CM Jagan: సీఎం సారొస్తే చెట్లు నరకాల్సిందేనా..? ఇదేం తీరు..? వెల్లువెత్తుతున్న విమర్శలు..!
సీఎం ఒక్క రోజు పర్యటన కోసం, ముప్పై ఏళ్ల వయసున్న చెట్లను నరికి, ప్రకృతిని నాశనం చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. హెలిప్యాడ్ వద్దే కాకుండా.. సీఎం పర్యటించే మార్గంలో కూడా అనేక చెట్లను రోడ్డకు ఇరువైపులా నరికేస్తున్నారు. స్థానిక జనసేన నేతలు ఈ చెట్ల నరికివేతను అడ్డుకున్నారు.
CM Jagan: ఏపీలో సీఎం జగన్ ఎక్కడ పర్యటించినా అక్కడ మామూలు హడావుడి ఉండదు. ఆయన హెలికాప్టర్లలో ప్రయాణించినా సరే.. రోడ్డుపై ట్రాఫిక్ ఆపేస్తుంటారు అక్కడి పోలీసులు. తాజాగా సీఎం పర్యటన కోసం అధికారులు భారీ స్థాయిలో చెట్లను నరికేయడం వివాదస్పదంగా మారింది. ఈ నెల 26న అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురంలో సీఎం జగన్ పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా చెట్లను నరికి మరీ హెలిప్యాడ్ సిద్ధం చేశారు. దీనిపై స్థానిక జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కోసం ప్రకృతిని నాశనం చేయడం ఏంటని విమర్శిస్తున్నారు.
అమలాపురంలో సీఎం జగన్ పర్యటనకు సంబంధించి స్థానిక ఆర్డిఓ కార్యాలయం నుంచి బాలయోగి ఘాట్ వరకు రూట్ మ్యాప్ సిద్ధమైంది. అలాగే సీఎం హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు హెలిప్యాడ్ స్థలాన్ని కూడా ఏర్పాటు చేశారు. స్థానిక ఎస్‌కేబీఆర్ కళాశాలలో ఒక హెలిప్యాడ్, కిమ్స్ మెడికల్ కళాశాలలో మరో హెలీప్యాడ్ సిద్ధంగా ఉన్నప్పటికీ అధికారులు ఓల్డ్ పోలీస్ క్వార్టర్స్ వద్ద ఖాళీ స్థలాన్ని ఇందుకోసం ఎంపిక చేశారు. నిజానికి ఇక్కడ హెలిప్యాడ్‌కు అనువైన స్థలం లేదు. అక్కడ కొబ్బరిచెట్లు ఉన్నాయి. అయితే, అధికారులు ఆ చెట్లను కొట్టివేశారు. దీనిపై పర్యావరణవేత్తలు, జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 30 ఏళ్లుగా పెరుగుతున్న చెట్లను కొట్టేయాల్సిన అవసరం ఏముందని జనసేన శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. గతంలో వినియోగించిన రెండు హెలిప్యాడ్లలో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసి ఉంటే బాగుండేదని స్థానికులు అంటున్నారు. సీఎం ఒక్క రోజు పర్యటన కోసం, ముప్పై ఏళ్ల వయసున్న చెట్లను నరికి, ప్రకృతిని నాశనం చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. హెలిప్యాడ్ వద్దే కాకుండా.. సీఎం పర్యటించే మార్గంలో కూడా అనేక చెట్లను రోడ్డకు ఇరువైపులా నరికేస్తున్నారు. స్థానిక జనసేన నేతలు ఈ చెట్ల నరికివేతను అడ్డుకున్నారు. పైగా దీనికి ప్రభుత్వం రూ.15 లక్షలు ఖర్చు చేస్తోంది. ఇంత ఖర్చు చేసి మరీ చెట్లను నరకడం ఏంటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలోనూ పలు సందర్భాల్లో సీఎం పర్యటన కోసం అనేక చోట్ల ఇలాగే చెట్లను నరికివేసిన ఘటనలున్నాయి. అప్పుడు కూడా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి.
ప్రజలకు ఇబ్బందులు
సీఎం పర్యటించే చోట స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీఎం ఎక్కడికి వెళ్తే అక్కడ షాపులన్నింటినీ ముందుగానే మూసేస్తున్నారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు, విద్యా సంస్థలకు కూడా సెలవులు ప్రకటిస్తున్నారు. దీనివల్ల ప్రజలు, విద్యార్థులు, చిరు వ్యాపారులు ఇబ్బందుల పాలవుతున్నారు. సీఎం సభా ప్రాంగణానికి కిలోమీటర్ల దూరంలో ట్రాఫిక్ ఆపేయడంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పైగా సీఎం ఎక్కువగా హెలికాప్టర్లలోనే తిరుగుతుంటారు. ఆయన రోడ్డు మార్గంలో వెళ్లకపోయినప్పటికీ.. ఆ చుట్టు పక్కల రోడ్లను గంటలతరబడి మూసేస్తున్నారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక సీఎం పర్యటించే చోట్ల రోడ్డుకు చుట్టూ పరదాలు కట్టడం, బారికేడ్లు పెట్టడంపై కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి.