CM KCR: పథకాలతో జోష్ తెస్తున్న కేసీఆర్.. నిధులే అసలు సమస్య..?
కేసీఆర్ గతంలో ఎన్నికలకు ముందు నిరుద్యోగభృతి, రైతు రుణమాఫీ వంటి అనేక హామీలు ఇచ్చారు. వాటిలో చాలా వరకు నెరవేర్చలేదు. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే సంకల్పంతో ఉన్న కేసీఆర్.. ఇప్పుడు వాటిపై దృష్టిపెట్టారు.
CM KCR: ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం కేసీఆర్ కొత్త పథకాలు, వరాలు ప్రకటించేస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ అద్భుతం చేయబోతుందేమో అన్నంతగా ప్రచారం లభిస్తోంది. పథకాలు ప్రకటించడం సులువే. కానీ, వాటికి నిధుల సమీకరణే అసలు సమస్య.
కేసీఆర్ గతంలో ఎన్నికలకు ముందు నిరుద్యోగభృతి, రైతు రుణమాఫీ వంటి అనేక హామీలు ఇచ్చారు. వాటిలో చాలా వరకు నెరవేర్చలేదు. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే సంకల్పంతో ఉన్న కేసీఆర్.. ఇప్పుడు వాటిపై దృష్టిపెట్టారు. రైతు రుణమాఫీపై చర్చించారు. ఈ హామీని నాలుగేళ్లుగా అమలు చేయలేదు. గతంలో రూ.37 వేల కోట్ల రూపాయల వరకు రుణాలు మాఫీ చేసింది. మిగిలిన రుణాల్ని మాఫీ చేయాలంటే మరో రూ.19 వేల కోట్లు అవసరం. నిధుల కొరత కారణంగా గతంలో రుణమాఫీ చేయకపోయినా.. ఈసారి మాత్రం దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అంటే ఎన్నికల్లోపే రుణమాఫీపై ప్రకటన చేసి, అమలు చేసే అవకాశం ఉంది. ఆర్టీసీ కార్మికులు ఎప్పుడో అడిగి మర్చిపోయిన ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి తాజాగా ఆమోదం తెలిపారు. మరోవైపు హైదరాబాద్ పరిధిలో 415 కిలోమీటర్ల మేర మెట్రో రైలును విస్తరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీనికి రూ.69,100 కోట్లు అవసరమవుతాయని అంచనా.
మరిన్ని పథకాల్ని ప్రకటించేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారు. అయితే, వీటన్నింటికీ నిధులే అసలు సమస్య. ఆ విషయాన్ని కేసీఆరే గతంలో అనేక సార్లు వెల్లడించారు. మెట్రో రైల్ నిర్మాణానికి కేంద్రం నిధులు ఇవ్వడం లేదని ఇటీవలి కాలం వరకు ఆరోపించారు. కేంద్రం నిధులు ఇవ్వకుంటే ఇలాంటి ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్లడం కష్టమని కేటీఆర్ వంటి నేతలు చెప్పుకొచ్చారు. శంషాబాద్ వరకు మెట్రోకు నిధులు ఇవ్వడం లేదని ఆరోపించిన కేసీఆర్.. ఇప్పుడు హైదరాబాద్ నగరం మొత్తం మెట్రో విస్తారిస్తామని చెప్పడం నిజంగా ఎన్నికల స్టంటే. నగర శివారు ప్రాంతాల్లో పార్టీకి వ్యతిరేకత వ్యక్తమవుతోందనే మెట్రో రైలు ప్రాజెక్టు ప్రకటించారు. గతంలో ఆర్టీసీ విలీనం సాధ్యం కాదని కేసీఆర్ చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లోనూ సాధ్యం కాదన్నారు. కార్మికులు సమ్మె చేసినా పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం అడగకుండానే వరమిచ్చేశారు. ఇదంతా ఓట్ల కోసమే అని అర్థమవుతూనే ఉంది.
రుణమాఫీ గురించి రైతులు, ప్రతిపక్షాలు ఇంతకాలం నిలదీసినా స్పందించని కేసీఆర్.. ఈసారి మాత్రం నిధులు సర్దుబాటు చేసి, రుణమాఫీ చేసేందుకు రెడీ అయ్యారు. ఇలా ఆర్టీసీ కార్మికుల్ని, రైతుల్ని, హైదరాబాద్ వాసుల్ని ఆకట్టుకునేందుకు ఇలాంటి పథకాలు ప్రకటిస్తున్నారు. వీటికి నిధులు సమకూర్చడం, అమలు చేయడమే అసలు సమస్య.