CM KCR: ప్రతిపక్షాలపై గులాబి ఆకర్ష్.. అసంతృప్తులకు గాలం వేస్తున్న సీఎం కేసీఆర్..
రాబోయే రెండు నెలల్లో కాంగ్రెస్, బీజేపీకి చెందిన నేతలు చాలా మంది బీఆర్ఎస్‌లో చేరబోతున్నట్లు తెలుస్తోంది. వీళ్లంతా పెద్ద నేతలే కావడంతో భారీ సభల్లోనే కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలపై ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లోని అసంతృప్తులను బీర్ఎస్‌లో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే కొందరు నేతలతో చర్చలు జరిగాయి. వీరిలో కొందరు గులాబి కారెక్కేందుకు సిద్ధంగా ఉన్నారు. మరికొందరితో చర్చలు జరుగుతున్నాయి. రాబోయే రెండు నెలల్లో కాంగ్రెస్, బీజేపీకి చెందిన నేతలు చాలా మంది బీఆర్ఎస్‌లో చేరబోతున్నట్లు తెలుస్తోంది. వీళ్లంతా పెద్ద నేతలే కావడంతో భారీ సభల్లోనే కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
తమతోపాటు అనుచరగణం అంతా బీఆర్ఎస్‌లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కాంగ్రెస్ తిరిగి బలపడుతోంది. అందుకే ఈ జిల్లాలపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుతం నల్గొండలో అందరూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నప్పటికీ, ఎంపీలు మాత్రం కాంగ్రెస్ నుంచే ఉండటం బీఆర్ఎస్‌కు ఇబ్బంది కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కూడా నల్గొండలో క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది బీఆర్ఎస్. మరోవైపు కాంగ్రెస్‌కు చెందిన ఒక అగ్రనేత ఆ పార్టీని వీడి భార్యతో కలిసి బీఆర్ఎస్‌లో చేరబోతున్నట్లు తెలుస్తోంది. తనకు ఎమ్మెల్యే పదవి, భార్యకు ఎమ్మెల్సీ పదవి హామీతో ఆయన బీఆర్‌ఎస్‌లో చేరేందుకు అంగీకరించారు. పెద్ద సభ ఏర్పాటు చేసి ఆయన గులాబి కండువా కప్పుకొంటారు. మరోవైపు ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఇద్దరు కీలక నేతలు కూడా బీఆర్ఎస్‌లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు.
వారిలో ఒకరు కాంగ్రెస్ నుంచి కాగా.. మరొకరు బీజేపీ నుంచి అని తెలుస్తోంది. వీరిలో సొంత సామాజికవర్గానికి చెందిన నేతను చేర్చుకునే విషయంలో మాత్రం కేసీఆర్ అంత సానుకూలంగా లేరని తెలుస్తోంది. ఆయన నియోజకవర్గం విషయంలో ఇబ్బంది ఉండటం వల్లే ఇలా జరుగుతోందంటున్నారు. ఆ నేత తన సొంత నియోజకవర్గం నుంచి కాకుండా.. మరో చోటు నుంచి పోటీ చేయాలని ఆశిస్తున్నారు. దీనికి కేసీఆర్ ఒప్పుకోవడం లేదు. ఉమ్మడి మెదక్‌కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత మాత్రం త్వరలోనే బీఆర్ఎస్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయన కూడా త్వరలోనే భారీ ఎత్తున బీఆర్ఎస్‌లో చేరుతారు.
మరోవైపు ఉమ్మడి మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన కొందరు కాంగ్రెస్, ఇతర పార్టీల అసంతృప్తులపై బీఆర్ఎస్ గురిపెట్టింది. ప్రస్తుతం వీరితో చర్చలు జరుగుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌కు చెందిన ఒక కీలక నేత కూడా త్వరలోనే కారెక్కే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మహబూబ్ నగర్ జిల్లా నుంచి కూడా కీలక నేతలే రాబోతున్నారు. ఇటు ప్రతిపక్షాల్లోని నేతలపై గులాబీ బాస్ కన్నేస్తే.. బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్, బీజేపీ గురిపెట్టాయి.