YS Jagan: జగన్‌లో పెరిగిపోతున్న ఫ్రస్ట్రేషన్..! పవన్ కల్యాణ్ ట్రాప్‌లో పడిపోయారా..?
పవన్ కల్యాణ్ వాలంటరీ వ్యవస్థ అమలు తీరును ప్రశ్నించడం మొదలు పెట్టినప్పుడు.. ఆయన వేస్తున్న ప్రశ్నలకు సూటిగా స్పష్టంగా సమాధానం చెబితే జనసేనకు మాటలు లేకుండా చేయవచ్చు. కానీ వాలంటరీ వ్యవస్థను ప్రశ్నించడాన్ని సీఎం జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు.
YS Jagan: ప్రత్యర్థి వ్యూహం పన్నక ముందే.. ప్రతివ్యూహాన్ని సిద్ధం చేసుకోవాలి. ఇదే రాజకీయం. విమర్శలు, ప్రతివిమర్శల ఊబిలో చిక్కుకుని వ్యూహం లేకుండా ముందుకెళితే రాజకీయాల్లో ఎదురుదెబ్బలు తగులుతాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొంతకాలంగా ఏపీ రాజకీయాలు మొత్తం వాలంటీర్ వ్యవస్థ చుట్టూ తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ మానసపుత్రికగా తెరపైకి వచ్చి, వైసీపీకి పదేపదే అధికారాన్ని కట్టబెట్టేలా చేసే సత్తా ఉన్న వ్యవస్థగా ఆ పార్టీ నమ్ముకున్న వాలంటీర్లు అనే తేనెతుట్టెను జనసేనాని పవన్ కల్యాణ్ కదిల్చారు. పవన్ ఈ మధ్య కాలంలో ఎక్కడ ఎప్పుడు మాట్లాడినా.. సందర్భం ఉన్నా లేకపోయినా వాలంటీర్ల వ్యవస్థపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీంతో అధికార పక్షం సహజంగానే ఎదురుదాడి చేస్తుంది. వైసీపీ నేతలు కూడా అదే చేస్తున్నారు. అయితే ఆశ్చర్యంగా సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి జగన్మోనహన్ రెడ్డి పవన్ ఆరోపణలపై స్పందించిన తీరు మాత్రం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తోంది. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం ప్రజల వ్యక్తిగత డేటాను సేకరిస్తోందన్న పవన్ కల్యాణ్ సూటి ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన జగన్.. ఆరోపణల ట్రాప్‌లో పడిపోయినట్టు కనిపిస్తోంది.
జగన్ ఏం చేయాలి..? ఏం చేస్తున్నారు ?
నిజంగా వాలంటీర్ల వ్యవస్థ ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందా..? వాలంటీర్లుగా ఊళ్లలో తిరుగుతున్న వ్యక్తులు పార్టీలకతీతంగా వ్యవహరిస్తున్నారా..? మాకు నచ్చిన వాళ్లనే, మా పార్టీకి ఉపయోగపడే వాళ్లనే వాలంటీర్లుగా నియమించుకున్నాం అని అంబటి రాంబాబులాంటి సీనియర్ వైసీపీ నేతలు బహిరంగంగానే ప్రకటించిన తర్వాత కూడా.. ఇక వాలంటీర్ల వ్యవస్థ సుద్దపూస అని చెప్పుకోవడంలో అర్థం ఉండదు. రాజకీయం కోసమే కావొచ్చు.. లేక మరో ఎజెండాతో కావొచ్చు.. పవన్ కల్యాణ్ వాలంటరీ వ్యవస్థ అమలు తీరును ప్రశ్నించడం మొదలు పెట్టినప్పుడు.. ఆయన వేస్తున్న ప్రశ్నలకు సూటిగా స్పష్టంగా సమాధానం చెబితే జనసేనకు మాటలు లేకుండా చేయవచ్చు. కానీ వాలంటరీ వ్యవస్థను ప్రశ్నించడాన్ని సీఎం జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ వ్యవహారంలో హుందాగా టిట్ ఫర్ టాట్ అంటూ సమాధానం చెప్పాల్సిన సీఎం.. ఏకంగా వ్యక్తిగత విమర్శలు అందుకున్నారు. నిన్న మొన్నటి వరకు దత్తపుత్రుడు అంటూ పవన్ కల్యాణ్ వివాహాల గురించి వివిధ సభల్లో విమర్శలు చేసిన జగన్.. ఇప్పుడు చంద్రబాబు, లోకేశ్, పవన్, బాలకృష్ణ ఎవర్నీ వదిలిపెట్టకుండా పర్సనల్ అటాక్ మొదలు పెట్టారు. విమర్శకు ప్రతి విమర్శ చేయడం, వాదనకు ప్రతివాదం వినిపించడం ఎక్కడైనా సహజమే. కానీ ఎవరైనా ఒక విషయంపై వేలెత్తి చూపించినప్పుడు దానికి సరైన సమాధానం చెప్పలేనప్పుడు మాత్రమే ఎవరైనా వ్యక్తిగత దాడి మొదలు పెడతారు. ఇప్పుడు జగన్ కూడా అదే చేశారా అన్న భావన కలుగుతోంది.
