Chandrababu Naidu: ఉద్యోగుల విషయంలో చేతులెత్తేసిన జగన్.. టీడీపీకి కలిసొచ్చేనా..?
జగన్ నిర్ణయాలు టీడీపీకి వరంలా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఉద్యోగుల్ని జగన్ పూర్తిస్థాయిలో సంతృప్తి పరచలేకపోతున్నారు. ముఖ్యంగా సీపీఎస్ రద్దు విషయంలో జగన్ విఫలమవ్వడంపై ఉద్యోగులు ఆగ్రహంతో ఉన్నారు.
Chandrababu Naidu: ఉద్యోగుల విషయంలో ఏపీ సీఎం జగన్ అనుసరిస్తున్న వైఖరి ఆ పార్టీకి నష్టం కలిగించేలా ఉంది. ఉద్యోగుల డిమాండ్లను జగన్ పట్టించుకోవడం లేదు. ఒకవేళ వారి సమస్యల్ని అర్థం చేసుకున్నా.. ఇప్పటికిప్పుడు పరిష్కరించే పరిస్థితి లేదు. దీంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇదే ఇప్పుడు టీడీపీకి వరం కాబోతుంది అనిపిస్తోంది.
ఏపీలో జగన్ అధికారం చేపట్టి నాలుగేళ్లు పూర్తైంది. మరో 9 నెలల్లో ఎన్నికలొస్తాయి. ఈ లోపే ఎన్నికలకు సిద్ధం కావాలి. ప్రభుత్వం చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవాలి. ఈ విషయంలో జగన్‌కు అన్ని అవకాశాలు లేవు. ముఖ్యంగా ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జగన్ విఫలమయ్యారు. వాటిని చక్కబెట్టే అవకాశం కూడా ప్రస్తుతానికి లేనట్లే. ఉద్యోగుల హామీలు నెరవేర్చడానికి జగన్‌కు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి. ఉద్యోగుల అంశంపై తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీనిప్రకారం.. ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేసి.. జీపీఎస్ తీసుకురావడం, హెచ్ఆర్ఏ పెంపు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ వంటి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో జీపీఎస్‌ను ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.
అలాగే ఇటీవల ఉద్యోగులతో జరిగిన ఉమ్మడి స్థాయి సంఘం సమావేశంలో డీఏ, పీఆర్సీ బకాయిలను 2027 వరకు దశలవారీగా చెల్లిస్తామన్నారు. అంటే వచ్చే ఎన్నికలలోపు చెల్లింపులు ఉండవనే అర్థం. అందులోనూ తిరిగి జగన్ అధికారంలోకి వచ్చినా.. పాత బకాయిలు చెల్లించడానికి మరో మూడేళ్లు పడుతుంది. అప్పటికీ గ్యారెంటీగా చెల్లిస్తారో.. లేదో చెప్పలేం. ఇప్పటికే అనేక హామీల్ని తుంగలో తొక్కినట్లు ఈ హామీ విషయంలో కూడా కాలయాపన చేసే అవకాశం ఉంది. చెల్లింపులకు మరో నాలుగేళ్ల దాకా పట్టే అవకాశం ఉండగా.. తమ ప్రభుత్వం మాత్రం ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినట్లు ప్రచారం చేసుకుంటోంది.
టీడీపీకి వరంగా మారుతున్నాయా?
జగన్ నిర్ణయాలు టీడీపీకి వరంలా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఉద్యోగుల్ని జగన్ పూర్తిస్థాయిలో సంతృప్తి పరచలేకపోతున్నారు. ముఖ్యంగా సీపీఎస్ రద్దు విషయంలో జగన్ విఫలమవ్వడంపై ఉద్యోగులు ఆగ్రహంతో ఉన్నారు. అలాగే పీఆర్సీ, డీఏ బకాయిల్ని నాలుగేళ్లలో విడతలవారీగా చెల్లిస్తామన్నారు. దీనిపైనా ఉద్యోగులు సంతృప్తితో లేరు. జీపీఎస్ అమలును ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఉద్యోగలు క్రమబద్ధీకరణ విషయంలోనూ జగన్ భారం తప్పించుకునే ధోరణితో వ్యవహరిస్తున్నారు. పది వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకే జగన్ అనుమతించారు. దీంతో మిగతా ఉద్యోగులకు ఈ నిర్ణయం షాకిచ్చింది. దీంతో ఉద్యోగులందరినీ తనవైపు తిప్పుకొనేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు.
మేనిఫెస్టోలో ఉద్యోగుల డిమాండ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని టీడీపీ నిర్ణయించింది. సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, బకాయిల చెల్లింపు వంటివాటికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఎలాంటి షరతుల్లేకుండా వీటిని అమలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు తమపార్టీకి చెందని ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆధ్వర్యంలో ఉద్యోగుల్ని తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు. ఇదంతా సత్ఫలితాల్నిస్తే జగన్‌కు వచ్చే ఎన్నికల్లో బ్యాండ్ పడటం ఖాయం.