CM Jagan: జగన్ పాలనకు నాలుగేళ్లు.. ఏపీ ఏం మారింది? పాలనలో వైఫల్యాలేంటి? దశ-దిశ ఏది?

పాదయాత్ర సందర్భంగా జనం ఎక్కడ, ఏది అడిగితే అది చేసేస్తానంటూ చెప్పుకొచ్చారు. నవరత్నాలు అంటూ గొప్ప ప్రణాళిక ప్రకటించారు. దీంతో బాగా నమ్మిన జనం జగన్ మోహన్ రెడ్డిని సీఎం పదవిలో కూర్చోబెట్టారు. అలా నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకున్నారు. అయితే, ఇంకా ఏపీకి ఒక దశ-దిశ ఏర్పడలేదనే చెప్పాలి. నాలుగేళ్లుగా రాజధానే లేదంటే జగన్ పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 30, 2023 | 02:05 PMLast Updated on: May 30, 2023 | 2:05 PM

Cm Jagan Completed Four Years As Cm Is He Succeed What Is The Situation Of Ap

CM Jagan: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ సీఎంగా అధికారం చేపట్టి మంగళవారానికి నాలుగేళ్లు పూర్తయ్యాయి. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ నాలుగేళ్ల పాలన ఎలా ఉంది? హామీలు నెరవేర్చారా? రాష్ట్రాన్ని గాడిలో పెట్టారా? దశ-దిశ చూపారా? ప్రజల్ని మభ్యపెడుతున్నారా?
చంద్రబాబు నాయుడు పాలనతో విసిగిపోయిన ఏపీ జనం జగన్‌ను సీఎం చేశారు. యువ నాయకుడిగా జగన్ రాష్ట్రాన్ని గాడిలో పెడతారని భావించారు. జగన్ పాలన ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నారు. ఆయన జనానికి ఇచ్చిన హామీలు కూడా ఆకట్టుకునేలాగే ఉన్నాయి. పాదయాత్ర సందర్భంగా జనం ఎక్కడ, ఏది అడిగితే అది చేసేస్తానంటూ చెప్పుకొచ్చారు. నవరత్నాలు అంటూ గొప్ప ప్రణాళిక ప్రకటించారు. దీంతో బాగా నమ్మిన జనం జగన్ మోహన్ రెడ్డిని సీఎం పదవిలో కూర్చోబెట్టారు. అలా నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకున్నారు. అయితే, ఇంకా ఏపీకి ఒక దశ-దిశ ఏర్పడలేదనే చెప్పాలి. నాలుగేళ్లుగా రాజధానే లేదంటే జగన్ పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
సంక్షేమంలో దిట్ట
వైఎస్ జగన్ పాలనలో మొదటగా చెప్పుకోవాల్సింది సంక్షేమ పథకాలు. దాదాపు ప్రతి పేద, మధ్య తరగతి కుటుంబానికి ఏదో ఒక సంక్షేమ పథకం అందేలా చూశారు. అమ్మ ఒడి, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, వాహన మిత్ర.. ఇలా ఏదో ఒక పథకం పేరుతో అనేక కుటుంబాలకు అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు. దీంతో ఆయా కుటుంబాలు జగన్ పాలనపై సానుకూలంగానే ఉన్నాయి. దేశంలో ఇలా ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం మరోటి లేదు. ఎక్కువ శాతం కుటుంబాలకు ఈ పథకాల వల్ల లాభం కలుగుతోంది. పైగా ఈ పథకాల అమలులో వివక్ష, అవినీతి లేకుండా చూస్తున్నాడు. వలంటీర్ల వ్యవస్థ ప్రవేశపెట్టి అర్హులైన ప్రతి కుటుంబానికి ఏదో ఒక పథకం అందేలా చూస్తున్నాడు. నెలనెలా రేషన్ సరుకులు ఇంటింటికీ అందిస్తున్నాడు. సంక్షేమ పథకాలు అమలు చేసినంత మాత్రాన పాలన గొప్పగా ఉందని చెప్పలేం. ఎందుకంటే సంక్షేమ పథకాలతో ఆయా కుటుంబాలకు తాత్కాలిక లబ్ధి మాత్రమే కలుగుతుంది. కానీ, అభివృద్ధితోనే ఏ రాష్ట్రమైనా ప్రగతి సాధిస్తుంది. అయితే, ఏపీలో అభివృద్ధి లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయి. అభివృద్ధి కార్యక్రమాలపై జగన్ దృష్టిపెట్టడం లేదు. అభివృద్ధి అంటే పరిశ్రమల ఏర్పాటు.. ఉద్యోగ, ఉపాధి కల్పన.. ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణం.. ఇండ్లు, మంచి నీటి వసతి కల్పన.. వీటన్నింటిలోనూ జగన్ సర్కారు నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఎక్కడా ఏపీలో అభివృద్ధి అనేదే కనిపించదు. రోడ్లు అత్యంత అధ్వానస్థితిలో ఉన్నాయి. కొత్తగా పరిశ్రమలు రావడం లేదు. పేరుకు ఒకట్రెండు పరిశ్రమలు పెడుతున్నట్లు కనిపిస్తున్నా.. వాటి స్థాయి ఏంటో తెలియదు. పరిశ్రమల ఏర్పాటుకు ఏపీలో అనేక అవకాశాలున్నా.. వాటిని వినియోగించుకోవడంలో జగన్ సర్కారు విఫలమైంది. పైగా రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలే పక్క రాష్ట్రానికి వెళ్లిపోతున్నాయని ప్రతిపక్షాలు గోల చేస్తున్నాయి. ఇలా అయితే.. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి కల్పన కలగానే మిగులుతుంది. చివరకు ఐటీ పరిశ్రమల్ని కూడా తీసుకురాలేకపోయారు. పక్క రాష్ట్రమైన తెలంగాణ ఈ విషయంలో దూసుకుపోతుంటే.. ఏపీ మాత్రం బిత్తరచూపులు చూస్తోంది. ఏపీకి పరిశ్రమలు రావడం లేదంటే జగన్ వైఫల్యంగానే చెప్పుకోవాలి.
పోలవరం ప్రాజెక్టుకేమైంది?
జగన్ వైఫల్యానికి పెద్ద నిదర్శనంగా చెప్పుకోవాల్సింది పోలవరం ప్రాజెక్టు. అధికారం చేపట్టి నాలుగేళ్లైనా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయారు. ఈ ప్రాజెక్టును ఎప్పుడో పూర్తి చేస్తామని చెప్పారు. ఆలస్యం కావడంతో.. కరోనాను సాకుగా చూపారు. కరోనా ప్రభావం పోయినా అసలు ప్రాజెక్టు పనులు తిరిగి ప్రారంభమే కాలేదు. ఎప్పుడు ప్రాజెక్టు పూర్తవుతుందో కూడా తెలియదు. ఈ విషయంలో గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ జగన్ కాలం గడిపేస్తున్నారు.
మద్యపాన హామీకి మంగళం?
జగన్ హామీల్లో గొప్పగా చెప్పుకోవాల్సింది సంపూర్ణ మద్యపాన నిషేధం. మద్యం వల్ల రాష్ట్రంలోని ఆడబిడ్డల కుటుంబాలు నాశనమైపోతున్నాయని, తాను అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్యపానం నిషేధం అమలు చేస్తానని ప్రగల్భాలు పలికారు. తీరా అధికారంలోకి వచ్చాక మాట తప్పారు. పైగా మద్యం తాగే అలవాటును క్రమంగా మాన్పిస్తానన్నాడు. ఒకే బ్రాండ్లు తాగితే అలవాటు పడిపోతారని, వేరే బ్రాండ్లైతే తాగుడు మానేస్తారని కొత్త వాదన తెరపైకి తెచ్చారు. పాత బ్రాండ్ల అమ్మకాలు ఆపేయించి, దేశంలో ఎక్కడా దొరకని బ్రాండ్లను ప్రవేశపెట్టారు. ఆ విచిత్ర బ్రాండ్లు కావాలంటే ఎవరైనా ఏపీకి వెళ్లాల్సిందే. ఇచ్చిన హామీ నెరవేర్చకపోయినా ప్రతిపక్షాలపై విమర్శలు చేయడంలో మాత్రం జగన్ ముందుంటారు.
రాజధాని ఏది సారూ?
జగన్ పాలనలో మరో అతిపెద్ద వైఫల్యం రాజధాని. ఒక రాష్ట్రానికి రాజధానే లేకపోవడం జగన్ పాలనలో విచిత్రం. జగన్ అధికారంలోకి రాగానే, గతంలో తానే మద్దతిచ్చిన అమరావతిని రద్దు చేశారు. మూడు రాజధానుల అంశం తెరమీదకు తెచ్చారు. ఒకే రాజధాని ఉంటే.. ఒక్క ప్రాంతమే అభివృద్ధి చెందుతుందని, అదే ప్రాంతానికో రాజధాని ఉంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. దీంతో మూడు ప్రాంతాలకు.. మూడు రాజధానులు అంటూ చెప్పుకొచ్చారు. దీన్ని అమరావతి రైతులతోపాటు, ప్రతిపక్షాలు తప్పుబట్టాయి. దీంతో ఏపీకి రాజధానే లేకుండా పోయింది. నాలుగేళ్లుగా రాజధాని లేని రాష్ట్రంగా మిగిలింది ఏపీ. ఈ అంశం చివరకు కోర్టుకు చేరింది.

CM Jagan
జాబ్ క్యాలెండర్ మరో మాయ!
ఇచ్చిన హామీలు నెరవేర్చుకున్నవాడే నాయకుడు.. అలాంటి నాయకుడికే ఓట్లడిగే హక్కు ఉంటుంది అంటూ గతంలో గొప్పగా చెప్పారు జగన్. కానీ, అధికారంలోకి వచ్చాక తాను ఇచ్చిన హామీల్ని మర్చిపోయారు. ఉద్యోగార్థులు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూడకుండా ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ అమలు చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఏ ఏడాది.. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చేది ముందుగానే ప్రకటిస్తామన్నారు. అయితే, అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్ మాటే మర్చిపోయారు. ఉద్యోగాలు, నోటిఫికేషన్ల విషయంలో నిరుద్యోగ యువతను జగన్ మోసం చేశారనే చెప్పాలి. ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేస్తానని చెప్పడం మరో మోసం. గతంలో సీపీఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చి, తర్వాత సాధ్యం కాదని చేతులెత్తేశారు. జగన్ వైఫల్యాలుగా చెప్పుకోవాల్సినవి ఇలాంటివి చాలానే ఉన్నాయి. అధికారం చేపట్టిన తర్వాత ఇండ్ల నిర్మాణం పూర్తి చేయలేదు. ఇసుక ఉచితంగా ఇస్తానని చెప్పి ధరలు పెంచేశారు. దీంతో నిర్మాణ రంగం కుదేలైపోయింది. కూలీలకూ పని దొరకని పరిస్థితి. పింఛన్ల పెంపు విషయంలోనూ డొంక తిరుగుడు పద్ధతి పాటించారు. మూడు వేల రూపాయలకు ఒకేసారి పెంచకుండా దశలవారీగా పెంచుతామని మాటదాటవేశారు.
