CM KCR: కాంగ్రెస్ గ్యారెంటీలకు ధీటుగా కొత్త పథకాలు రెడీ చేస్తున్న కేసీఆర్..!
తెలంగాణలో సంక్షేమ పథకాలు ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే ఎన్నికలకు ముందు కొత్త సంక్షేమ పథకాల్ని ప్రకటించేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారని ఆ పార్టీ నేతలు అంటున్నారు

CM KCR: తెలంగాణలో షెడ్యూల్ ప్రకారం వచ్చే నెలలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవ్వాలి. దీంతో ప్రభుత్వం ఏం చేసినా ఈ లోపే చేయాలి. అభివృద్ధి కార్యక్రమాలు, కొత్త పథకాల ప్రకటన, అమలు వంటివి ఇప్పుడే మొదలుపెట్టాలి. నోటిఫికేషన్ వెలువడ్డాక ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే ఏం చేసే అవకాశం ఉండదు. అందుకే ఇప్పుడు సీఎం కేసీఆర్ కొత్త పథకాల్ని రూపొందిస్తున్నాడు. అది కూడా కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు ధీటుగా, తెలంగాణ ప్రజల్ని ఆకర్షించేలా కొత్త సంక్షేమ పథకాల్ని సిద్ధం చేస్తున్నారు.
తెలంగాణలో సంక్షేమ పథకాలు ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తాయి. వ్యక్తిగతంగా తమకు లేదా తమ కుటుంబానికి కలిగే లబ్ధి ఆధారంగానే జనాలు ఓట్లు వేసి, ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. అందుకే ఎన్నికలకు ముందు కొత్త సంక్షేమ పథకాల్ని ప్రకటించేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఈ పథకాలపై చర్చించేందుకే శుక్రవారం మంత్రివర్గ భేటీ జరగనుంది. ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ పథకాలు ఉండబోతున్నాయని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.
కాంగ్రెస్ గ్యారెంటీలతో బీఆర్ఎస్‌లో గుబులు
తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు పోటీ ఇవ్వబోయేది కాంగ్రెస్ పార్టీనే. కాంగ్రెస్ ప్రస్తుతం బలంగా ఉంది. అదే సమయంలో ఇటీవల కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ఆ పార్టీకి బూస్టప్ ఇచ్చాయి. వీటికి జనాల్లో మంచి స్పందన కనిపిస్తోంది. నిరుద్యోగ భృతి, మహిళలకు ఆర్థిక సాయం, రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్, రైతులకు పెట్టుబడి సాయం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, ఇందిరమ్మ ఇల్లు, యువ వికాసం, చేయూత పథకాల్ని ప్రకటించింది. ఈ తరహా పథకాలతోనే కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ విజయభేరి సభలో ప్రకటించిన ఈ 6 గ్యారంటీలు హాట్ టాపిక్ అయ్యాయి.
ఇవి ప్రకటించినప్పట్నుంచి గ్యారంటీలకు బీఆర్ఎస్ కౌంటరిచ్చే పనిలో పడింది. కేవలం గ్యారంటీల ప్రకటనకే బీఆర్ఎస్ ఉలిక్కిపడుతోందని హస్తం నేతలు అంటున్నారు. ఈ గ్యారెంటీలు జనంలోకి మరింత సానుకూల ఫలితాలు పంపితే బీఆర్ఎస్‌కు ఓటమి ఖాయం. అందుకే ఆరు గ్యారెంటీలకు ధీటుగా తమ మ్యానిఫెస్టో ఉంటుందని గులాబీ పార్టీ చెబుతోంది. దీంతో రాబోయే ఎన్నికల ప్రచారమంతా పథకాల మీదే ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. ఎవరి పథకాల్ని ప్రజలు నమ్ముతారు.. ఎవరికి ఓటేస్తారనేది తేలాల్సి ఉంది.