CM KCR: గ్రేటర్ హైదరాబాద్‌లో ముగ్గురు సిట్టింగులకు బీఆర్‌ఎస్ నో.. ఎవరెవరు..?
స్థానికంగా మారిన రాజకీయ సమీకరణాల దృష్ట్యా.. గ్రేటర్ హైదరాబాద్‌లో అసెంబ్లీ టికెట్ల కేటాయింపుపై అధికార బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ముగ్గురు బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్స్ ఇవ్వొద్దని గులాబీ దళం అధినాయకత్వం డిసైడ్ చేసిందట.
CM KCR: తెలంగాణలోని ఇతర జిల్లాల రాజకీయాలకు.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పాలిటిక్స్‌కు చాలా తేడా ఉంటుంది. ఈ రెండు చోట్లా ఓటర్లను ప్రభావితం చేసే అంశాలు కూడా డిఫరెంట్‌గా ఉంటాయి. స్థానికంగా మారిన రాజకీయ సమీకరణాల దృష్ట్యా.. గ్రేటర్ హైదరాబాద్‌లో అసెంబ్లీ టికెట్ల కేటాయింపుపై అధికార బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ముగ్గురు బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్స్ ఇవ్వొద్దని గులాబీ దళం అధినాయకత్వం డిసైడ్ చేసిందట. రంగారెడ్డి జిల్లాలో జీహెచ్‌ఎంసీ లిమిట్స్‌లో ఉన్న ఒక నియోజకవర్గం, సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలోని మరో నియోజకవర్గం, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో కొత్త వారికి టికెట్స్ ఇస్తారనే టాక్ వినిపిస్తోంది.
ఎమ్మెల్యే సాయన్న మృతితో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ సీటు ఖాళీ అయింది. ఇక్కడి నుంచి సాయన్న కూతురు లాస్య, ఎం. క్రిశాంక్, ఎరోళ్ల శ్రీనివాస్ టికెట్ ఆశిస్తున్నారు. స్థానికంగా ఉన్న ప్రాబల్యం, గెలుపు అవకాశాలు, సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా ఎవరికి అసెంబ్లీ టికెట్ ఇవ్వాలనేది తేలుస్తామని బీఆర్ఎస్ పెద్దలు తేల్చి చెబుతున్నారట. సర్వే రిపోర్ట్స్‌లో వచ్చే రిజల్ట్స్ ఆధారంగా తమ నిర్ణయం ఉంటుందని పలువురు ఆశావహులకు చెప్పినట్టు తెలుస్తోంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న ఒక నియోజకవర్గంలో ప్రచారాన్ని ప్రారంభించాలని పార్టీకి చెందిన ఒక లీడర్‌కు సీఎం కేసీఆర్ చెప్పారట. ఆ లీడర్‌కు ప్రచారంలో హెల్ప్ చేయాలని గ్రేటర్ హైదరాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు సీఎం సూచించారట. ఇంతకీ ఏదా అసెంబ్లీ స్థానం అనే దానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది.
ఆ నియోజకవర్గాల సిట్టింగ్‌లకు చెక్..
గ్రేటర్ హైదరాబాద్‌లోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల లెక్క చూస్తే.. ప్రస్తుతం మజ్లిస్‌కు ఏడుగురు, బీజేపీకి ఒకరు, బీఆర్ఎస్‌కు 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్ నుంచి సుధీర్‌రెడ్డి కాంగ్రెస్ తరఫున గెలిచినప్పటికి.. ఇప్పుడు వారిద్దరూ బీఆర్ఎస్లోనే ఉన్నారు. మజ్లిస్ పోటీలో ఉండే 7 స్థానాల్లో బీఆర్ఎస్ పెద్దగా ఫోకస్ పెట్టబోదు. ఎందుకంటే ఆ రెండు పార్టీల మధ్య అనధికార పొత్తు ఉంది. అత్యంత ముఖ్యమైన అంశం ఏమిటంటే.. గత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలున్న పలు నియోజకవర్గాల్లో గులాబీ దళానికి గట్టి షాక్స్ తగిలాయి. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని అన్ని వార్డుల్లో బీజేపీ గెలిచింది. ముషీరాబాద్‌లోనూ ఒక్క సీటూ గెలవలేకపోయింది. అంబర్‌పేటలో రెండు వార్డుల్లోనే గెలవగలిగింది. హబ్సిగూడ వార్డులో ఉప్పల్ ఎమ్మెల్యే భార్య ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో గోషామహల్, అంబర్‌పేట్, ముషీరాబాద్, ఉప్పల్ సహా పలు స్థానాల్లో గట్టి పోటీ ఉంటుందని కేసీఆర్ అండ్ టీమ్ అంతర్గత సర్వేల్లో తేలిందట. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్స్‌తో అలర్ట్ అయిన బీఆర్ఎస్.. మున్సిపల్ ఎన్నికల్లో నెగెటివ్ రిజల్ట్స్ వచ్చిన ప్రాంతాలున్న అసెంబ్లీ నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఛాన్స్‌ను కోల్పోనున్న ఆ ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఈ కేటగిరీ నియోజకవర్గాల వారేనని తెలుస్తోంది.
బీఆర్ఎస్ నేతల మధ్య విబేధాలు ఇలా..
టికెట్ల కోసం పోటీపడే క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ నేతల మధ్య విబేధాలు కొన్నిసార్లు వీధికెక్కుతున్నాయి. మేడ్చల్ నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి బహిరంగంగానే తమ ఆధిపత్యం చూపేలా వ్యవహరిస్తున్నారు. మహేశ్వరంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డికి బదులుగా తనకు టికెట్ ఇవ్వకపోతే పార్టీతో తాడో పేడో తేల్చుకుంటానంటూ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి బహిరంగంగానే ఆల్టిమేట్టం ఇస్తున్నారు. అంబర్‌పేటలో గత ఎన్నికల్లో బీజేపీ నేత కిషన్‌రెడ్డిపై గెలిచిన న్యాయవాది.. కాలేరు వెంకటేశ్ మళ్లీ టికెట్ తనదే అంటున్నారు. అయితే అంబర్‌పేట నుంచి 2014లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఎడ్ల సుధాకర్‌రెడ్డి మళ్లీ పూర్తిస్థాయిలో రంగంలోకి దిగారు.
రాజేంద్రనగర్‌లో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌కు పోటీగా.. మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్‌రెడ్డి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఖైరతాబాద్‌లో దానం నాగేందర్ తనకే మళ్లీ టికెట్ అంటుండగా.. ఉద్యమకాలం నుంచి పార్టీని నమ్ముకున్న తనకు ఎందుకు ఇవ్వరని సీనియర్ నేత మన్నె గోవర్ధన్‌రెడ్డి వంటి నేతలు అడుగుతున్నారు. ముషీరాబాద్ మళ్లీ తనదేనని ముఠా గోపాల్ అంటుండగా.. దివంగత మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి, టీడీపీ నుంచి బీఆర్ఎస్లో చేరిన ఎమ్ఎన్ శ్రీనివాస్ తదితరులు టిక్కెట్ ఆశిస్తున్నారు.