అప్పులే దిక్కు
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఆదాయం పెరగాలి. కానీ, ఈ విషయంలో జగన్ విఫలమయ్యాడు. ఆదాయం పెంచలేకపోయాడు. అప్పు తెస్తే తప్ప ప్రభుత్వం నడపని పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు అప్పుల ద్వారానే ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్నాడు. వచ్చిన నిధుల్ని సంక్షేమంవైపు మళ్లిస్తున్నాడు. ప్రస్తుతం ఏపీ అప్పులు రూ.4.4లక్షల కోట్లకుపైగా ఉన్నాయి. అయితే, ఈ అప్పులు రూ.9 లక్షల కోట్ల వరకు ఉండొచ్చనే మరో వాదన కూడా ఉంది. ఈ స్థాయి అప్పులంటే రాష్ట్రం దివాళా తీసే పరిస్థితులున్నాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
ప్రతిపక్షాలపై యుద్ధం
జగన్ అధికారంలోకి రాగానే ప్రతిపక్షాలపై యుద్ధం ప్రకటించారు. ముందుగా చంద్రబాబు నిర్మించిన ప్రజా వేదికను కూల్చారు. అప్పట్నుంచి ప్రతిపక్ష నేతలపై వరుసగా కేసులు పెడుతూ వచ్చారు. చంద్రబాబు హయాంలో జరిగిన రాజధాని స్కాం, స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలపై విచారణ ప్రారంభించారు. ప్రతిపక్ష నేతలపై దాడులు ఎక్కువయ్యాయి. తనను ఎదిరించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారు. మీడియాను, సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపైనే కాదు.. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై కూడా ఆ పార్టీ నేతలు ఘాటైన విమర్శలు చేస్తున్నారు. వ్యక్తిగత దూషణకు దిగుతున్నారు. రాజకీయాల్లో ఇవన్నీ సహజమే అయినా.. జగన్ అనుసరిస్తున్న పంథా మాత్రం కొత్తది. ఏ సామాజిక వర్గానికి చెందిన నేతల్ని అదే సామాజిక వర్గం వాళ్లతో తిట్టిస్తున్నారు. అయితే, ప్రతిపక్షాలపై జగన్ పైచేయి సాధించారు.
ఇదే జగన్ నైజం!
రాజకీయాల్లో జగన్ చాలా మొండి. ఫలితం ఎలాంటిదైనా తాను అనుకున్నదే చేస్తాడు. ఇప్పటికీ ప్రతిపక్షాల విమర్శలకు ధీటైన జవాబివ్వడంలో వైసీపీ నేతలు ముందున్నారు. దీంతో రాజకీయ క్షేత్రంలో జగన్‌దే పైచేయి. అభివృద్ధిని పక్కనబెట్టి, తనదైన సంక్షేమ పథకాల్ని అమలు చేస్తున్నారు. ఈ పథకాలే తనను మళ్లీ గెలిపిస్తాయని నమ్ముతున్నాడు. రోడ్లు, పోలవరం ప్రాజెక్టు, మౌలిక వసతుల కల్పన, పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగ, ఉపాధి కల్పన వంటి వాటికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. అయినా ఈ విషయంలో తనపై ప్రజల నుంచి భారీ వ్యతిరేకత రాకుండా చూసుకోగలిగారు.
ఏపీకి దశ-దిశ ఏది?
రాష్ట్రానికి రాజధాని లేదు. రాజధాని ఉంటే తప్ప వ్యవస్థలు గాడిలో పడవు. ఈ విషయంలో జరుగుతున్న నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు. పరిశ్రమలు రావాలన్నా.. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు రావాలన్నా రాజధానివైపే చూస్తాయి. అలాంటప్పుడు రాజధాని లేకపోతే నష్టం కాదా? ఐటీ కంపెనీలొస్తే ఎన్ని వేల ఉద్యోగాలొస్తాయి? పరిశ్రమలతో ఎందరికి ఉపాధి దొరుకుతుంది? తీర ప్రాంతం ఉన్నా వాడుకోరా? ఖనిజ సంపద, సహజ వనరులు ఉన్నా, రాష్ట్రం వినియోగించుకోలేకపోతుంది. నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల్లేవు. పోలవరం ప్రాజెక్టు పూర్తైతే రాష్ట్ర వ్యవసాయ రంగం కొత్త పుంతలు తొక్కుతుంది. వీటన్నింటిపై జగన్ దృష్టి సారించి, పరిష్కరించకపోతే జగన్‌కు జరిగే నష్టం సంగతి అటుంచితే.. ఏపీకి మాత్రం ఇంకా తీరని అన్యాయం జరుగుతుంది. నాలుగేళ్లలో మిగిలిపోయిన.. చేయలేకపోయిన పనుల్ని ఇకనైనా జగన్ పూర్తి చేస్తే ప్రజల భరోసా లభిస్తుంది. లేదంటే ప్రతిపక్షాలకు అధికారం ఇచ్చినట్లవుతుంది.