కేబినెట్ సహచరులపై సీఎం జగన్ అసంతృప్తి.. మార్పులు చేర్పులు ఖాయమా..?
ఇప్పుడు మరోసారి జగన్ కేబినెట్ లో మార్పులు, చేర్పులు చేసేందుకు సిద్ధమయ్యారనే వార్త ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఉగాదిని ఇందుకు ముహూర్తంగా ఎంచుకున్నారని తెలుస్తోంది.
2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి మాత్రమే కేబినెట్ ను పునర్వ్వవస్థీకరించారు. ప్రమాణ స్వీకార సమయంలోనే ఆయన రెండున్నరేళ్ల తర్వాత కేబినెట్ ను పూర్తిగా మారుస్తానని చెప్పారు. దీంతో అప్పటి మంత్రులంతా తమ పదవీకాలం రెండున్నరేళ్లే అని ఫిక్స్ అయిపోయారు. చెప్పిన విధంగానే మూడేళ్ల తర్వాత కేబినెట్ ను పునర్వ్యవస్థీకరించారు జగన్. ఆ సమయంలో నలుగురు మినహా మిగిలిన మంత్రులందరినీ మార్చేశారు. ఇప్పుడు మరోసారి జగన్ కేబినెట్ లో మార్పులు, చేర్పులు చేసేందుకు సిద్ధమయ్యారనే వార్త ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.
నచ్చకపోతే మార్చేయడం జగన్ స్టైల్. డీజీపీ గౌతమ్ సవాంగ్ విషయంలో కానీ, చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం విషయంలో కానీ జగన్ తీసుకున్న నిర్ణయాలు సంచలనం కలిగించాయి. ఇప్పుడు కేబినెట్ విషయంలో కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకోబోతున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. రెండోసారి మంత్రివర్గాన్ని విస్తరించిన తర్వాత కేబినెట్ పకడ్బందీగా లేదనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వంపై విపక్షాలు ఆరోపణలు చేసినప్పుడు తగిన విధంగా స్పందించడంలో మంత్రులు విఫలమవుతున్నారనే అభియోగాలున్నాయి. ప్రతి విషయాన్ని సీఎంఓ నుంచి చెప్పాల్సి వస్తోందని.. మంత్రులు స్వతంత్రంగా స్పందించట్లేదని వైసీపీ నేతలే చెప్తున్నారు.
ముఖ్యంగా జగన్ సతీమణి భారతి విషయంలో విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేశాయి. లిక్కర్ కుంభకోణాన్ని ఆవిడే నడిపిస్తున్నారనేలా విపక్ష నేతలు ఆరోపించారు. వీటిని తిప్పికొట్టడంలో మంత్రులు పూర్తిగా విఫలమయ్యారనే బాధ జగన్ కు ఉంది. ఇదే అంశంపై జగన్ కేబినెట్ మీటింగ్ లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు కూడా. ఆ తర్వాత కాస్త పర్వాలనేదనిపించినా.. ఇటీవల మళ్లీ మంత్రులు చల్లబడిపోయారనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో కొంతమంది మంత్రుల పనితీరుపైన కూడా అసంతృప్తి ఉంది. ఇటీవలి సర్వేల్లో మంత్రుల పర్ఫార్మెన్స్ ఏమాత్రం బాగాలేదని ఐప్యాక్ నివేదించినట్లు సమాచారం.
రిపోర్ట్ కార్డ్ ఆధారంగా కొంతమంది మంత్రులను మార్చేందుకు సీఎం జగన్ సిద్ధమయ్యారని సమాచారం. ఐదారుగురు మంత్రులకు ఉద్వాసన పలికి వారి స్థానంలో కొత్తవారికి ఛాన్స్ ఇస్తారని తెలుస్తోంది. అయితే మొదటి కేబినెట్లో ఉన్న ఇద్దరు మంత్రులకు మళ్లీ అవకాశం లభిస్తుందని కూడా సమాచారం. ఒకరు కమ్మ, మరొకరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఈ ఇద్దరూ మళ్లీ జగన్ టీంలోకి అడుగు పెడ్తారని బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఉత్తరాంధ్రకు చెందిన ఇద్దరు మంత్రులకు ఉద్వాసన తప్పదని సమాచారం. అలాగే ఒక మహిళా మంత్రిని తప్పించి మరొకరికి అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. గుంటూరు జిల్లా నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికవుతున్న మర్రి రాజశేఖర్ తో పాటు కొత్త ఎమ్మెల్సీల్లో మరొకరికి కూడా కేబినెట్ బెర్త్ దొరుకుతుందని తెలుస్తోంది. అలాగే సజ్జల పేరు కూడా వినిపిస్తున్నా.. జగన్ మాత్రం ఆయన్ను పార్టీకీ వాడుకునేందుకు మొగ్గు చూపుతారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. మొత్తానికి కేబినెట్ ను పునర్వ్యవస్థీకరించాలని జగన్ నిర్ణయించారని.. ఉగాదిని ఇందుకు ముహూర్తంగా ఎంచుకున్నారని తెలుస్తోంది.