BRS MLA’S LIST: ఆ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇచ్చి షాకిచ్చిన కేసీఆర్..? అంత నమ్మకం ఏంటి..?

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చాలా వ్యతిరేకత ఉందని, అందువల్ల కనీసం ముప్పై మంది సిట్టింగులకు ఛాన్స్ దక్కకపోవచ్చని ప్రచారం జరిగింది. కొందరిపై ఇటీవలి కాలంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది కూడా. దీంతో వారిలో చాలా మందికి టిక్కెట్లు దక్కకపోవచ్చని ప్రచారం జరిగింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 21, 2023 | 08:01 PMLast Updated on: Aug 21, 2023 | 8:01 PM

Cm Kcr Give Shock To Those Mlas Who Are Facing Criticism

BRS MLA’S LIST: కేసీఆర్ ప్రకటించిన 115 మందిలో ఎనిమిది మంది మినహా మిగిలిన అన్ని చోట్లా సిట్టింగులకే తిరిగి ఛాన్స్ ఇచ్చారు. అంటే 107 మంది సిట్టింగులే మళ్లీ ఎమ్మెల్యేలుగా పోటీ చేయబోతున్నారు. నిజానికి ఇది ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చాలా వ్యతిరేకత ఉందని, అందువల్ల కనీసం ముప్పై మంది సిట్టింగులకు ఛాన్స్ దక్కకపోవచ్చని ప్రచారం జరిగింది. కొందరిపై ఇటీవలి కాలంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది కూడా.

దీంతో వారిలో చాలా మందికి టిక్కెట్లు దక్కకపోవచ్చని ప్రచారం జరిగింది. కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. కేసీఆర్ వారందరికీ టిక్కెట్లు ఇచ్చారు. మానకొండూరు ఎమ్మెల్యే రసమయిపై స్థానికంగా చాలా వ్యతిరేకత్ వ్యక్తమైంది. దళితబందుసహా అనేక అవినీతి ఆరోపణలు ఆయనపై వచ్చాయి. రసమయి అనుచరులే ఆయనకు టిక్కెట్ ఇవ్వొద్దంటూ కేసీఆర్‌ను కోరారు. అయినప్పటికీ రసమయికి టిక్కెట్ దక్కింది. ఇక మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్‌ నాయక్‌‌కు వ్యతిరేకంగా కూడా ఇలాంటి ప్రచారమే జరిగింది. పైగా ఇటీవల జరిగిన ఒక సభలో కేటీఆర్ చేయి పట్టుకునేందుకు శంకర్ నాయక్ ప్రయత్నిస్తే, కేటీఆర్ విదిలించుకున్నారు. దీంతో రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆయనకు టిక్కెట్ ఇవ్వకపోవచ్చని ప్రచారం జరిగింది. శంకర్ నాయక్ అనుచరులు కూడా ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేసినా.. చివరకు ఆయనకే టిక్కెట్ దక్కింది.

ఇక లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు కూడా టిక్కెట్ కేటాయించారు. ఆయనపై శేజల్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల కోర్టు తీర్పు ద్వారా ఎమ్మెల్యే సభ్యత్వం రద్దైన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వేంకటేశ్వర రావుకు, అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌కు టిక్కెట్లు దక్కకపోవచ్చని ప్రచారం జరిగింది. కానీ, వీళ్లందరికీ టిక్కెట్లు కేటాయించి కేసీఆర్ ఒకరకంగా షాకిచ్చారనే చెప్పాలి. ఇన్ని ఆరోపణల్ని, వ్యతిరేకతను కేసీఆర్ పరిగణనలోకి తీసుకోలేదు. ఇంత వ్యతిరేకత ఉన్నా.. గెలుస్తారనే నమ్మకంతో టిక్కెట్లు ఎలా ఇచ్చారనే సందేహాలు విశ్లేషకుల్లో వ్యక్తమవుతున్నాయి.