Kasoju Shankaramma: శ్రీకాంతాచారి తల్లికి మళ్లీ హ్యాండ్ ఇచ్చిన కేసీఆర్.. ఎమ్మెల్సీ ఇస్తారని చివరి వరకూ ప్రచారం.. ఆ మాటెత్తని కేసీఆర్..!
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల చివరి రోజు కొందరు అమర వీరుల కుటుంబాల్ని పిలిచి సత్కరించారు. వారిలో శంకరమ్మ కూడా ఉన్నారు. అమరవీరులను గుర్తు చేస్తూ కేసీఆర్.. గవర్నర్ కోటాలో ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని అందరూ ఆశించారు. దీనిపై సభా వేదికపైనే ప్రకటన కూడా చేస్తారని బాగా ప్రచారం కూడా జరిగింది.
Kasoju Shankaramma: తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు సీఎం కేసీఆర్ మళ్లీ హ్యాండ్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. శంకరమ్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ప్రచారం జరిగినా కేసీఆర్ ఆ ఊసే ఎత్తలేదు. దీంతో గత వారం రోజులుగా సాగిన ప్రచారం ఉసూరుమనిపించింది. తెలంగాణ తుది దశ ఉద్యమంలో శ్రీకాంతాచారి ఆత్మ బలిదానానికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడంలో శ్రీకాంతాచారితోపాటు మరెందరో అమరవీరుల త్యాగాలు కీలకపాత్ర పోషించాయి.
ఉద్యమం సాగుతున్న సమయంలో.. ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అమరుల కుటుంబాలను ఆదుకుంటామని కేసీఆర్ సహా అప్పటి టీఆర్ఎస్ నేతలు ఊదరగొట్టారు. అనుకున్నట్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరుగుతుందని ఆ కుటుంబాలతోపాటు, తెలంగాణ సమాజం ఆశించింది. కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం వారిని పట్టించుకోలేదు. శంకరమ్మకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చినా ఆమె గెలవలేకపోయింది. ఆ తర్వాత ఆమెకు ఎమ్మెల్సీ ఇస్తారంటూ చాలా ఏళ్లుగా ప్రచారం జరుగుతోంది. కానీ, కేసీఆర్ కానీ, బీఆర్ఎస్ నేతలు కానీ ఎవరూ ఈ అంశంపై స్పందించలేదు. ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు కేసీఆర్ ప్రభుత్వంలో సరైన న్యాయం జరగలేదనే అపవాదు ఉంది.
అమరవీరుల కుటుంబాల్ని, ఉద్యమకారుల్ని కేసీఆర్ గాలికొదిలేశాడని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు విమర్శిస్తుంటాయి. అయితే, వారికి సమాధానం ఇవ్వాలి అన్నట్లేమో అమరవీరుల స్మారక స్థూపం మాత్రం నిర్మించారు. హైదరాబాద్ నడిబొడ్డున కోట్ల రూపాయలతో నిర్మించిన స్థూపాన్ని ఇటీవల కేసీఆర్ ప్రారంభించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల చివరి రోజు కొందరు అమర వీరుల కుటుంబాల్ని పిలిచి సత్కరించారు. వారిలో శంకరమ్మ కూడా ఉన్నారు. అమరవీరులను గుర్తు చేస్తూ కేసీఆర్.. గవర్నర్ కోటాలో ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని అందరూ ఆశించారు. దీనిపై సభా వేదికపైనే ప్రకటన కూడా చేస్తారని బాగా ప్రచారం కూడా జరిగింది. ఇప్పటికైనా ఆమెకు న్యాయం జరుగుతుందని అందరూ అనుకున్నారు.
కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కేసీఆర్ శంకరమ్మకు మరోసారి రిక్తహస్తం చూపించారు. ఎమ్మెల్సీ పదవిపై మాట కూడా మాట్లాడలేదు. ఎలాంటి హామీ ఇవ్వలేదు. సభావేదికపై కేవలం శాలువాతో సన్మానించి సరిపెట్టారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోపైనా శంకరమ్మకు పదవి ఇచ్చి గౌరవిస్తారా..? లేదా చూడాలి.