CM kcr MLA’s List:బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనకు రంగం సిద్ధం.. కేసీఆర్ లిస్టులో ఉన్నదెవరు ? లేనిదెవరు ?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్‌డౌన్ మొదలుకావడంతో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకుని హ్యాట్రిక్ విజయంతో దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న ఆయన ఎవరెవర్ని ఎక్కడెక్కడ నుంచి పోటీకి దింపాలనే దానిపై ఇప్పటికే ఓ క్లారిటికి వచ్చారు. నియోజకవర్గాల వారీగా వివిధ సందర్భాల్లో సర్వేలు నిర్వహించిన కేసీఆర్ ఆ రిపోర్టు ఆధారంగా అభ్యర్థులను ప్రకటించబోతున్నారు.
అన్నీ అనుకున్నట్టు జరిగితే జులై 15 తర్వాత ఏ క్షణంలోనైనా బీఆర్ఎస్ అభ్యర్థులను కేసీఆర్ స్వయంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయా స్థానాల్లో సిట్టింగులపై ప్రజల వైఖరి ఎలా ఉంది.. వాళ్లు మళ్లీ పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఎంత వరకు ఉన్నాయి.. సిట్టింగులపై వ్యతిరేకత ఉంటే.. అభ్యర్థిగా ఎవరికి అవకాశం ఇవ్వాలని..ఇలా అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని కేసీఆర్ అభ్యర్థుల జాబితాను సిద్ధం చేస్తున్నట్టు న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఓ కథనాన్ని ప్రచురించింది.
వచ్చే నెలలో 80 సీట్లకు అభ్యర్థుల ప్రకటన ?
మొత్తం అసెంబ్లీ స్థానాలకు రెండు విడతలుగా అభ్యర్థులను ప్రకటించే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ముందుగా 80 సీట్లకు జులైలో క్యాండిడేట్స్‌ను ప్రకటించి మిగతా స్థానాలకు మరో దఫాలో ఫైనల్ చేయబోతున్నారు. తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే.. ఫస్ట్ లిస్ట్‌లో ఉండే ఆ 80 మంది ఎవరన్న దానిపై పార్టీ వర్గాల్లోనూ, ఆశావహుల్లోనే తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. సర్వే నివేదికలో ఏముందో… ఈసారి కేసీఆర్ తమకు అవకాశం ఇస్తారో లేదో అన్న టెన్షన్ సిట్టింగ్‌లలో కనిపిస్తోంది.
సీక్రెట్ సర్వేలో పాస్ మార్కులు పడ్డాయా ?
మరికొన్ని నెలల్లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలేంటి ? ఎన్నికల సమయంలో కోట్లు కుమ్మరించే ఆర్థిక స్తోమత ఉండాలా ? కేసీఆర్ లేదా కేటీఆర్‌తో బాగా చనువు ఉండాలా ? లాబీయింగ్ చేసుకుంటే టిక్కెట్ వస్తుందా ? అభ్యర్థిని ఎంపిక చేసి బీఫారం ఇవ్వడానికి కేసీఆర్ ఇలాంటి వాటిని అసలు పట్టించుకోవడం లేదు. కేవలం నియోజకవర్గంలో ఆయా సిట్టింగ్ ఎమ్మెల్యే లేదా పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థికి ఎంత పట్టు ఉంది..? పలానా వాళ్లు పోటీ చేస్తే కచ్చితంగా గెలిచితీరుతారని సర్వేలు చెబుతున్నాయా లేదా… కేవలం ఈ పాయింట్‌ను ఆధారంగా చేసుకునే కేసీఆర్ టిక్కెట్లు కేటాయించబోతున్నట్టు తెలుస్తోంది. దీని కోసం కొంతకాలంగా రహస్యంగా సర్వే నిర్వహిస్తున్న కేసీఆర్ ఎన్ని మార్కులొస్తే టిక్కెట్ ఇవ్వాలో కూడా డిసైడ్ అయిపోయారంట.
