BRS Party: ఎన్నికల మీద గులాబీ బాస్ ఫోకస్.. పార్టీ నేతలకు దిశానిర్దేశం..
బీఆర్‌ఎస్ బాస్ తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికల మీద ఫోకస్ చేశారు. తెలంగాణలో మరో ఆరు నెలల్లో ఎన్నికలు రానున్నాయి. దీంట్లో ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన నెల రోజులు తీసేస్తే 5 నెలలు. అంటే ఐదు నెలల్లో తెలంగాణలో ఎన్నికల పోరు ప్రారంభం కానుంది. దీంతో తన సైన్యాన్ని సిద్ధం చేసుకునే పనిలో ఉన్నారు గులాబీ దళపతి. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో బీఆర్‌ఎస్ భవన్‌లో మీటింగ్ నిర్వహించారు. 20 రోజుల వ్యవధిలోనే పార్టీ నేతలతో రెండు సార్లు కేసీఆర్ మీటింగ్ నిర్వహించడం ఇంట్రెస్టింగ్‌గా మారింది.
ఎన్నికలను ఉద్దేశించి పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ కీలక సూచనలు చేశారు. తెలంగాణ ప్రజలు ఏ పార్టీని నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే 105 సీట్లు ఖచ్చితంగా గెలుస్తామని ధీమాగా చెప్పారు. ధైర్యంగా ఎన్నికలకు వెళ్లండి అంటూ పార్టీ నేతల్లో ఉత్సాహం నింపారు. ఈ పదేళ్లలో తెలంగాణలో చేసిన అభివృద్ధే బీఆర్‌ను మూడోసారి గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. పదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని పల్లెపల్లెకు వెళ్లి వివరించండి అంటూ ఎమ్మెల్యేలకు ప్రజా ప్రతినిధులకు వివరించారు కేసీఆర్. గ్రామాల్లో స్థానిక నేతలు పెట్టే మీటింగ్స్ చెరువు గట్లపై పెట్టండి అంటూ చెప్పారు. పొలాల గట్లమీద గ్రామస్థులతో సమావేశాలు నిర్వహించాలని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి మొత్తం గ్రామాల్లోనే కనిపిస్తోందని చెప్పారు కేసీఆర్. ఇక నుంచి లీడర్లు నియోజకవర్గాలకే పరిమితం కావాలని ఆదేశించారు. ప్రతిక్షణం ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాల్లో పర్యటించాలని చెప్పారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఇక జూన్ 2 నుంచి 21 రోజల పాటు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహించాలని సూచించారు కేసీఆర్. జిల్లా మంత్రులు ఈ బాధ్యత తీసుకోవాలని చెప్పారు. ఆయా జిల్లాల మంత్రులు కూడా జిల్లాలకే పరిమితం కావాలని చెప్పారు. తెలంగాణ సాధించిన ప్రగతిని కళ్లకు కట్టినట్టు చూపించేలా ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని చెప్పారు.
ఇక కాంగ్రెస్ పార్టీ మీద విమర్శనాస్త్రాలు సంధించారు. 70 ఏళ్లు అధికారంలో ఉన్నా తెలంగాణకు రూపాయి న్యాయం కూడా చేయలేదంటూ ఆరోపించారు. అయితే తెలంగాణలో బలంగా మారుతున్న బీజేపీని వదిలిపెట్టి కాంగ్రెస్ మీద కేసీఆర్ విమర్శలు చేయడం ఇప్పడు హాట్ టాపిక్‌గా మారింది. కర్ణాటక ఫలితంతో సీఎంకు కాంగ్రెస్ టెన్షన్ పట్టుకుందనే వాదనలు వినిపిస్తున్నాయి.