CM KCR: కేసీఆర్ ఊపిరి పీల్చుకో.. సొమ్ములొస్తున్నాయ్..!
ఎన్నికల వేళ సంక్షేమ పథకాల అమలుకు కావలసినంత సొమ్ములు ఖజానాకు చేరుతున్నాయి. అప్పుకోసం అటూ ఇటూ చూడకుండా అన్నీ అలా కలసి వస్తున్నాయి కేసీఆర్ సాబ్‌కి.
CM KCR: ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి ఒకదానికొకటి శుభవార్తలు వినవస్తున్నాయి. ఎన్నికల వేళ సంక్షేమ పథకాల అమలుకు కావలసినంత సొమ్ములు ఖజానాకు చేరుతున్నాయి. అప్పుకోసం అటూ ఇటూ చూడకుండా అన్నీ అలా కలసి వస్తున్నాయి కేసీఆర్ సాబ్‌కి.
తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ఏటా రూ.55వేల కోట్ల నుంచి రూ.60వేల కోట్ల వరకు ఖర్చు పెడుతుంది. కానీ ఈసారి ఎన్నికల సీజన్ కావడంతో ఎప్పట్నుంచో పెండింగ్‌లో ఉన్న రుణమాఫీకి బూజు దులిపింది. దీనికి రూ.19వేల కోట్లు కావాల్సి ఉంది. ఇచ్చిన హామీలు, ఇవ్వాల్సిన హామీలు చాలానే ఉన్నాయి. అవన్నీ అమలు చేయాలంటే ఖజానా కాసులతో గలగలలాడాల్సిందే. ఈ ఏడాది చివర్లోనే అసెంబ్లీ ఎన్నికలున్నాయి. కాబట్టి ఏ ఒక్క పథకాన్నీ వాయిదా వేసే పరిస్థితి లేదు. దీంతో నిధుల కటకట ఏర్పడింది. అయితే కేసీఆర్ ముందుచూపో లేక వ్యూహమో కానీ అసలు సమయంలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా బయట పడే అవకాశం దొరికింది.
భూముల అమ్మకం అదుర్స్..!
హెచ్ఎండీఏ తెలంగాణ ప్రభుత్వానికి కామధేనువుగా మారింది. భూముల అమ్మకం ఖజానాకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటివరకు జరిపిన భూముల వేలంలో ప్రభుత్వానికి రూ.8,529 కోట్ల ఆదాయం వచ్చి చేరింది. అందులో కోకాపేట, బుద్వేల్‌లోనే కాస్త అటూ ఇటుగా రూ.7వేల కోట్ల వరకు వచ్చాయి. మోకిలా వేలం కూడా పర్లేదనిపించింది. త్వరలో మోకిలా భూముల రెండో విడత వేలం జరగనుంది. 98,975 గజాలను వేలం వేయనున్నారు. దీని ద్వారానే రూ.800 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాకుండా మరికొన్ని భూములు కూడా వేలానికి రెడీ అవుతున్నాయి. వీటి ద్వారా మరో వేయి కోట్ల ఆదాయం రావచ్చు.
ఓఆర్ఆర్ లీజు సొమ్ములొచ్చేశాయ్..!
వివాదాస్పదమైన ఓఆర్ఆర్ బిడ్డింగ్ ద్వారా ప్రభుత్వానికి రూ.7,380 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ డబ్బును ఇప్పటికే ప్రభుత్వానికి చెల్లించిన ఐఆర్‌బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్ వే టోల్ వసూలు ఆపరేషన్లను తమ చేతుల్లోకి తీసేసుకుంది. దీనిపై పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఎన్ని ఆరోపణలు చేసినా ప్రభుత్వం మాత్రం సొమ్ములు ముఖ్యం కనుక సైలెంట్‌గా పనికానిచ్చేసింది. ఇక మద్యం టెండర్ల ప్రక్రియ నడుస్తోంది. మద్యం షాపులకు ఇంకా రెండు నెలల గడువు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆదరాబాదరాగా వాటిని ముందే లాటరీ తీయనుంది. అప్లికేషన్ల గడవు కూడా ముగియవచ్చింది. ఈ అప్లికేషన్ల ద్వారానే దాదాపు రూ.500 కోట్ల రూపాయల వరకు రావొచ్చు. ఇక మద్యం షాపుల కేటాయింపుల ద్వారా కూడా వేల కోట్లు ప్రభుత్వ ఖజానాకు జమకానున్నాయి. అవి కూడా వస్తే అవసరంలో సాయపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.
ఏ పథకానికి ఎంత..?
ఎన్నికల వేళ ప్రభుత్వం మరికొన్ని సంక్షేమ పథకాలను ప్రకటించాలని భావిస్తోంది. పెండింగ్ పథకాల పూర్తితో పాటు కొత్తవాటిని అమలు చేయడానికి దాదాపు 25వేల కోట్ల రూపాయల అవసరం. ఇప్పటికే దానికి అవసరమైన మొత్తం చాలావరకు ప్రభుత్వానికి చేరింది. దీంతో కేసీఆర్ ఊపిరి పీల్చుకున్నారు. రైతు రుణమాఫీకి రూ.19వేల కోట్లు ఖర్చవుతోంది. అలాగే నిరుపేదల గృహనిర్మాణానికి ఒక్కొక్కరికి రూ.3లక్షల సాయం అందించాల్సి ఉంది. బీసీ, మైనారిటీలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఉద్యోగులకు 10శాతం మధ్యంతర భృతిని ఇప్పటికే ప్రకటించింది. సామాజిక పెన్షన్లు పెంచాల్సి ఉంది. ఇంకా అమలు చేయాల్సినవి మరికొన్ని పథకాలు పెండింగ్‌లో ఉండిపోయాయి. మూడోసారి గెలవాలంటే దేన్ని పెండింగ్‌లో ఉంచకూడదని కేసీఆర్ భావిస్తున్నారు. ఇప్పుడు భూముల అమ్మకం, ఓఆర్ఆర్ లీజు డబ్బు రాకపోతే ప్రభుత్వానికి చేతులు ఆడేవి కావు. నిధుల కోసం నానాతంటాలు పడాల్సి వచ్చేది. కేంద్రం నుంచి కూడా రావాల్సిన బకాయిలు రావడం లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తనకు అందుబాటులో ఉన్న వనరుల నుంచి నిధులను సమీకరిస్తోంది. మొత్తానికి ఎన్నికల సమయంలో అప్పు కోసం దేవులాడే పరిస్థితి రాకుండా కేసీఆర్ ముందు జాగ్రత్తపడ్డారు. మరి ఇక కొత్త సంక్షేమ పథకాలను ప్రకటిస్తారేమో చూడాలి.