కనీసం 40 శాతం రేటింగ్ ఉంటేనే టిక్కెట్
అభ్యర్థుల బలాబలాలు, నియోజకవర్గంలో పరిస్థితులు అందరికీ ఒకేరకంగా ఉండవు. అందుకే రహస్య సర్వేలో వచ్చిన డేటా ఆధారంగా టిక్కెట్లు కేటాయించాలనుకున్న వారికి కేసీఆర్ పాస్ మార్క్ స్కేల్ పెట్టుకున్నారు. కేసీఆర్ లెక్కల ప్రకారం 35 శాతం కనీస మార్కులతో పాస్ అయితే వాళ్లకు టిక్కెట్ రానట్టే. అసెంబ్లీ టిక్కెట్ పొందాలంటే.. కనీసం 40 నుంచి 45 శాతం పాజిటివ్ రేటింగ్ ఉండాల్సిందే. అలాంటి వారికే ఈసారి బీఫారం ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈమాత్రం పాస్ పర్సెంటేజ్ ఉన్నవారికి జులై రెండు లేదా మూడో వారంలో టిక్కెట్లు ప్రకటించడం ద్వారా వాళ్లను పూర్తి స్థాయిలో నియోజవర్గాలకే పరిమితం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఎన్నికల నాటికి పోటీ చేసే స్థానంపై పూర్తి స్థాయి పట్టు సాధించడం ద్వారా అధిక మెజార్టీతో గెలిపించుకోవచ్చన్నది కేసీఆర్ ఆలోచనగా కనిపిస్తోంది. ఈ ఏడాది డిసెంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశముంటే.. మొదటి విడతలో టిక్కెట్లు పొందిన అభ్యర్థులకు నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో ఫోకస్ పెట్టడానికి కనీసం నాలుగు నెలల సమయం దొరుకుతుంది. కొద్దో గొప్పో వ్యతిరేకత ఉన్నా.. త్వరగా ప్రజల్లోకి వెళ్లడం ద్వారా దాన్ని అధిగమించవచ్చు.
మిగతా అభ్యర్థుల సంగతేంటి ?
వచ్చే నెలలో 80 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలనుకుంటున్న కేసీఆర్… కొంత గ్యాప్ తీసుకుని మిగతా 39 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ 39 స్థానాలపై కేసీఆర్ ఆచితూచి స్పందించవచ్చు. వీటిలో 10-15 స్థానాల్లో అభ్యర్థులను మార్చే ఆలోచనలో కూడా కేసీఆర్ ఉన్నారు. వామపక్షాలతో పాటు ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంటే వాళ్లకు కొన్ని సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. అందుకే ఈ 39 స్థానాలపై కేసీఆర్ మరో సర్వే నిర్వహించిన తర్వాత మాత్రమే అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తున్నారని పార్టీ వర్గాల సమాచారం.
ఇన్ని నెలల ముందే అభ్యర్థుల ప్రకటన ఎందుకు ?
కేసీఆర్ ప్రతి ఆలోచన వెనుక కొన్ని వ్యూహాలు ఉంటాయి. అందుకు తగ్గట్టే ఆయన అడుగులు వేస్తారు. అభ్యర్థులను ముందుగా ప్రకటించడం వెనుక కూడా కేసీఆర్ అలాంటి స్ట్రాటజీనే ఫాలో అవుతున్నారు. పార్టీకి ఎంత వీరవిధేయులుగా ఉన్నా.. టిక్కెట్ ఆశించి భంగపడ్డ వారు రెబల్స్ గా మారే ప్రమాదముంది. ఒకేసారి 80 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం ద్వారా ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు, ఆశావహుల విషయంలో గ్రౌండ్ రియాల్టీ ఏంటో తెలిసిపోతుంది. పార్టీ టిక్కెట్ దక్కని వారిని బుజ్జగించే అవకాశం లభిస్తుంది. ఎవరైనా తిరుగుబాటు చేస్తే వారి వల్ల, వాళ్ల వర్గం కారణంగా.. నియోజకవర్గంలో గెలుపు అవకాశాలు తగ్గకుండా.. ఫోకస్ చేయడానికి తగిన సమయం దొరుకుతుంది. ఇలాంటి ఎన్నో విషయాలను పరిగణలోకి తీసుకుని కేసీఆర్ టిక్కెట్ల ప్రకటన చేయబోతున్నట్టు తెలుస్తోంది.