు. ఇప్పుడు రాజధాని అంశం కోర్టు పరిధిలో ఉంది. దీంతో రాజధాని ఏదనేది కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. అయితే సీఎం జగన్ రాజధానిపై హాట్ కామెంట్స్ చేశారు. త్వరలోనే విశాఖ రాజధాని కాబోతోందని చెప్పారు. తాను కూడా అక్కడికి మకాం మార్చబోతున్నట్టు ప్రకటించారు. ఢిల్లీలో ఏపీ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ సన్నాహక సమావేశంలో జగన్ ఈ కామెంట్స్ చేశారు.
అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా నిర్ణయించింది నాటి చంద్రబాబు ప్రభుత్వం. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ కూడా అమరావతికి ఓకే చెప్పారు. కానీ 2019లో అధికారంలోకి వచ్చాక రాజధాని అమరావతిపై జగన్ యూటర్న్ తీసుకున్నారు. అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ కు అమరావతి కట్టడం చాలా కష్టమని చెప్పారు జగన్. అందుకే రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. 3 రాజధానులపై అసెంబ్లీలో బిల్లు కూడా పెట్టారు. అయితే అమరావతికి భూములిచ్చిన రైతులు తిరగబడి.. కోర్టును ఆశ్రయించారు. దీంతో అమరావతినే రాజధానిగా ఉంచాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో మూడు రాజధానుల ప్రతిపాదనను వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.
3 రాజధానుల ప్రతిపాదనను ప్రభుత్వం వెనక్కు తీసుకోవడంతో అమరావతే రాజధాని అని ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఎక్కడా వెనక్కు తగ్గట్లేదు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు గడప తొక్కింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈ అంశం విచారణలో ఉంది. ఇదే సమయంలో సీఎం జగన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్నాయి. త్వరలోనే విశాఖ రాజధాని కాబోతోందని వెల్లడించారు సీఎం జగన్.
ఏపీ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ సన్నాహక సమావేశాన్ని ప్రభుత్వం ఢిల్లీలో ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి దౌత్యవేత్తలు హాజరయ్యారు. వాళ్లతో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. “త్వరలోనే రాజధాని కాబోతున్న విశాఖకు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. రాబోయే కొన్ని నెలల్లోనే నేను కూడా అక్కడికి మకాం మార్చబోతున్నాను” అని చెప్పారు. దీంతో ప్రభుత్వం త్వరలోనే విశాఖ నుంచి పరిపాలన సాగించబోతున్నట్టు అర్థమవుతోంది. కోర్టు అడ్డంకులు తొలగిన వెంటనే రాజధానులపై కీలక ప్రకటన చేసే ఛాన్స్ ఉంది.
మూడు రాజధానులు ఏర్పాటు చేయడమే తమ విధానమని వైసీపీ మొదటి నుంచి చెప్తోంది. పరిపాలనా రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఆ మేరకు ప్రభుత్వం తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇదే అంశంపై ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వై.వి.సుబ్బారెడ్డి కూడా కీలక కామెంట్స్ చేశారు. ఏప్రిల్ లోపు చట్టపరమైన అన్ని అంశాలను తొలగించుకుని విశాఖ నుంచి పరిపాలన సాగించబోతున్నట్టు ప్రకటించారు.