సమస్యలను పక్కదారి పట్టించేందుకేనా ?
వివిధ పథకాల రూపంలో ప్రజల ఖాతాలు నిండుతున్నా.. ఏపీలో జగన్ హయాంలో అభివృద్ధి కనిపించడం లేదన్నది ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట. జగన్‌కు పట్టుండే రాయలసీమ జిల్లాల్లోనూ ప్రజలు వైసీపీ పాలన విషయంలో అంత సంతృప్తిగా లేరని పబ్లిక్ టాక్ ద్వారా తెలుస్తోంది. వీటినే అస్త్రాలుగా చేసుకున్న ప్రతిపక్షాలు.. జగన్‌ను మరోసారి ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకునేందుకు వాటి వ్యూహాలు అవి పన్నుతున్నాయి. అందులో భాగంగానే రాజకీయంగా లబ్ది చేకూర్చే ప్రతి అంశాన్ని హైలైట్ చేస్తున్నాయి. వాలంటీర్ వ్యవస్థ టార్గెట్‌గా పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేయడం వెనుక కూడా కారణం ఇదే. వీటికి సమాధానం చెప్పాల్సిన ముఖ్యమంత్రి వ్యక్తిగత విమర్శలకు దిగుతూ విపక్షాల ట్రాప్‌లో కూరుకుపోయినట్టు కనిపిస్తోంది. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో పాటు రామోజీరావు మరికొన్ని మీడియా సంస్థలను కలిపి గజదొంగల ముఠాగా నామకరణం చేసిన జగన్.. ఎక్కడకు వెళ్లినా.. ఏ సభలో ప్రసంగించినా.. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి కంటే.. వీళ్ల మీద వ్యక్తిగత దాడి చేయడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్టు కనిపిస్తోంది. వాలంటీర్ వ్యవస్థ ద్వారా తమ ప్రభుత్వం గడప గడపకు పాలనను తీసుకెళ్తుంటే టీడీపీ, జనసేన తమ అనుకూల మీడియాతో ఆ వ్యవస్థకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి.
పవన్‌కు, వాళ్లకు అసలు లింకేంటి ?
పవన్ టీడీపీతో పొత్తుపెట్టుకోవచ్చు. భవిష్యత్తులో రెండు పార్టీలు కలిసి పోటీచేయవచ్చు. రాజకీయ అవసరాల మేరకు ఆ రెండు పార్టీలు బీజేపీతో కలిసి ఎలాంటి అడుగులైనా వేయవచ్చు. అది రాజకీయంగా వాళ్లకున్న వెసులుబాటు. కానీ పవన్ ఏం మాట్లాడినా అది చంద్రబాబు, రామోజీరావు కలిసి మాట్లాడించినట్టు వాళ్లకు ముడిపెట్టి మాట్లాడుతున్నాడు జగన్. నేను ప్రజల పక్షం ఉంటే.. ప్రతిపక్షాలు, కొన్ని మీడియా సంస్థలు ఏపీ ప్రజలకు సంక్షేమ పథకాలు అందకుండా కుట్ర చేస్తున్నాయనే అర్థం వచ్చేలా ఈ మధ్య కాలంలో జగన్ ప్రసంగిస్తున్నారు.
వ్యక్తిగత విమర్శలు జగన్‌కు మేలు చేస్తాయా ?
వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని జగన్ రాజకీయం చేస్తున్నారన్నది పవన్ కల్యాణ్ చేస్తున్న ప్రధాన విమర్శ. ప్రజల వ్యక్తిగత డేటాను వాలంటీర్ల ద్వారా సేకరించి, వాటిని వైసీపీ తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటుందన్నది పవన్ పదే పదే చేస్తున్న ఆరోపణ. దీనికి ఆధారాలు చూపుతూ ఆయన వరుసగా ట్వీట్లు కూడా చేస్తున్నారు. ఇలాంటి సమయంలో వాలంటీర్ వ్యవస్థ పూర్తి పారదర్శకంగా పనిచేస్తుందని, ప్రజల వ్యక్తిగత డేటాకు వచ్చిన ముప్పేమీ లేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. కానీ అలా చేసే ప్రయత్నం చేయకుండా జగన్ అండ్ కో.. పవన్ పైనా, దుష్టచతుష్టయం అంటూ బాబు అండ్ కోపైనా విరుచుకుపడుతున్నారు.
సీఎం జగన్ ఫ్రస్టేషన్‌లో ఉన్నారా ?
ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ముఖ్యమంత్రి జగన్‌లో ప్రస్టేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. రాజకీయాల్లో ప్రభుత్వంపై విపక్షాలు నోరుపారేసుకోవడం సహజం. అధికార పార్టీ వాటిని అర్థవంతంగా ఎదుర్కోవడంలోనే వాళ్ల సత్తా ఏంటో అర్థమవుతుంది. ఈ మధ్య కాలంలో జగన్ తీరు చూస్తుంటే ఏదో అసహనం కనిపిస్తోంది. సంవత్సరం పొడవునా ఎన్నిసార్లు బటన్ నొక్కి ఎన్ని నిధులు ప్రజల ఖాతాల్లోకి జమ చేసినా ఓవరాల్ పాలనపైనా, అభివృద్ధి పైన, ఏపీ ప్రజలు అంత సంతృప్తిగా లేరన్న విషయం జగన్ తీరులో స్పష్టంగా కనిపిస్తోంది. కొంతకాలం క్రితం వరకు 175కు 175 గెలుస్తామంటూ ప్రకటనలు చేసిన జగన్ అండ్ కో ఇప్పుడు ఆ మాట మాట్లడటం లేదు. తమ పరిస్థితి నియోజకవర్గాల్లో అంత పాజిటివ్‌గా లేదని కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఆఫ్ ది రికార్డు చెప్పుకుంటున్నారు. ఏ రకంగా చూసినా వచ్చే ఎన్నికల్లో తాము కోరుకున్న ఫలితాలు వస్తాయో, రావోనన్న ఫీలింగ్ అయితే వైసీపీ పెద్దల్లో స్పష్టంగా కనిపిస్తోంది. విపక్ష నేతలపై జగన్ వ్యక్తిగత విమర్శలు అందుకోవడానికి ఈ ఫ్రస్టేషనే కారణం కావొచ్చు.
ఆ లోపాలు జగన్ మెడకు చుట్టుకుంటాయా ?
అరెస్ట్ చేసుకోండి.. ప్రాసిక్యూట్ చేసుకోండి.. జైల్లో పెట్టండి.. వాలంటీర్ వ్యవస్థపై పదేపదే విమర్శలు చేస్తూ.. ప్రభుత్వానికి జనసేనాని విసురుతున్న సవాల్ ఇది. వాలంటీర్ వ్యవస్థ రాజ్యాంగేతర శక్తిగా మారిందని.. దానికి ఆధారాలు కూడా ఉన్నాయని చెబుతున్న పవన్.. దీనిపై పోరాడేందుకు ఎంత వరకైనా వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. రానున్న ఎన్నికల్లో ఇదే ప్రధాన ప్రచార అస్త్రంగా మారినా ఆశ్చర్యం లేదు. అయితే ప్రభుత్వం చెప్పుకుంటున్నట్టు, ప్రచారం చేసుకుంటున్నట్టు వాలంటీర్లుగా పనేచేస్తున్న 2 లక్షలకుపైగా యువతీయువకులు పూర్తిగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేయడం లేదు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేస్తూనే… వైసీపీకి లబ్ది చేకూర్చేలా అన్ని రకాల వ్యవహారాలను వాలంటీర్లు నడుపుతున్నారన్నది బహిరంగ రహస్యంగా కనిపిస్తోంది. ఈ వ్యవస్థను అడ్డంపెట్టుకుని జగన్ రాజకీయంగా ఎలాంటి లబ్దిపొందాలనుకున్నారో గానీ.. ప్రస్తుతం జరుగుతున్న వివాదాన్ని చూస్తే వాలంటీర్ వ్యవస్థలో ఉన్న లోపాలే ఆయన మెడకు చుట్టుకుంటాయేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయి.
పవన్ వ్యూహం కూడా అదేనా?
వాలంటీర్లపైనా, ఆ వ్యవస్థ పనిచేస్తున్న విధానంపైనా టీడీపీకి కూడా ఎన్నో అనుమానాలు ఉన్నా ఎన్నికల వేళ వాలంటీర్ వ్యవస్థకు వ్యతిరేకంగా మాట్లాడితే తమ ఓటు బ్యాంకు దెబ్బతింటుందేమోనన్న భయంతో టీడీపీ దానిపై పదునైన విమర్శలను ఎక్కుపెట్టలేదు. కానీ పవన్ కల్యాణ్ దాన్నే ఎన్నికల ఎజెండాగా మార్చేశారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చేసి జగన్‌ను ఓడించడం ఒక్కటే లక్ష్యంగా పెట్టుకున్న పవన్ కల్యాణ్.. జగన్ ఏ వ్యవస్థను చూసి ఎన్నికల సమయంలో భరోసాతో ఉన్నారో ఆ వ్యవస్థనే టార్గెట్ చేసుకున్నారు. ఒకరకంగా జగన్‌ను తన పొలిటికల్ ట్రాప్‌లోకి లాక్కున్నారు పవన్ కల్యాణ్.